ఏపీలో టీడీపీ ఘోరంగా ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ పరిస్తితి ఏంటి ? ఏం చేయనుంది? అనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా చంద్రబాబుకు అత్యంత కీలకమైన టీడీపీ ఆర్మీ లేదా సీబీఎన్ ఆర్మీ ఏం చేయనుంది? అనే విషయంపై చర్చ నడుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని టీడీపీ నాయకులు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. జగన్‌ను విమర్శించాలంటే.. ఆయన అధికారంలోకి వచ్చి పట్టుమని నెల రోజులు కూడా కాలేదు. దీంతో ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? అనేది తెలుగుదేశం పార్టీ నేతల ముందున్న ప్రధాన సమస్య.ఈ క్రమంలోనే తాజాగా ప్రతి ఒక్కరూ తమ తమ వ్యాపారాలు చూసుకుంటున్నారు. కొందరు మాత్రమే అధినేత చంద్రబాబుతో టచ్‌లో ఉన్నారు. ముఖ్యంగా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువులుగా మారిన నాయకులు ఇప్పుడు గోడచాటు పిల్లులుగా మారిపోయారు. అదే సమయంలో గతం తాలూకు విచారణలు తెరమీదికి వస్తాయనే భయంతో కూడా కొందరు నాయకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన కార్యక్రమాలపై విచారణకు ఆదేశిస్తామని చెప్పారు.
అజ్ఞాతంలో టీడీపీ నేతలు...
ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని భావించిన కొందరు తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఓడిపోయాక అస్సలు నియోజకవర్గం వైపే కన్నెత్తి చూడలేదు. మరికొందరు ఐదేళ్ల పాటు చేసేందేం లేదని డిసైడ్ అయ్యి ఇతర రాష్ట్రాల్లో కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వంపై, వైసీపీ ఎమ్మెల్యేలపై విమర్శలు చేయడానికి కూడా ఏం ఉండదని.. మరో రెండు సంవత్సరాల తర్వాతే మళ్లీ జనాల్లోకి రావాలని కొందరు చూస్తుంటే.. మరి కొందరు మాత్రం కనీసం సంవత్సరం వరకు అయినా వేయి చూడాలన్న ధోరణితో ఉన్నారు. ఇక రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్న వారు మాత్రం సంవత్సరం వరకు వెయిట్ చేసి అప్పటకీ తెలుగుదేశం పార్టీ పరిస్థితిపై నమ్మకం లేకపోతే అప్పుడే పార్టీ మారే ఆలోచన చేయవచ్చని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది అజ్ఞాతంలోనే ఉన్నారని చెప్పకతప్పదు. జగన్‌పై విమర్శలు చేసేందుకు ఒకరిద్దరు మినహా ఏ ఒక్కరూ ముందుకు రావడంలేదు. ఇటీవల ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు చేసినప్పుడు.. ఆయనకు నేరుగా ఢిల్లీ నుంచే వార్నింగ్‌లు వచ్చాయి. దీంతో ఇప్పుడు ఆయన కూడా టీడీపీ తరఫున వాయిస్ వినిపించేందుకు జంకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి కొందరు నాయకుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ నాయకుల పరిస్థితి చేతులు నలుపు కొనే పరిస్థితి నెలకొంది. ఏపీలో ఈ పరిస్థితి ఎన్ని రోజుల వరకు ఉంటుందో ? చూడాలి.