జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ ఉచియామతో ముఖ్యమంత్రి జగన్ భేటీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ ఉచియామతో ముఖ్యమంత్రి జగన్ భేటీ

అమరావతి జూలై 30  (way2newstv.com)
చెన్నైలోని జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ కొజిరొ ఉచియామ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చాంబర్‌లో ఇరువురు సమావేశమై రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జపాన్‌లో పర్యటించాలంటూ సీఎంను ఉచియామ ఆహ్వానించారు. అవినీతిలేని, పారదర్శక పాలన కోసం రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. దీనివల్ల భూములు, నీళ్లు, కరెంటు రేట్లు తగ్గుతాయని, పారిశ్రామిక వర్గాలకు మేలు జరుగుతుందని తెలిపారు. పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా ఇరువురి భాగస్వామ్యాలు ఉండాలని ఆకాంక్షించారు. 
 జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ ఉచియామతో ముఖ్యమంత్రి జగన్  భేటీ

కొత్తగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ మానిటరింగ్‌ చట్టం ద్వారా పెట్టుబడుల ఆలోచన నుంచి ఉత్పత్తి దశ వరకూ కూడా పూర్తిస్థాయిలో సహాయకారిగా ఉంటామని సీఎం పేర్కొన్నారు. పరిశ్రమలు వృద్ధి చెందాలంటే శాంతియుత వాతావరణం కూడా అవసరమని, ఇందులో భాగంగానే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా రిజర్వేషన్లు తెచ్చామని స్పష్టం చేశారు. నైపుణ్యాభివృద్ధి ఉన్న మానవ వనరుల కోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు అంశాన్నీ వివరించారు. ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెడుతున్నామని, ఆ దిశగా పెట్టుబడులు పెట్టే ఆలోచన చేయాలని సీఎం కోరారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఔషధ తయారీ పరిశ్రమల కోసం భూములు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కోల్డ్‌ స్టోరేజీలు, గోదాములు, అగ్రిల్యాబ్‌లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టబడులకు అవకాశాలను పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలో ఆహార ఉత్పత్తి పెంపుదల, మత్స్యరంగాల్లో అవకాశాలపై జపాన్‌ వ్యవసాయశాఖ మిజుహో ఇన్ఫర్మేషన్, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా ఇప్పటికే విశ్లేషణ చేయిస్తోందని ఉచియామ పేర్కొన్నారు.