తిరుపతి కార్పొరేషన్ లో అధికారి మాయ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తిరుపతి కార్పొరేషన్ లో అధికారి మాయ

తిరుపతి, జూలై  30, (way2newstv.com)
తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఓ అధికారి అంతా నా ఇష్టం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.. ఆయన ఓ సూపరింటెండెంట్‌ స్థాయి అధికారి.. ఆయన చెప్పిన మాయ మాటలకే ఇన్నాళ్లు ప్రాధాన్యం లభించింది.. పూర్వ కమిషనర్‌ ఆ అధికారి మంచి పనోడని నమ్మి ఒకటికి రెండు ప్రధాన పోస్టుల్లో కుర్చోబెట్టారు.. ఆయన ప్రతి పనికి రేటు ఖరారు చేసి మంచిగా వెనకేసుకున్నారు.. అన్ని శాఖలను గుప్పెట్లో పెట్టుకున్నారు.. అక్కడున్న వారంతా బాబూ.. చిట్టీ ఇది నీకు తగునా అంటున్నా ఆయన ఏ మాత్రం లెక్కచేయకుండా గడచిన ఐదేళ్లుగా కార్పొరేషన్‌లో హల్‌చల్‌ చేస్తున్నారు. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో సూపరింటెండెంట్‌గా ఉన్న ఓ అధికారి పూర్వ కమిషనర్‌తో కొంత సన్నిహితంగా ఉన్నారు.ఇదే ఆయనకు వరంగా మారింది.
తిరుపతి కార్పొరేషన్ లో అధికారి మాయ

అప్పటి ఎమ్మెల్యే అల్లుడుతో సన్నిహిత సంబంధాలు నెరిపిన ఆయన ఇప్పటికీ కార్పొరేషన్‌లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యేకు పీఏగా పనిచేసిన అనుభవంతో ఆయన తిరుపతి టీడీపీ నేతలకు మరింత దగ్గరయ్యారు. వారిని మెప్పించేందుకు అడ్డంగా పనిచేశారు. తోటి అధికారులనే కాకుండా కింది స్థాయిలో కొంత మంది ఉద్యోగులకు వైఎస్సార్‌సీపీ ముద్రవేసి అడుగడుగునా అడ్డుకున్నారు. టీడీపీ నేతల అండదండలు... ఉన్నతాధికారితో సాన్నిహిత్యం ఉండటంతో పాలన మొత్తం గుప్పెట్టో పెట్టుకున్నారు. అన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్లను తన వద్దకు తెతిప్పించుకునే కుట్ర చేశారు. స్టేషనరీ విభాగం పని మొదలు గెజిటెడ్‌ హోదా కలిగిన అధికారుల నుంచి వచ్చే ఫైళ్లను తన వద్దకు తెప్పించుకునేవారు. స్టేషనరీ బిల్లులను జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి అధికారి చూసుకోవాలి.కానీ స్టేషనరీ కొనుగోళ్లకు సంబంధించిన బిల్లులన్నీ ఆ అధికారే చూస్తారు. ఇందులో ఏం మతలబు ఉందో మరి. టౌన్‌ ప్లానింగ్‌లో బీపీఎస్‌ ఫైళ్లను తన వద్దకు తెప్పించుకునేందుకు ఆయన విశ్వప్రయత్నం చేసి విజయవంతమయ్యారు. ఈ శాఖలో ఆ స్థాయి అధికారి ఉంటారు. ఆయనతో పాటు ఇద్దరు డీపీఎస్‌లు, గెజిటెడ్‌ హోదా కలిగిన ఇద్దరు అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ ఆఫీసర్లు ఉంటారు. వీరు చూసిన ఫైళ్లను ఆపై అధికారులు పర్యవేక్షించాలి. కార్పొరేషన్‌ చరిత్రలో టౌన్‌ ప్లానింగ్‌ ఫైళ్లను ఓ మేనేజర్‌ చూసిన దాఖలాలు లేవు. అయితే సూపరింటెండెంట్‌ స్థాయి అధికారి మాత్రం పరిపాలన, టౌన్‌ ప్లానింగ్, ఇంజినీరింగ్‌ ఇలా అన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్లను తన వద్దకు తెప్పించుకున్నారు. ఈ అధికారి తీరుపై సహచర అధికారులు, కింది స్థాయి అధికారులు మండిపడుతున్నారు.పూర్వ కమిషనర్‌ బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రక్షాళనకు నడుం బిగించారు. ఈ బదిలీల్లో కూడా ఆ అధికారి చక్రం తిప్పారు. అర్హత ఉన్నా వారికి తీరని అన్యాయం చేశారు. ఎలాంటి అర్హతలు లేకున్నా అందలమెక్కించారు. హెల్త్‌ విభాగంలో 17 మందికి అర్హత లేకున్నా శానిటరీ ఇన్‌స్పెక్టర్లుగా పట్టం కట్టారు. డిగ్రీ,పీజీ, ఇంటర్‌  విద్యార్హతలు ఉన్నవారిని స్వచ్ఛమిత్రలుగా నియమించారు. అంతకన్నా తక్కువగా ఉన్న కొందరిని కార్యాలయం నుంచి బయటకు పంపకుండా చక్రం తిప్పారు. విలీన పంచాయతీల నుంచి వచ్చిన సిబ్బందిని స్థాయి, చేస్తున్న పనితో సంబంధం లేకుండా  స్వచ్ఛమిత్రలుగా పంపించారు. అర్హత లేని వారిని వర్క్‌ ఇన్‌స్పెక్టర్లుగా అందలమెక్కించారు. ఇలా అన్ని శాఖల్లో ఆయన మాటే శాసనంగా మారింది. బదిలీలు నిజాయితీగా జరిగినా ఒకరిద్దరిని దగ్గర పెట్టుకోవడంతో కొన్ని పొరబాట్లు జరిగాయని ఆ తరువాత కమిషనర్‌ అనేక సందర్భాల్లో చెప్పారు. కొందరికి అన్యాయం జరిగిందని, మరికొందరికి స్థాయికి మించి ప్రాధాన్యం అభించిందని గుర్తించిన ఆయన మరోసారి బదిలీలు చేపట్టాలని భావించారు. స్వచ్ఛ సర్వేక్షన్, సార్వత్రిక ఎన్నికలు రావడంతో బదిలీలకు వీలు కుదరలేదు. కారుణ్య నియామకాల భర్తీలో అడుగడుగునా అడ్డుపడుతున్నారు. అనారోగ్యంతో మృతి చెందిన ఉద్యోగుల పిల్లలకు అర్హత మేరకు పోస్టులు సకాలంలో ఇవ్వాలి. కారుణ్య నియామకాల ద్వారా ఐదుగురికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నా ఆ అధికారి కరుణించకపోవడంతో నెలలు గడుస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ఒక్కో ఉద్యోగానికి రెండు లక్షలు రూపాయల వరకు ఇస్తే గానీ ఫైలు ముందుకు కదలదని బేరసారాలు పెట్టారు. ఇచ్చే మామూళ్లను బట్టి పోస్టు ఉంటుంది. అడిగినంత ఇస్తే జూనియర్‌ అసిస్టెంట్‌ ఆపై పోస్టుల్లో తీసుకుంటాం. తక్కువ ఇచ్చుకుంటే బిల్‌ కలెక్టర్, అసిస్టెంట్‌ ఉద్యోగాలు ఇస్తాం, ఎక్కువ మాట్లాడితే పోస్టులే ఖాళీ లేదని రాసేస్తామని బెదిరించి పంపుతున్నారు. అడిగింది ఇచ్చుకోలేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధితులు ఫైళ్లు చేతబట్టుకుని కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు.