పేదలు తినాలా..? వద్దా..?(విజయవాడ) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పేదలు తినాలా..? వద్దా..?(విజయవాడ)

విజయవాడ, జూలై 27 (way2newstv.com): 
రైల్వేస్టేషన్‌కు వచ్చే సామాన్య ప్రయాణికులకు తక్కువ ధరకే ఆహారం అందించేందుకు ఏర్పాటు చేసిన జన ఆహార కౌంటరు ప్రస్తుతం విజయవాడలో ఒకే ఒక్కటి ఉంది. గతంలో రెండు ప్లాట్‌ఫాంలపై జన ఆహార కౌంటర్లు ఉండగా.. తాజాగా ఒకటి మూసేశారు. దీంతో ఉన్న ఒక్క కౌంటరులోనే ప్రయాణికులకు తక్కువ ధరకు అందించే ఆహారం దొరుకుతోంది. మిగతా ప్లాట్‌ఫాంలలో ఎక్కడా జన ఆహార కౌంటరులు లేవు. ప్రయాణికులు.. అధిక ధర చెల్లించి కొనుగోలు చేసుకోవాల్సిందే. దీనికితోడు.. జనతాఖానా పేరుతో నామమాత్ర ధరకే ఆహారం అందించాలనే పథకం కూడా విజయవాడ రైల్వేస్టేషన్‌లో మూడు నాలుగేళ్ల కిందటే ఆగిపోయింది. విజయవాడ రైల్వేస్టేషన్‌లో సామాన్యులకు నామమాత్ర ధరకు ఆహారం అందించే ఏర్పాటు చేస్తే.. లక్షల మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. 
పేదలు తినాలా..? వద్దా..?(విజయవాడ)

విజయవాడ రైల్వేస్టేషన్‌ దక్షిణ భారతదేశంలోనే అత్యంత కీలకమైన జంక్షన్లలో ఒకటి. నిత్యం 250కు పైగా రైళ్లు, లక్షమందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించే ప్రధానమైన ప్రాంగణం. ఆదాయం సైతం భారీగా వచ్చే రైల్వేస్టేషన్‌ ఇది. ఆరేళ్ల కిందట జన ఆహార కౌంటర్ల పేరుతో తక్కువ ధరకే ఆహారం అందించేందుకు రైల్వేస్టేషన్‌లో ఏర్పాట్లు చేశారు. రైల్వేస్టేషన్‌లోని ఒకటి, ఆరో నంబరు ప్లాట్‌ఫాంలపై రెండు కౌంటర్లను ఆరంభించారు. తర్వాత క్రమంగా.. పది ప్లాట్‌ఫాంలకూ విస్తరిస్తామని అప్పట్లో చెప్పారు. కానీ.. ఉన్న రెండింటితోనే నెట్టుకొచ్చారు. కొత్తగా ఏర్పాటు చేయాల్సింది పోయి.. ఉన్న వాటిలోనూ ఒకటి కొద్దికాలం కిందట మూసేశారు. ఆరో నంబరు ప్లాట్‌ఫాంపై ఉన్న జన ఆహార కౌంటరు మూసేయగా.. ప్రస్తుతం ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై మాత్రం ఒకటి ఉంది. రైల్వేస్టేషన్‌లో ఉన్న ఆహార కేంద్రాలన్నీ ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ప్రైవేటు వారికి కేటాయించిన లీజు గడువు సైతం ముగియడంతో వాటినీ ఐఆర్‌సీటీసీకే అప్పగించారు. రైల్వేస్టేషన్‌లో ఉన్న ఒకే ఒక్క జన ఆహార కౌంటర్‌ కూడా ఐఆర్‌సీటీపీ ఆధ్వర్యంలోనే నడుస్తోంది. మరో రెండు మూడు కౌంటర్లను ఏర్పాటు చేస్తే.. ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గుతుంది. ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై ఉన్న జన ఆహార కేంద్రంలో రోజూ కనీసం 400 మంది వరకూ ప్రయాణికులు ఆహారం కొనుగోలు చేస్తున్నారు. రైల్వేస్టేషన్‌లో ఉన్న మిగతా హోటళ్ల కంటే ఇక్కడ సగం ధరకే ఆహారం అందిస్తారు. మార్కెట్‌తో సంబంధం లేకుండా ప్రయాణికులకు రాయితీపై ఆహారం ఇస్తారు. కేవలం ఒక్కటే ఉండడంతో.. 80శాతం మంది ప్రయాణికులకు అసలు వీటి గురించే తెలియదు. కనీసం వీటిపై అవగాహన సైతం కలిగించే పరిస్థితి లేదు. మిగతా హోటళ్లన్నీ.. మార్కెట్‌ ధరలను బట్టి ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళ్తుంటారు. కానీ.. జన ఆహార కౌంటరులో కచ్చితంగా తక్కువ ధరకు అందించాలి. గతంలో చెప్పినట్టు ప్లాట్‌ఫాంకు ఒకటి చొప్పున పది ఏర్పాటు చేయకపోయినా.. కనీసం మరో రెండు మూడు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై జన ఆహార కౌంటరు ఉందని తెలిసినా.. చాలామంది ప్రయాణికులు అక్కడికి వచ్చి కొనలేని పరిస్థితి ఉంటోంది.  విజయవాడ రైల్వేస్టేషన్‌లో జనాతాఖానా రూపం మారిపోయింది. పులిహోర, పెరుగన్నం వంటివన్నీ రూ.20, రూ.30 చొప్పున ధరల్లో అమ్ముతున్నందున రూ.50 కంటే తక్కువ ఉండే ఆహారమంతా జనతాఖానా కిందకే వస్తుందని అధికారులు కొంతకాలం కిందట నిర్ణయించారు. దీంతో జనతాఖానా విజయవాడ రైల్వేస్టేషన్‌లోని హోటళ్లలో ప్రత్యేకంగా అందుబాటులో లేదు. రూ.10కే జనతాఖానాను రాయితీపై ప్రయాణికులకు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ధరలు పెరిగినందున ఇది గిట్టుబాటు కాకపోవడంతో తక్కువ ధరకు అందించే ఆహారమే జనతాఖానాగా మారిపోయింది. వాస్తవంగా లాభం చూసుకోకుండా.. జనతాఖానాను ప్రయాణికులకు నామమాత్ర ధరకు అందించాల్సిన అవసరం ఉంది. విజయవాడ రైల్వేస్టేషన్‌కు నిత్యం లక్ష, పండుగల సమయాల్లో లక్షన్నర నుంచి రెండు లక్షల మంది ప్రయాణికులు వస్తుంటారు. వీరిలో అత్యధికులు దారిద్య్రరేఖకు దిగువన ఉండే పేదలే కావడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టి సారించి.. జన ఆహార కౌంటర్లను మరికొన్ని ఏర్పాటు చేయాలి. జనతాఖానాను సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ అందరి నుంచి వస్తోంది.