ప్రగతికి అడ్డుకట్ట (పస్చిమగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రగతికి అడ్డుకట్ట (పస్చిమగోదావరి)

ఏలూరు,జూలై 2 (way2newstv.com):
 జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో రూ.వందల కోట్ల ప్రగతి పనులు ఆగిపోయాయి. ప్రధానంగా సిమెంటు రహదారులు, మురుగు కాలువలు, తాగునీరు, పాఠశాలల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు వంటి అత్యవసర పనులు జరగడం లేదు. గత ఏప్రిల్‌ నాటికి మొదలుకాని, క్షేత్ర స్థాయిలో 25 శాతం కూడా దాటని పనులను నిలిపివేయాలని పుర పరిపాలన శాఖ నుంచి వచ్చిన మౌఖికాదేశాలతో అధికారులు పాత పనుల జోలికి వెళ్లడంలేదు. ప్రస్తుత పాలకవర్గాలు ఆమోదించిన పనులను కూడా చేపట్టడం లేదు. జిల్లాలోని అన్ని పట్టణాల్లో ఈ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇటీవల పాలకొల్లు పురపాలికలో గతంలో పాలకవర్గం అనుమతి పొంది ఎన్నికల నియమావళితో నిలిచిన రూ.7.21 కోట్ల విలువైన 62 పనులకు టెండర్లు పిలిచారు. ఆ తర్వాత కంగారుపడి టెండర్‌ ప్రక్రియను రద్దు చేశారు. ఇదే పురపాలికలో పురపాలక సాధారణ నిధులతో చేయాల్సిన రూ.6 కోట్ల విలువైన పనులు నిలిచిపోయాయి. ఇక్కడే కాదు.. అన్ని పట్టణాల్లోనూ రూ.కోట్ల పనులు ముందుకెళ్లడం లేదు. ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం మరో పది రోజుల్లో ముగియనుంది. ఈ తరుణంలో తమ హయాంలో ఆమోదించిన పనులు నిలిచిపోవడంతో కొందరు సభ్యులు కలవరం చెందుతున్నారు. కొందరు సభ్యులు తమ వార్డుల్లో కీలక పనుల ప్రతిపాదనలను ఆమోదింపజేసుకున్నారు. హడావుడిగా టెండర్లు పిలిచారు. ఈ క్రమంలో ఎన్నికల నియమావళి అడ్డురావడంతో పనులు జరగలేదు. ఇప్పుడా పనులు చేసుకుందామన్నా నూతన ప్రభుత్వ ఆదేశాలతో కదలిక లేకుండా పోయింది.

ప్రగతికి అడ్డుకట్ట (పస్చిమగోదావరి)


జిల్లాలోని పట్టణాల సమగ్ర అభివృద్ధికి ఎన్నికల ముందు గత ప్రభుత్వం పెద్దఎత్తున ప్రగతి పనులు చేపట్టాలని తలపెట్టింది. ఇందుకు అత్యవసర మౌలికావసరాల అభివృద్ధి కార్యక్రమం (సిప్‌) కింద తాగునీరు, రహదారులు, మురుగు కాలువలు, ఉద్యానాలు, శ్మశాన వాటికలు తదితరాలను అభివృద్ధి పరిచేలా జిల్లా మొత్తానికి రూ.185 కోట్లతో పనులను ప్రతిపాదించారు. అన్ని పట్టణాల్లో ఒకే గుత్తేదారు సంస్థ పనిచేసేలా ప్రభుత్వం ఉత్తర్వులను ఇచ్చింది. ఈలోగా ఎన్నికలు రావడంతో పనులు మొదలుకాలేదు. ఇప్పుడు ఇవి పూర్తిగా నిలిచిపోనున్నాయి. పట్టణ తాగునీరు సరఫరా నిర్వహణ అభివృద్ధి పథకం కింద జిల్లాలోని ఆరు పట్టణాల్లో మంచినీటి అవసరాలకు విజ్జేశ్వరం నుంచి పైపులైను ద్వారా గోదావరి జలాలు అందించే పనులు జరగలేదు. గత ప్రభుత్వం ఆసియన్‌ మౌలికావసరాల పెట్టుబడి బ్యాంకు నుంచి రుణం పొందేలా రెండు విడతలుగా అమలు జరిపేందుకు మొత్తం రూ.368 కోట్లతో ప్రతిపాదించింది. తొలి విడతలో పాలకొల్లు, తణుకు, నిదడవోలు రెండో విడతలో తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం పట్టణాల్లో చేపట్టాలని నిర్ణయించారు. పాలకొల్లులో రూ. 198 కోట్ల పనులు శంకుస్థాపనకు నోచుకున్నాయి. ఇప్పుడు అన్నిచోట్ల జరిగే పరిస్థితులు లేవు. తాడేపల్లిగూడెం, భీమవరం పట్టణాల్లో అమృత్‌ నిధులతో జరిగే పనులకూ ఆటంకం ఎదురైంది.
పట్టణాల్లోని ఎస్సీ ప్రాంతాల్లో జరగాల్సిన పనులు నిలిచిపోనున్నాయి. జిల్లా మొత్తమ్మీద ఎస్సీ ఉపప్రణాళిక నిధుల కింద రూ.117.17 కోట్లతో 597 పనులను ప్రతిపాదించారు. అందులో 30 శాతం పనులు మాత్రమే జరిగాయి. ఎన్నికల నియమావళి మిగిలిన పనులకు ఆటంకంగా నిలిచింది. ఇప్పుడీ పనులన్నీ రద్దు కానున్నాయి. 14వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి అన్ని పట్టణాల్లోనూ పెద్దఎత్తున పనులు జరగాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి పురపాలక సంఘాలకు వచ్చే ఈ నిధులతో చేయాల్సిన పనులు సకాలంలో మొదలుకాక ఇప్పుడు ఆగిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా అన్ని పట్టణాల్లోనూ పాత పనులు నిలిచిపోయాయి.