సిటీలో సుబ్బయ్య గారి హోటల్.. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సిటీలో సుబ్బయ్య గారి హోటల్..


హైద్రాబాద్, జూలై 1, (way2newstv.com)

కాకినాడ వెళ్తే తప్పకుండా సుబ్బయ్యగారి హోటల్‌లో భోజనం చేయాలని చెబుతారు. సుమారు ఆరు దశాబ్దాలుగా ఆహార ప్రియుల అభిమానం చూరగొన్న ఈ హోటల్ హైదరాబాద్‌లో కూడా అడుగుపెట్టింది.  అమీర్‌పేట‌లో కూడా కొత్త శాఖను ఆరంభించింది. ఇంతకు ముందే కూకట్‌పల్లి, మలక్‌పేట, కొండాపూర్‌లో శాఖలను ఏర్పాటు చేసింది. మరి ఈ హోటల్ ప్రత్యేకతలు ఏమిటీ చూద్దామా! ‘సుబ్బయ్యగారి హోటల్’కు దాదాపు 68 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. ప్రకాశం జిల్లా నుంచి కాకినాడకు వలస వచ్చిన సుబ్బయ్య 1950లో పది మందితో కలసి కాకినాడలో చిన్న మెస్ ఏర్పాటు చేశారు. అప్పట్లో ప్లేటు భోజనం కేవలం 50 పైసలకు విక్రయించేవారు. 1955లో ఈ మెస్‌ను ‘శ్రీ కృష్ణ విలాస్‌’ పేరుతో హోటల్‌గా మార్చారు. 

సిటీలో సుబ్బయ్య గారి హోటల్..

ఉభయ గోదావరి జిల్లా్ల్లోనే కాదు ఫేమస్ శాఖాహార హోటల్‌గా పేరొందిన ఈ హోటల్.. హైదరాబాద్‌లో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే ఆహార ప్రియుల మనసు దోచుకుంది. ఈ హోటల్‌ను ఏర్పాటు చేసిన సుబ్బారావు వినియోగదారులకు ఎంతో మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తూ కడుపు నిండా భోజనం పెట్టేవారు. దీంతో వినియోగదారులు ఆ హాటల్‌ను ‘సుబ్బయ్య హోటల్’ అని పిలిచేందుకే ఇష్టపడేవారు. చివరికి ఆ పేరే బ్రాండ్‌గా మారింది. ‘సుబ్బయ్యగారి హోటల్’గా ఆహార ప్రియుల మనసు దోచుకుంటోంది.హైదరాబాద్‌లో తొలి శాఖను కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, రోడ్ నెం.4లో ప్రారంభించారు. ఈ హోటల్ ఆంధ్ర వంటకాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా పునుకుల కూర భలే రుచిగా ఉంటుంది. అలాగే.. ఇక్కడ బుట్ట భోజనం భలే ఫేమస్. రూ.315 పెట్టి బుట్ట భోజనం కొనుగోలు చేస్తే ముగ్గురికి సరిపోతుంది. ఇందులో 12 రకాల వంటకాలను ఇస్తారు. ఇక్కడికి వెళ్లే కస్టమర్లను సిబ్బంది మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తారు. రాగి గ్లాసుల్లో మంచి నీళ్లు ఇస్తారు. అరటి ఆకుల్లో వివిధ రకాల స్వీట్లు, పులిహోరా, పుదీనా రైస్, వెజ్ బిర్యానీ వంటివి వడ్డిస్తారు. బూరెల్లో నేయి వేసి మరీ ఇస్తారు. మీకు ఓపిక ఉండాలేగానీ.. 30 రకాల వంటకాలను ఒకేసారి రుచిచూడొచ్చు. చివర్లో తాగేందుకు చల్లని మజ్జిగా, కిళ్లీ ఇస్తారు. కూకట్‌పల్లి సుబ్బయ్య హోటల్ ధరల ప్రకారం.. సింగిల్ మీల్స్ రూ.105. ఇందులో 8 రకాల కూరలు, వంటకాలు ఇస్తారు. ఫుల్ మీల్స్‌ రూ.210, ఇందులో 30 రకాల వంటకాలను వడ్డిస్తారు. సింగిల్ మీల్స్ 8 రకాలు. బుట్టభోజనం 12 రకాలు. జీడిపప్పు బూరి, బిర్యానీ, పులిహోర, ముంత పెరుగు, బెల్లం గారెలు, గుత్తి వంకాయ, దొండకాయ, నేతి బూరెలతో పాటు సుమారు వివిధ రకాల గోదావరి రుచులను ఒకేసారి ఆస్వాదిస్తూ తినొచ్చు.