మున్సిపాల్టీల్లో ప్రత్యేక అధికారులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మున్సిపాల్టీల్లో ప్రత్యేక అధికారులు


హైద్రాబాద్, జూలై 2, (way2newstv.com)
రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. పాలకవర్గాలకు వీడ్కోలు సమావేశం అనంతరం వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యేకాధికారులు బాధ్యతలు స్వీకరించారు. మున్సిపాలిటీలకు ఆర్డీవో, సబ్ కలెక్టర్లు, మేజర్ మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు కలెక్టర్లు, ఐఏఎస్‌లు ప్రత్యేకాధికారులుగా నియమితులుకానున్నారు. గతంలో ఉన్న 73 మున్సిపాలిటీల్లో ఐదు మినహా.. మిగిలినవాటిలో ప్రత్యేకాధికారులు రానున్నారు. నూతనంగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో ఇప్పటికే అధికారులు బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. వారినే ప్రత్యేకాధికారులుగా నియమిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఒకేసారి ప్రత్యేకాధికారులు ఉండాల్సి రావడంతో.. కొత్తవాటిల్లో పాత అధికారులే బాధ్యతలు స్వీకరిస్తారు. 

మున్సిపాల్టీల్లో ప్రత్యేక అధికారులు

రాష్ట్రంలోని గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్‌తోపాటు మరో మూడు మున్సిపాలిటీలు మినహా మిగిలిన పాలకవర్గాల పదవీకాలం సంపూర్ణంగా ముగిసింది. జీహెచ్‌ఎంసీలో దాదాపు ఏడాదిన్నర, వరంగల్, ఖమ్మంలో రెండేండ్లు, అచ్చంపేట, సిద్దిపేటలో ఏడాదిన్నరకుపైగా పదవీకాలం ఉన్నది. వీటిని మినహాయించి, మిగిలిన 68 మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారులు పాలనాపగ్గాలు తీసుకోనున్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఉదయం పాలకవర్గాలను సన్మానించి సాగనంపనున్నారు. వారి పదవీకాలం సంపూర్ణంగా పూర్తిచేసినట్లు సంతకాలు పెట్టించుకున్న తర్వాత ప్రత్యేకాధికారులు బాధ్యతలు తీసుకుంటారు. ప్రత్యేకాధికారులను ఇంకా నియమించని మున్సిపాలిటీల్లో కమిషనర్లు ఇంచార్జులుగా వ్యవహరించనున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీలవారీగా వార్డుల విభజనను షెడ్యూలుకు అనుగుణంగా పూర్తిచేశారు. ఈ మేరకు ముసాయిదాను ప్రభుత్వానికి పంపించారు. మంగళవారం నుంచి ఈ నెల 5 వరకు అభ్యంతరాలను స్వీకరించి, 6న పరిష్కారం చేయనున్నారు. 7న తుది జాబితాను ప్రకటించనున్నారు. వార్డుల విభజన, ఓటర్ల జాబితా లెక్కతేల్చిన తర్వాత ఈ నెల 14లోగా రిజర్వేషన్లు ఖరారుచేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం పాలకవర్గాలు కూడా లేకపోవడంతో త్వరగా రిజర్వేషన్లు ఖరారు చేసి, జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.