పోటెత్తున్న వరద రైతుల కళ్లలో ఆనందం

కర్నూలు, జూలై 26, (way2newstv.com)
కర్నూలు జిల్లాల్లో తుంగభద్ర జలాశయానికి వరద పెరుగుతంది. దీంతో జిల్లాలోని హెచ్‌ఎల్‌సి ఆయకట్టు, గుంతకల్లు బ్రాంచి కెనాల్ రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నాలుగైదేళ్లుగా ఆరుతడి పంటలు అరకొరగానే సాగు చేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జిల్లాలో సరైన వర్షాలు లేవు. అలాగే కర్ణాటకలో తుంగభద్ర ఎగువ ప్రాంతంలో సైతం వర్షాలు కురవక పోవడంతో ఇన్‌ఫ్లో తగ్గిపోయింది. తుంగభద్ర జలాశయం నిండే పరిస్థితి లేదనే అనిపించింది.  నెలాఖరులోగా వర్షాలు కురిస్తే ఫ్లడ్ ఇన్‌ఫ్లో పెరుగుతుందని, తద్వారా కొంత మేరకు సాగు, ముఖ్యంగా తాగునీటికి ఇబ్బంది ఉండదని జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. 
పోటెత్తున్న వరద రైతుల కళ్లలో ఆనందం

గతేడాదితో పోలిస్తే ఈసారి జూలైలో సుమారు 20 నుంచి 23 టి ఎంసిల వరకు నీరు ప్రవాహం తగ్గింది. ఐదు రోజుల క్రితం తుంగభద్ర జలాశయంలో సుమారు 16 టిఎంసిల నీరు మాత్రమే చేరింది. అదే సమయానికి 38 టిఎంసిల నీరు చేరింది. తుంగభద్ర రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 100.86 టిఎంసిలు ఉంది. ఇందులో ఈసారి కనీసం 70-80 టిఎంసిల నీరు తుంగభద్రకు చేరితోనే ఇటు అనంతపురం, అటు కర్నూలు, కడప జిల్లాలతో పాటు కర్ణాటకలోని ఎడమవైపు కాలువల కింద పంటలకు, తాగునీటికి జలాలు విడుదల చేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తుంగభద్రలో 26.21 టిఎంసిల వరద నీరు చేరింది. గత ఏడాది మొత్తం 40.51 టిఎంసిల నీరు చేరింది. ప్రస్తుతం 51,162 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 2,556 క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉంది. హెచ్చెల్సీ పరిధిలో 2.849 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. ఇందులో అనంతపురం జిల్లాలో స్థిరీకరించబడిన ఆయకట్టు 1.45 లక్షల ఎకరాలుండగా, మిగతాది కడప, కర్నూలు జిల్లాలో పరిధిలో ఉంది. జిల్లా పరిధిలో గత ఏడాది 38 వేల ఎకరాల మేరకు ఆరుతడి పంటలు సాగు చేశారు. అందులోనూ హెచ్చెల్సీ నుంచి నీరు సరిగా రాకపోవడంతో పంటల చివరి దశలో వందలాది ఎకరాల్లో ఎండిపోయాయి. ఈ ఏడాది వర్షాలు సరిగా కురవని కారణంగా నీటి మట్టం తుంగభద్ర జలాశయంలో పెరగక పోవడంతో బోర్డు అధికారులు కూడా ఎదురు చూస్తున్నారు. కాగా కర్ణాటక ప్రాంతంలో ఈ నెలాఖరులోగా భారీగా వర్షాలు కురిస్తే వరద నీటి ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుతం కొద్దో గొప్పో వరద నీరు చేరుతుండటంతో హెచ్చెల్సీ ఆయకట్టులోని పిఎబిఆర్ రైట్ కెనాల్, ధర్మవరం బ్రాంచి కెనాల్ రైతులు కూడా ఆశలు పెట్టుకున్నారు. ఈ ప్రాంతంలోని ఇరిగేషన్ ట్యాంకులకు నీటిని విడుదల చేసే అవకాశం కలుగుతుందని రైతులు ఆశిస్తున్నారు. అలాగే గుంతకల్లు బ్రాంచి కెనాల్‌కు కూడా నీటిని విడుదల చేస్తే కనీసం ఆరుతడి పంటలు పెట్టుకోవడానికైనా అవకాశం ఉందని రైతులు ఆశ పడుతున్నారు. ముఖ్యంగా అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు ప్రాంతాలకు తాగునీటి అవసరాలు తీర్చాల్సిన అవసరం ఉంది.
Previous Post Next Post