శ్రీకాకుళం, జూలై 17 (way2newstv.com):
జిల్లాలో కొత్తగా వాహనాలు కొనుగోలు చేసినవారు తమ రిజిస్ట్రేషన్, శాశ్వత లైసెన్స్ కార్డులను తదితరవాటిని తీసుకెళ్లకపోవడంతో జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం ఉప రవాణాశాఖ కార్యాలయంలో మూలుగుతున్నాయి. సుమారు 2000కుపైగా కార్డులు కార్యాలయంలో ఉండిపోవడం గమనార్హం. తిరుగు టపాలో వచ్చేవాటిని కూడా తిరిగి రెండోసారి సంబంధిత లైసెన్స్‌దారులు, వాహన యజమానుల చిరునామాకు పంపిస్తున్నా వెనక్కి వచ్చేస్తుండడంతో సిబ్బంది వాటిని కట్టలు కట్టి భద్రపరుస్తున్నారు. వాహనం కొనుగోలు చేసిన సమయంలో గానీ, రిజిస్ట్రేషన్ చేయించే సమయంలో గానీ తప్పుడు చిరునామాలు, చరవాణి సంఖ్యలు ఇవ్వడమే ఈ పరిస్థితి కారణమని రవాణాశాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే వ్యక్తిగతంగా వచ్చే వారికి కార్డు ఇచ్చే విధంగా జాబితాలు రూపొందించి కార్యాలయంలో అందుబాటులో ఉంచారు.
మీ లైసెన్స్ ఎక్కడుంది..? (శ్రీకాకుళం)
గతంలో రవాణాశాఖ కార్యాలయానికి లైసెన్స్, ఇతర పనులకు దరఖాస్తు చేసే వారి చిరునామా, చరవాణి సంఖ్య తదితర వివరాలను సంబంధిత సిబ్బంది ఒకటికి రెండు సార్లు సరిచూసుకుని సంబంధిత వ్యక్తులతో మాట్లాడి సంతృప్తి చెందాక వివరాలు నమోదు చేసేవారు. కార్డులు తయారయ్యాక వాటిని తపాలా శాఖ (ఈఎంఎస్) ద్వారా సంబంధిత చిరునామాకు పంపించడంతో వాహనదారులకు గానీ, వాహనాల యజమానులకుగానీ నేరుగా అందేవి. అప్పటికీ డోర్‌లాక్ తదితర కారణాలతో కొన్ని కార్డులు వెనక్కి వస్తే వాటిని రవాణాశాఖ కార్యాలయంలోని హెల్ప్ డెస్క్ వద్ద గల సిబ్బంది వద్ద భద్రపరిచి వచ్చేవారికి అందించే విధానం ఉండేది.ద్విచక్రవాహనాలు, కార్లు, లారీలు తదితర వాటిని కొనుగోలు చేసేటప్పుడు గతంలో రవాణాశాఖ వద్ద కాకుండా సంబంధిత డీలరు వద్దనే టి.ఆర్.నెంబరు ఇచ్చే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. రవాణాశాఖ కార్యాలయాల చుట్టూ కొనుగోలుదారులు తిరగకుండా డీలరు వద్ద వాహనం కొనుగోలు చేసే సమయంలోనే టి.ఆర్. నెంబరు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఇది మంచి విధానమే అయినప్పటికీ ఇక్కడే అసలు తప్పిదాలు జరుగుతున్నాయని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి వాహనం కొనుగోలు చేసిన తరువాత వాహనం వివరాలతోపాటు యజమాని చిరునామా, చరవాణి సంఖ్య తదితర వివరాల నమోదు సమయంలో యజమానులు ఇష్టారాజ్యంగా తప్పుడు చిరునామాలు, ఫోన్ నెంబర్లు ఇస్తుండడంతో వాటితోనే (టి.ఆర్ నెంబరు)తో వాహనం అందిస్తున్నారు. అదే జాబితాను డీలర్లు సాయంత్రానికి రవాణాశాఖకు పంపిస్తుండడంతో వారు యధావిధిగా కంప్యూటర్లలో నమోదు చేస్తూ సంబంధిత చిరునామాలకు ఈఎంఎస్ ద్వారా సంబంధిత కార్డులు పంపిస్తున్నారు. తపాలాశాఖ సిబ్బంది ఆయా చిరునామాలకు వెళ్లినపుడు డోర్‌లాక్ చేసి ఉండడం, తప్పుడు చిరునామా కావడంతో వారు తిరిగి తపాలాశాఖ కార్యాలయానికి తెచ్చి రవాణాశాఖకు తిరిగి పంపుతున్నారు. ఈ విధంగా వచ్చిన వాటిని 10 రోజుల వరకు వేచి చూసి తిరిగి రెండోసారి రీ-డిస్పాచ్ చేస్తున్నారు. మళ్లీ కార్డులన్నీ ఈ విధంగా వెనక్కి తిరిగి వస్తుండటంతో ఒక జాబితా తయారు చేసి వాహనదారు పేరు, దరఖాస్తులో పేర్కొన్న చిరునామా, చరవాణి సంఖ్య తదితర వాటితో కూడిన జాబితా తయారు చేసి మే ఐ హెల్ప్ యూ డెస్క్ వద్ద ఉంచుతున్నారు. వాహనం రిజిస్ట్రేషన్, పర్మినెంట్ లైసెన్స్ ఇలా వివిధ కార్డులు రానివారు ఇక్కడకొచ్చి విచారిస్తే సంబంధిత జాబితాను పరిశీలించి చేతికి అందిస్తూ వివరాలను కంప్యూటర్‌లో పొందుపరుస్తున్నారు.రహదారి భద్రత నిబంధనలకు వ్యతిరేకంగా వాహనం నడుపుతూ పట్టుబడేవారు, రాంగ్ పార్కింగ్ చేసేవారు తదితర వాహనాలను పోలీసులు తమ చరవాణిలో చిత్రాలు తీసి రవాణాశాఖకు పంపుతున్నారు. ఇక్కడ నుంచి నిర్దేశిత అపరాధ రుసుం చెల్లించాలని తెలిపే సంక్షిప్త సందేశాలను వాహనదారు దరఖాస్తులో పొందు పరిచిన చరవాణి సంఖ్యకు పంపిస్తున్నారు. రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా వాహనం నడుపుతున్నవారు, సరైన పత్రాలు లేనివారికి కూడా సంబంధిత వాహనానికి చిత్రం తీసి నిర్దేశిత అపరాధ రుసుం చెల్లించాలని కోరుతూ సంక్షిప్త సందేశాలు పంపుతున్నారు. జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో వెళుతున్న వాహనాలకు స్పీడ్‌గన్‌తో చిత్రాలు తీసి ఆయా వాహన యజమానులకు వాహనం సంఖ్య ఆధారంగా సంక్షిప్త సందేశాలు పంపుతూ నిర్దేశిత అపరాధ రుసుం చెల్లించాలని కోరుతున్నప్పటికీ కొద్దిమంది మాత్రమే అపరాధ రుసుం చెల్లిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం వాహనం కొనుగోలు సమయంలో సరైన చిరునామా, చరవాణి సంఖ్యను పేర్కొనకపోవడమే కారణమని, దీనిని చక్కదిద్దితే పరిస్థితి మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
Tags:
Andrapradeshnews