దాహం కేకలు (గుంటూరు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దాహం కేకలు (గుంటూరు)

గుంటూరు, జూలై 19 (way2newstv.com): 
జిల్లాలోని మున్సిపాలిటీల్లో మంచినీటి సంక్షోభం ముదురుతోంది. రక్షిత పథకాల చెరువులు నిండుకుంటుండగా అధికారులు ప్రత్యామ్నాయంగా బోర్లు వేసి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. జులై వచ్చినా తీవ్ర వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండడం తాగునీటి సరఫరాపై ప్రభావాన్ని చూపుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా డెల్టాలోను ఈ సమస్య ఏర్పడింది. డెల్టాలో మార్చి నెలాఖరున, పల్నాడులో ఏప్రిల్‌లో కాల్వలకు చివరిగా నీరు రావడంతో అప్పట్లో అధికారులు చెరువులు నింపారు. వాటి నిల్వ సామర్థ్యం మూడు నెలలు మాత్రమే కాగా ఎండలు మండిపోయి అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎక్కువగా ఆవిరైపోయింది. జూన్‌లో సరిగా వర్షాలు కురవలేదు.
దాహం కేకలు (గుంటూరు)

40 శాతానికిపైగా లోటు వర్షపాతం నమోదైంది. పట్టిసీమ నుంచి గోదావరి నీరు రాకపోవడంతో తాగు అవసరాలకు సైతం ఇబ్బంది ఏర్పడింది. పులిచింతల, ప్రకాశం బ్యారేజీలో తగినంత నిల్వలు లేకపోవడంతో కాల్వలకు ఇంత వరకు విడుదల చేయలేదు. ప్రస్తుతం పట్టిసీమ ద్వారా చేరుతున్న నీటితో ప్రకాశం బ్యారేజీ మట్టం పెరిగాక కృష్ణా, గుంటూరు జిల్లాలకు తాగడానికి విడుదల చేయాల్సివుంది. ప్రస్తుతానికి చెరువులు అడుగంటడంతో కొళాయిలకు విడుదల చేసే పరిమాణాన్ని అధికారులు తగ్గిస్తున్నారు. దాంతో నెల రోజుల వ్యవధిలో నీటి కొనుగోళ్లు యాభై శాతం మేర పెరుగగా 20 లీటర్లను రూ.30-35 వరకు విక్రయిస్తున్నారు.చిలకలూరిపేట రక్షిత పథకం చెరువులో నీరు అడుగుకు చేరడంతో ట్రాక్టరు ఇంజన్లతో తోడి కొళాయిలకు రోజు విడిచి రోజు వదులుతున్నారు. ఇలా మరో 24 రోజుల వరకు సరఫరా చేయగలమని అధికారులు చెబుతున్నారు. శివారు రూత్‌ డైక్‌మెన్‌ కాలనీ, వైఎస్సార్‌ కాలనీ, భావనారుషినగర్‌లకు 26 ట్యాంకర్లను పంపుతున్నారు. రెండు వారాల్లో సాగర్‌ కాల్వల ద్వారా నీరు రాకుంటే కష్టాలు తీవ్రమవుతాయి. బాపట్ల చెరువులో 9.5 అడుగుల నీరు మాత్రమే ఉంది. ఏడు అడుగుల పూడికపోనూ కేవలం రెండున్నర అడుగుల నీరు మాత్రమే ఉంది. ఇది మరో పది రోజులు మాత్రమే వస్తుంది. దాంతో సూర్యలంక వాయుసేనా కేంద్రానికి రెండ్రోజులకొకసారి విడుదల చేస్తున్న ఒక ఎంఎల్‌డీ నీటిని సగానికి తగ్గించి మూడ్రోజులకొకసారి సరఫరా చేస్తున్నారు. పురపాలిక ఆధ్వర్యంలో ఆరు బోర్లు వేయించి నిత్యం ఐదు ట్యాంకర్లను శివారు కాలనీలకు నడుపుతున్నారు. బోరు నుంచి ఓవర్‌ హెడ్‌ ట్యాంకులోకి నీటిని తోడిస్తున్నారు. ఇప్పటికే రంగు మారిన నీరు వస్తుండగా ఈ నెల 25లోగా కాల్వలకు నీరు రాకుంటే తీవ్రమైన ఎద్దడి ఏర్పడుతుంది.రేపల్లె చెరువులో డెడ్‌స్టోరేజీ పోను కేవలం రెండు అడుగుల నీరు మాత్రమే ఉంది. ప్రస్తుతం కొళాయిలకు రోజు విడిచి రోజు నీటిని అందిస్తున్నారు. అవి లేని చోట్లకు ఏడు ట్యాంకర్లను పంపుతున్నారు. చెరువు నుంచి మరో మూడు వారాలు మాత్రమే సరఫరా చేయగలరు.వినుకొండ రక్షిత చెరువులో 15 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. కొళాయిల ద్వారా నీరు వెళ్లని జగ్జీవన్‌రాం కాలనీ, మసీదు మాన్యం ప్రాంతాలకు 14 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గత నవంబరులో చెరువు ఎండిపోయి తీవ్రమైన ఎద్దడితో పట్టణవాసులు ఇబ్బందులు పడ్డారు. మరోసారి అలాంటి పరిస్థితి వస్తుందని భయపడుతున్నారు. మాచర్ల పురపాలక సంఘంలో మాత్రం నీటి సమస్య పెద్దగా లేదు. నాగార్జునసాగర్‌ జలాశయానికి సమీపంలో ఉండడంవల్ల చెరువు, కుంటల్లో నీటి నిల్వలు ఉన్నాయి. నెలన్నర వరకు ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు. రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. శివారు ఆజాద్‌నగర్‌, కోడెల శివప్రసాద్‌ కాలనీ, నెహ్రూ నగర్‌, పీడబ్ల్యూడీ కాలనీలకు నాలుగు ట్యాంకర్లు నడుపుతున్నారు.పిడుగురాళ్లలో తాగునీరు సహా ఇతర అవసరాలకు బోర్లే ఆధారం. 30 పవర్‌బోర్లు వేసి నీరు సరఫరా చేస్తున్నారు. తొమ్మిది ట్యాంకర్లు తిరుగుతుండగా వాటి వద్ద నీటిని పట్టుకోవడానికి ప్రజలు బారులు తీరుతున్నారు. వర్షాల్లేక భూగర్భజల మట్టాలు కూడా పడిపోవడంతో బోర్లు కూడా పూర్తిస్థాయిలో నీటిని ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. నరసరావుపేట మున్సిపాలిటీలో మాత్రమే కొళాయిల ద్వారా రోజూ నీటిని సరఫరా చేస్తున్నారు. రక్షిత పథకానికి రెండు చెరువులు ఉండడంతో మిగతా పట్టణాలతో పోలిస్తే ఇక్కడ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ఆయా చెరువుల్లోని నిల్వలతో మరో 76 రోజుల వరకు ఇబ్బంది ఉండదని అధికారులు తెలిపారు. ప్రతి ఇంటికీ నిత్యం 135 లీటర్లు ఇస్తున్నారు. శివారు కాలనీలకు ఓ ట్యాంకరు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.