మహారాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మహారాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు

వాన నీటిలో మహాలక్ష్మీ ఎక్స్ ప్రెస్
ముంబై, జూలై 27 (way2newstv.com)
మహారాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముంబయి-కొల్హాపూర్ మహాలక్ష్మీ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ తెల్లవారుజామున 3 గంటలకు వరద నీటిలో చిక్కుకుపోయింది. రైలులో మొత్తం 2 వేల మంది ప్రయాణికులు ఉన్నారు. ముంబయికి 100 కిలోమీటర్ల దూరంలో వంగని-బాద్లాపూర్ మధ్యలో రైలు ఆగిపోయింది. ఆర్పీఎఫ్ సిబ్బంది, నగర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలులో చిక్కుకుపోయిన ప్రయాణికులకు బిస్కెట్ ప్యాకెట్లు, మంచినీరును అందించారు. రైలు నుంచి దిగొద్దని ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రయాణికుల రక్షణ నిమిత్తం అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైలు పట్టాలపై వరద నీరు వచ్చి చేరుతోంది. 
మహారాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు

దీంతో రైళ్లు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. ముంబై నుంచి కొల్హాపూర్‌ వెళ్తున్న మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌ను బద్లాపూర్‌ - వాగానీ మధ్య నిలిపివేశారు రైల్వే అధికారులు. ఉల్లాస్‌ నది ఉప్పొంగడంతో ఈ ఎక్స్‌ప్రెస్‌ మెట్లకు సమాంతరంగా వరద ప్రవహిస్తోంది. దీంతో రైల్లో ఉన్న ప్రయాణికులను కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు 220 మందిని కాపాడగా, ఇందులో 117 మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఎనిమిది బోట్లతో ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు హెలికాప్టర్లు, మిలటరీ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ పేర్కొన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. రైల్లో 700 మంది ప్రయాణికులున్నట్లు సెంట్రల్‌ రైల్వే సీపీఆర్వో ట్వీట్‌ చేసింది. కానీ రైల్లో 2 వేల మంది ప్రయాణికులు ఉన్నట్లు అనధికారికంగా వార్తలు వస్తున్నాయి.