విచ్చలవిడిగా కల్తీ మాఫియా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విచ్చలవిడిగా కల్తీ మాఫియా

విశాఖపట్టణం, జూలై 25, (way2newstv.com)
జనం ఆరోగ్యంతో కల్తీ మాఫియా ఆటలాడుకుంటోంది. కాదేదీ కల్తీకనర్హం అన్నరీతిలో జిల్లాలో పాలు.. నీరు.. మాంసం.. తినుబండారాలు.. నిత్యావసరాలు.. ఇలా అన్నింటా కల్తీ రాజ్యమేలుతోంది. ప్రజారోగ్య సంరక్షణ కోసం ఎన్ని చట్టాలున్నా.. అవి కాగితాలకే పరిమితం అవుతున్నాయి. మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లు, అభిరుచులను ఆసరాగా తీసుకుని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో ఎక్కువగా ఆహార కల్తీకి పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు చేష్టలుడిగి చూస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రజారోగ్యానికి పెద్దపీట అంటున్న సర్కారు క్షేత్రస్థాయిలో మోసాలు.. లోపాలపై దృష్టి సారిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది. 
విచ్చలవిడిగా కల్తీ మాఫియా

జిల్లాలో ఆహార తనిఖీ విభాగంలో సిబ్బంది కొరత, ఇతర శాఖల అధికారుల్లో నిర్లిప్తత, ప్రజల్లో అవగాహన లోపం, ధనార్జనే ధ్యేయంగా చెలరేగుతున్న అక్రమ వ్యాపార ధోరణి.. వెరసి ప్రజారోగ్యం కల్తీకాటుకు గురవుతోంది. కాగ్‌ నిబంధనల ప్రకారం పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రతి 50 వేల మందికి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి లక్షమందికి ఒక ఆహార తనిఖీ అధికారి ఉండాలి. ప్రస్తుతం.. కేవలం ముగ్గురే ఉన్నారు. వారిలోనూ ఇద్దరు జీవీఎంసీకే పరిమితమవగా, ఒక్కరే గ్రామీణ జిల్లా మొత్తం తిరగాల్సి వస్తోంది. దీంతో కల్తీ అక్రమాలను అరికట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ఉన్నవారితోనే అంతంతమాత్రంగానే తనిఖీలు నిర్వహించి.. తూతూమంత్రంగా కేసులు నమోదు చేస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. కేసులు బలంగా పెట్టాల్సిన చోట కాసులకు కక్కుర్తిపడి తక్కువ మొత్తంలో జరిమానాలతో సరిపట్టేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. అనకాపల్లిలోని 151 కిరాణా దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ ఆహార పదార్థాలు తయారు చేయడానికి ఉపయోగించే వస్తువులు అమ్మకాలపై ఎలాంటి దాడులు చేయకుండా ఉండానికి పెద్ద దుకాణాల నుంచి ఏడాదికి రూ. 12 వేల చొప్పున ఆహార భద్రతా తనిఖీ అధికారులకు సమర్పించుకోవాల్సిందేనని దుకాణదారులే చెబుతుంటారు. దీంట్లోనే మరో ప్యాకేజీ ఉంది. ఏడాదికి రూ. 6 వేల చొప్పున మామూళ్లు ఇస్తే ఏడాదిలో ఆహార ఇన్‌స్పెక్టర్‌ తనిఖీకి రావచ్చు.. రాకపోవచ్చు ఒకవేళ వచ్చినా జరిమానా తక్కువ విధించేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. విశాఖ మన్యంలో వారపు సంతలే గిరిజనుల సూపర్‌ మార్కెట్లు. ఇక్కడ లభించని వస్తువంటూ ఏదీ ఉండదు. గుండు సూది నుంచి గృహోపకరణాలు, బంగారు ఆభరణాల వరకు అన్నీ లభ్యమవుతాయి. తినుబండారాలకు కొదవేలేదు. అసలు సరకును పోలిన నకిలీలతోపాటు ఆహార కల్తీలు ఇక్కడ విచ్చలవిడిగా సాగుతున్నాయి. అమాయక గిరిజనుల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. నకీలీ వస్తువులకు ప్రముఖ కంపెనీల బ్రాండ్ల పేర్లను పెట్టి గిరిజనులకు అమ్మేస్తున్నారు. ఎక్కువగా కారం, పసుపు ఇతర నిత్యావసరాలు, నూనెలో కల్తీలకు పాల్పడుతుంటారు. ఆహార భద్రతా ప్రమాణాల సంస్థకు చెందిన తనిఖీ అధికారులు నెలలో 12 చోట్ల తనిఖీలు నిర్వహించాలన్నది నిబంధన. అధికారుల కొరతతో ఏడాది మొత్తంగా 20 నుంచి 30కి మించి కేసులు నమోదు కావడం లేదు. అందులోను విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు జరిపిన దాడులతో వెలుగుచూసిన కేసులే ఎక్కువ. నేరుగా ఆహారభద్రతా తనిఖీ అధికారులు పట్టుకున్న కేసులు చేతివేళ్లమీద లెక్కించవచ్చు. ఏమంటే పదుల సంఖ్యలో ఉండాల్సిన అధికారులు ఒకరిద్దరికే పరిమితం అవడంతోనే కేసులు పెట్టలేకపోతున్నట్లు చెబుతున్నారు. నమోదైన అరకొర కేసులను పట్టుకుని కోర్టుల చుట్టూ తిరగడానికే సరిపోతోందని నిట్టూరుస్తున్నారు. రెండు నెలల క్రితం నక్కపల్లికి సమీపంలోని ఓ హోటల్‌లో ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ అధికారినంటూ వెళ్లి పుష్టిగా భోజనం చేసి రూ. 5 వేలు ఫలహారం తీసుకుని వెళ్లిపోయాడు. తీరా అతగాని గురించి ఆరా తీస్తే నకిలీ అని తేలింది.నెల క్రితం కాపులుప్పాడలో ఇద్దరు వ్యక్తులు ఆహార తనిఖీలు కోసం వచ్చామని వ్యాపారి నుంచి డబ్బులు వసూలు చేసేశారు. సదరు వ్యాపారి వారు వెళ్పిన తరువాత సంబంధిత శాఖకు ఫోన్‌ చేసి, ‘సార్‌.. మీ డిపార్ట్‌మెంట్‌ నుంచి ఇద్దరు వచ్చారు.. డబ్బులు తీసుకుని వెళ్లార’ని చెప్పగానే వాళ్లు మావాళ్లు కాదంటూ బదులిచ్చారు. దీంతో ఆ వ్యాపారి కంగుతిన్నాడు.మన్యంలో దుకాణాలకు నకిలీ సిబ్బంది వెళ్లి వసూలు చేస్తున్నట్లు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి.ఆహార భద్రతా ప్రమాణాల సంస్థలో సిబ్బంది కొరతను ఆసరాగా చేసుకుని కొంతమంది ఈ శాఖ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న ఉదంతాలు ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం చోడవరం మండలం నర్సాపురం గ్రామంలో ఓ శీతల పానీయాల తయారీ కేంద్రంపై విజిలెన్స్‌ దాడులు చేసి అనధికారికంగా కేంద్రం నిర్వహించడంతోపాటు రసాయనాలను మోతాదుకు మించి వాడుతున్నట్లు గుర్తించారు.గత నెల పాడేరు ప్రాంతంలోని వారపు సంతల్లో తనిఖీలు చేపట్టిన ఆహార భద్రత ప్రమాణాల సంస్థ అధికారులు రంపపు పొట్టుతో చేసిన 125 కేజీల కల్తీ కారాన్ని గుర్తించి బయట పారబోయించారు.నెల రోజుల క్రితం ఎస్‌.రాయవరం పరిధిలో మామిడి పండ్లను నిషేధిత రసాయనాలను ఉపయోగించి మగ్గపెట్టడాన్ని విజిలెన్స్‌ తనిఖీల్లో బయటపెట్టారు.అనకాపల్లికి చెందిన ఓ ఇంటర్‌ విద్యార్థి తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. అతన్ని పరిశీలించిన వైద్యుడు ఆహారపు అలవాట్లపై ఆరా తీస్తే గత పక్షం రోజులుగా రహదారి పక్కనున్న దుకాణం వద్ద నూడిల్స్‌ క్రమం తప్పకుండా తింటున్నట్లు తెలిసింది. ఆ నొప్పికి కారణం కూడా ఆ నూడిల్సే కారణమని తేల్చారు.