ఏపీలోని విస్తారంగా వర్షాలు..పలు ప్రాంతాలు జలమయం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీలోని విస్తారంగా వర్షాలు..పలు ప్రాంతాలు జలమయం


అమరావతి జూలై 20 (way2newstv.com):
ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రెండు గంటల పాటు ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బస్టాండు పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కోనేరు సెంటర్‌ నుంచి లక్ష్మీ టాకీస్‌ వరకు నీళ్లు నిలిచిపోవడంతో..వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుంటూరు జిల్లాలోని బాపట్ల, కర్లపాలెం, పిట్టలవాని పాలెం మండలాల్లో తెల్లవారు జామునుంచి వర్షం కురుస్తోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి ఉరుములు,మెరుపులు తోడవ్వడంతో అధికారులు విద్యుత్‌ నిలిపివేశారు. 
ఏపీలోని విస్తారంగా వర్షాలు..పలు ప్రాంతాలు జలమయం 

లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాలు కురుస్తుండటంతో సాగుకు సహకరిస్తుందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. చీరాల, వేటపాలెం, చినగంజాం, పరుచూరు, మార్టూరు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. చీరాలలో ఉరుములతో కూడిన జల్లులు పడ్డాయి. వర్షం ధాటికి మార్టూరు మండలం పలపర్రులో పెంకుటిల్లు కూలిపోయింది. చినగంజాంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. యద్దనపూడి మండలం యనమదలలో ఉప్పువాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షానికి పరచూరు వాగు ఉరకలేస్తోంది. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది.జెండా వీధి, సీపీఐ కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. కాలనీ వాసులు రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. గుత్తి పట్టణంలో పలు చోట్ల డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండటంతో మురుగునీరు ఇళ్లలోకి చేరింది.