గుంటూరు, జూలై 26 (way2newstv.com):
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయి. అందుకు తగ్గట్లు సబ్జెక్టు ఉపాధ్యాయ నియామకాలు జరగక కొరత వేధిస్తోంది. మరోవైపు జూన్, జులై నెలల సిలబస్ ఆధారంగా ఆగస్టు 1, 2, 3 తేదీల్లో ఎఫ్‌ఏ-1 పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం షెడ్యూలు విడుదల చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 746 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా ప్రధానంగా పల్నాడులో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. నరసరావుపేట జిల్లా ఉప విద్యాశాఖ పరిధిలోని 18 మండలాల్లో 69 ఉన్నత పాఠశాలలు ఉండగా వాటిల్లో 176 ఖాళీలున్నాయి. అందులో కీలకమైన లెక్కలు, సైన్స్‌తోపాటు సాంఘికశాస్త్రం, తెలుగు, ఆంగ్ల పాఠ్యాంశాలు బోధించేవారు లేక ఆ ప్రభావం పరీక్షలపై పడుతోంది. సకాలంలో సిలబస్ పూర్తికాక చివరల్లో హడావుడి చేస్తుండడం విద్యార్థులకు భారంగా మారుతోంది.
పాఠాలెవరు చెప్తారు..? (గుంటూరు)
గత ఏడాది జరిగిన డీఎస్సీ పరీక్షల ఫలితాలు ప్రకటించినప్పటికీ ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో నియామకాలు చేస్తారన్న నమ్మకంతో ఉన్నప్పటికీ ఇప్పటివరకు చేయకపోవడంతో కొరత తీరలేదు.స్కూల్ అసిస్టెంట్లు- తెలుగు 65, హిందీ 17, సంస్కృతం 1, ఆంగ్లం 21, లెక్కలు 40, ఫిజికల్ సైన్స్ 15, బయాలజికల్ సైన్స్ 72, సాంఘికశాస్త్రం 102, లాంగ్వేజీ పండిట్లు- తెలుగు 2, హిందీ 5, పీఈటీ 53, ఎస్జీటీ 239, ఉర్దూ 6, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం 108 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బదిలీల సందర్భంగా నిర్వహించే కౌన్సెలింగ్, డీఎస్సీ నియామకాల్లో మొదట పట్టణాలు, ఆ తర్వాత వాటి దగ్గర్లో ఉన్న పాఠశాలలను కోరుకోవడంవల్ల అక్కడి ఖాళీలు భర్తీ అవుతుండగా గ్రామీణ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి అలాగే మిగిలిపోతున్నాయి. ముఖ్యంగా నరసరావుపేట విద్యాశాఖాధికారి పరిధిలోని అనేక పాఠశాలలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడు ఉన్నత పాఠశాలలో తొమ్మిది, వినుకొండ ప్రభుత్వ బాలుర, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలల్లో ఒక్కో దానిలో 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మాచర్ల మండలంలో 25, వెల్దుర్తి మండలంలో 13 మంది ఉపాధ్యాయుల కొరత ఉంది. ఇన్ని ఖాళీలు ఉన్న చోట బోధన ఎలా సాగుతుందో ఊహించుకోవచ్చు. ఈ ప్రభావం 6, 7, 8, 9 తరగతులపై అధికంగా కనిపిస్తోంది. తొలి నుంచి బోధన సక్రమంగా లేక పాఠ్యాంశాలపై పట్టు సాధించలేక పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించలేకపోతున్నారు.
Tags:
Andrapradeshnews