బీజేపీతో ఎలా నడవాలి.... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బీజేపీతో ఎలా నడవాలి....


విజయవాడ, జూలై 2, (way2newstv.com)
ఆంధ్ర్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పాటైన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంతో ఎలా డీల్ చేయాలనే విషయంలో ఇంకా సందిగ్ధతను ఎదుర్కొంటోంది. వ్యూహాత్మక పంథాను అనుసరించి తెలుగుదేశాన్ని, బీజేపీని వేరు చేయడంలో గతంలో వైసీపీ విజయం సాధించింది. ప్రత్యేకహోదా కు తాము పోరాటం చేస్తున్నామన్న భావనను పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో టీడీపీ బోల్తా పడింది. ఆ అంశాన్ని తానే క్లెయిం చేసుకోవాలనే తొందరపాటులో కేంద్రానికి దూరమైంది. ప్రజల్లో పెద్దగా సెంటిమెంటుగా లేని అంశంతో పోరాటం చేసి ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. అటు కేంద్రంలో భాగస్వామ్యం లేక ఇటు రాష్ట్రంలో అధికారం కోల్పోయి రెంటికీ చెడ్డ రేవడిలా మిగిలిపోయింది తెలుగుదేశం. అప్పట్లో బీజేపీ అధినాయకత్వంతో కొంత సన్నిహితంగా ఉన్నట్లుగా కనిపించింది వైసీపీ. నిజానికి రెండు పార్టీలు అధికారంలోకి రావడంతో రాష్ట్రప్రయోజనాలు, కేంద్ర పరిమితుల మధ్య వైరుద్ధ్యం సహజంగానే నెలకొంది. అందువల్లనే ఎలా ముందుకెళ్లాలనే విషయంలో వైసీపీ ఇంకా తర్జనభర్జనలు పడుతోంది.వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం పార్టీలు ప్రత్యేక హోదా అన్న ఒక అంశాన్ని తీసుకుని పరస్పరం పోటీ పడ్డాయి. ప్రజలకు ఎంతమేరకు ప్రయోజనం అన్న సంగతి పక్కనపెడితే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం వరకూ దారి తీసింది. ఇప్పుడు రెండు పార్టీలు సాంకేతికంగా వెనక్కు వెళ్లలేవు. ‘25 ఎంపీ స్థానాలు ఇవ్వండి. నేను ప్రత్యేక హోదా తెస్తానం’టూ జగన్ మోహన్ రెడ్డి వాగ్దానం చేశారు. అది ఎన్నికల వాగ్దానం గా నే మిగిలిపోయే సూచనలున్నాయి. కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ లోని లోక్ సభ సభ్యుల సంఖ్యాబలంతో అవసరం లేదు. రాజ్యసభకు సంబంధించి తెలుగుదేశం సభ్యులు నలుగురు బీజేపీలో చేరిపోయారు. అందువల్ల జగన్ ఎంతగా మొరపెట్టుకున్నప్పటికీ అరణ్యరోదనగానే మిగిలిపోతుంది. అయితే జగన్ పదే పదే ఆ అంశాన్ని ప్రస్తావిస్తే..నీతి అయోగ్ వంటి ప్రధానవేదికలపై కేంద్రానికి కొంత చికాకు కలుగుతుంది. ఎక్కడైనా వెనకంజ వేస్తే రాజకీయాస్త్రాలు ఎక్కుపెట్టడానికి టీడీపీ సిద్దంగా ఉంది. ఇది ముందు నుయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితే. అందులోనూ జగన్ మోహన్ రెడ్డి ఎంతవరకైనా తెగించి పోరాడతారనే భావన ప్రజల్లో ఉంది. ఎన్నికల్లో గెలుపునకు ఆ అంశమూ దోహదం చేసింది. వెనక్కి వెళ్లడం సాధ్యం కాదు. అంశాన్ని సజీవంగా ఉంచుతూనే కొద్దికొద్దిగా చల్లబరుచుకోవాల్సి ఉంటుంది.నిజానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు నిధులు చాలా అవసరం. జీతభత్యాలు, పింఛన్లు, సంక్షేమ పథకాలకు మాత్రమే బడ్జెట్ సరిపోతుంది. కొత్త ఆదాయ వనరులు సమకూరే వాతావరణం కనిపించడం లేదు. ఒక్క ఇసుక విధానంలో మార్పులు మినహా నూతనంగా ఆదాయంపై కసరత్తు మొదలు పెట్టలేదు. ఇసుక ఆదాయం వెయ్యి కోట్లరూపాయల లోపునకే పరిమితమవుతుంది. సంక్షేమ రాజ్యంగా రూపుదిద్దాలన్న తపనలో ఇప్పట్లో విద్యుత్తు, ఇతర పన్నులు కూడా పెంచే సూచనలు లేవు. ఈ స్థితిలో పొదుపు మంత్రం పాటించడం ద్వారా అదనపు నిధులను రాబట్టాలనుకుంటోంది సర్కారు.



 బీజేపీతో ఎలా నడవాలి....



 గత తెలుగుదేశం ప్రభుత్వం వివిధ రూపాల్లో ఏడాదికి నాలుగు నుంచి అయిదు వేల కోట్ల రూపాయల వరకూ దుర్వినియోగం చేసినట్లు ఆర్థిక శాఖ ముఖ్యమంత్రికి నివేదించింది. ఈరకమైన దుర్వినియోగానికి తావు లేకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇటువంటి స్థితిలో అభివృద్ధికి ఏమాత్రం ఆస్కారం లేదు. అయితే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ మాత్రం సిద్దంగా ఉంది. 25 వేల కోట్ల రూపాయల మేరకు రాష్ట్రానికి విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. నేరుగా కాకుండా ఎక్సటర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల రూపంలో రుణాలు తెచ్చుకోవచ్చు. కేంద్రమే వాటిని చెల్లిస్తుంది. ఈ నిధులకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేస్తారు. అందువల్ల నిధులు దారి మళ్లడం జరగదు. రాష్ట్రం సొంత అవసరాలకు వాడుకోవడం కూడా జరగదు. ఈవిషయంలో విభేదించి టీడీపీ ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ ను ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు ఆ నిధులను సద్వినియోగం చేసుకుంటే అభివ్రుద్ధి జరుగుతుంది. కానీ ప్రత్యేక హోదా డిమాండును వదులుకోవాల్సి వస్తుంది.కేంద్రంతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకుని రాష్ట్రం విషయంలో కొన్ని ప్రయోజనాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు కూడా ఫలించే సూచనలు కనిపించడం లేదు. ఉద్దేశపూర్వకమో, సొంత అవసరాల కోసమో ఢిల్లీలోని తెలుగుదేశం అగ్రనాయకులంతా ముందుగానే బీజేపీలో కర్చీఫ్ వేసి కూర్చున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి, ఎంపీలు సీఎం రమేశ్, రామ్మోహనరావులు ఏపీ తరఫున చక్రం తిప్పుతున్నారు. తమ మాతృపార్టీ తెలుగుదేశం ప్రయోజనాలకూ వారు కట్టుబడి ఉంటారనేది రాజకీయ పరిశీలకుల అంచనా. అసలు కంటే కొసరు ముద్దు అన్నట్లుగా కొత్తగా తీర్థం పుచ్చుకున్న టీడీపీ ఎంపీలు బీజేపీలో చొచ్చుకుపోతున్నారు. ఈ స్థితిలో గతంలో ఉన్నంత చనువు కూడా వైసీపీకి లోపించింది. విజయసాయి రెడ్డి గతంలో కేంద్రంలో చురుకుగా వ్యవహరించేవారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆర్థిక విషయాల్లో ముఖ్యమంత్రికి సలహాలు ఇవ్వాల్సి వస్తోంది. కొన్ని అంశాల్లో విజయసాయి సలహాలు సీఎంకు అవసరమవుతున్నాయి. దాంతో సమయాభావంతో ఢిల్లీ పెద్దలతో డీలింగ్ లో వైసీపీ వెనకబడుతోంది.