ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ
రాజమహేంద్రవరం జూలై 18(way2newstv.com)  
రాజమహేంద్రవరం సిటీ శాసన సభ్యురాలు ఆదిరెడ్డి భవానీ అసెంబ్లీలో తన గళాన్ని వినిపించారు. సాటి మహిళగా మహిళలైన ఆశ వర్కర్లు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీలో ప్రశ్నించారు. నెలల తరబడి వేతనాలు రాక... నూతన ప్రభుత్వం పెంచిన వేతనాలు అమలుకు నోచుకోక నానా ఆగచాట్లు పడుతున్న ఆశా వర్కర్ల తరపున మాట్లాడారు. గర్భిణీలు, బాలింతలకు అండగా ఉంటూ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా సమాజ సేవలో తరించే ఆశ వర్కర్లకు సమయానికి వేతనాలు వేయాలని, అలాగే ప్రస్తుతం వారిపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఆశ వర్కర్లు ఎన్నో వ్యయప్రయాసకోర్చి వారి వ త్తిని నిర్వహిస్తున్నారని, ఈ వృత్తి ద్వారా చాలా మంది మహిలకు జీవనోపాధి లభిచిందన్నారు. 
ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

వారు సమాజానికి చేస్తున్న సేవ మాటల్లో చెప్పలేనిదని ప్రస్తావించారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా సమయానికి తిండి లేకుండా సమయపాలన లేకుండా ఎల్లప్పుడు ఆశ వర్కర్లు సమాజ సేవలోనే తరిస్తున్నారని, అలాగే గర్భిణీలు... బాలింతలను సకాలంలో ఆసుపత్రులకు తీసుకువెళ్లి వారికి సఫర్యలు చేయడంలో ఆశ వర్కర్ల పాత్ర మరువలేనిదన్నారు. ఆశా కార్మికులు పేదలకు పోషకాహార పంపిణీలో ప్రధాన పాత్ర పోషిస్తారని, అలాగే ఆశా వర్కర్లు అనేక ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేయడంలో చాలా సహాయం చేస్తున్నారని అన్నారు. వీరి సేవలను గుర్తించి నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు 3 వేలు గౌరవ వేతనం ఇవ్వడంతో ఇన్సెటివ్స్‌ కూడా అమలు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే మన రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆశ వర్కర్లకు నెలకు రూ. 10 వేలు ఇస్తామని హామీ ఇచ్చి... ఇప్పటికీ అమలు చేయడం లేదని, ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆశ వర్కర్ల జీవితాలపై నీళ్లు చల్లే ప్రయత్నాలు చేస్తున్నారేమోనన్న సందేహం కలుగుతోందన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఆశ వర్కర్లకు వారి ఖాతాలకు వేతనాలు అనేవి సకాలంలో జమయ్యేవి. అయితే ప్రస్తుత ప్రభుత్వం పాలనలో ఆశ వర్కర్లు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు సకాలంలో వేయకపోవడంతో పేదలైన ఆశ వర్కర్ల కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, దీంతో ఆశ వర్కర్లు రోడ్డేక్కి ధర్నాలు... రాస్తారోకోలు వంటి ఆందోళనలు చేస్తున్న తీరు మనం చూస్తునే ఉన్నామన్నారు. అంతే కాకుండా చాలా ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఆశ వర్కర్లను బెదిరించి, మిమ్మల్ని తొలగిస్తున్నాం... మీ స్థానాల్లో కొత్త వారికి వేస్తున్నామంటూ దాడులకు దిగుతున్నారని, అలాగే ప్రస్తుతం ఉన్న వారిని తొలగించి అధికార పార్టీ వారికి అనుకూలంగా ఉన్న వారిని ఆశ వర్కర్లుగా నియమించుకునే దిగజారుడు పనులకు దిగడం నీచమైన చర్యగా అభివర్ణించారు.దీంతో కొంతమంది ఆశ వర్కర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. ఆశ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తల్లీబిడ్డలను కాపాడే ఆశ వర్కర్ల మనో ధైర్యం దెబ్బతీసే విధంగా అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులకు దిగడం మంచి పద్దతి కాదని, అలాగే ఆశ వర్కర్లకు పెంచిన వేతనాలతో కలిపి సరైన సమయానికి వారికి వేతనాలు ఇవ్వాలని, వీటిపై తగు సమాధానాలు చెప్పాలని సబంధిత శాఖామాత్యులను కోరారు.