రైస్ మిల్లర్లు వర్సెస్ అధికారులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రైస్ మిల్లర్లు వర్సెస్ అధికారులు

విజయనగరం, జూలై 30, (way2newstv.com)
సీఎంఆర్‌ తీసుకోవడంలో పౌరసరఫరాల సంస్థ, జిల్లాలోని రైసు మిల్లర్ల మధ్య నడుస్తున్న వివాదం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. న్యాయస్థానంలో మరో రెండు, మూడు రోజుల్లో మరలా కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. మిల్లర్లు ఇచ్చిన ధాన్యాన్ని నాణ్యత లేదన్న కారణంతో ఎఫ్‌సీఐ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో సీఎంఆర్‌ను పౌరసరఫరాల సంస్థనే తీసుకోవాలని మిల్లర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వివాదం అధికారులకు తలనొప్పి తెచ్చిపెట్టింది. నాణ్యత లేని సీఎంఆర్‌ను తీసుకుని ప్రభుత్వం నష్టపోవాలా? అన్నది జిల్లా అధికారుల వాదన. ఒకవేళ ఇదే నాసిరకం బియ్యం తీసుకుంటే.. భవిష్యత్తులో చౌకధరల దుకాణాలకు, అంగన్‌వాడీ  కేంద్రాలకు, పాఠశాలలకు, వసతిగృహాలకు ఆ సరకునే పంపాల్సి ఉంటుందని అంటున్నారు. దీనివల్ల అభాసుపాలవ్వాల్సిందేనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. 
రైస్ మిల్లర్లు వర్సెస్ అధికారులు

అసలు ఇన్ని చిక్కులకూ కారణం 1:4 విధానమేనన్న వాదన ప్రస్తుతం తెరపైకి వచ్చింది.జిల్లాలో గత ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 181 మిల్లులకు 4,51,298 మెట్రిక్‌ టన్నుల ధాన్యం అధికార యంత్రాంగం ఇచ్చింది. 3,20,345 మెట్రిక్‌ టన్నుల కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ వారు మర ఆడించి తిరిగి ఇవ్వాలి. ఇందులో కార్పొరేషన్‌ గోదాములకు 2,20,000 మెట్రిక్‌ టన్నులు ఇవ్వాలి. 2,17,286 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ ఇచ్చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంతవరకూ ఏ ఇబ్బందీ రాకపోయినప్పటికీ.. ఎఫ్‌సీఐ గోదాములకు ఇవ్వాల్సిన 82,345 మెట్రిక్‌ టన్నులతోనే చిక్కులొచ్చాయి. నాణ్యత లేదన్న కారణంతో ఎఫ్‌సీఐ ఆ సరకును తిప్పి పంపించింది. సుమారు 10 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే మిల్లర్ల ద్వారా ఎఫ్‌సీఐకి వెళ్లింది. ఇంకా దాదాపు 70 వేల మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ వారి వద్దే ఉండిపోయింది. ఎక్కడా లేని విధంగా విజయనగరం జిల్లాలోనే ధాన్యానికి పూచీకత్తుగా 1:4 నిష్పత్తిలో బ్యాంకు గ్యారంటీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీని ప్రకారం మిల్లర్ల నుంచి సుమారు రూ.130 కోట్ల విలువైన బియ్యం రావాల్సి ఉంది. ఈ ప్రకారం ఇంకా దాదాపు రూ.50 కోట్ల వరకు మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో 1:1 నిష్పత్తిలోనే అనుమతిచ్చారు.1:4 విధానంలో.. ఉదాహరణకు రూ.లక్ష మేర మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ ఇస్తే.. రూ.4 లక్షల విలువైన సరకును అధికారులు వారికిచ్చారు. ఇచ్చిన బ్యాంకు గ్యారంటీలకు బదులుగా నాలుగు వంతుల అధిక మొత్తంలో సరకు మిల్లర్లకు ఇచ్చారు. ఇదే అధికారులకు చిక్కులు తెచ్చిపెట్టింది. పెద్ద ఎత్తున సీఎంఆర్‌ వారి నుంచి రావాల్సి ఉండటం, ఆ స్థాయిలో బ్యాంకు గ్యారంటీలు తమ వద్ద లేకపోవడంతోనే అధికారులూ ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం తీర్పు మిల్లర్లకు అనుకూలంగా వస్తే అధికారులు తదుపరి చర్యలు ఏం చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది