పేదల బియ్యం పక్కదారి..(ఆదిలాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పేదల బియ్యం పక్కదారి..(ఆదిలాబాద్)

ఆదిలాబాద్, జూలై 24 (way2newstv.com): 
పేదల ఆకలి తీర్చటానికి ప్రభుత్వం రూపాయికి కిలో బియ్యాన్ని చౌకధరల దుకాణాల ద్వారా అందిస్తోంది. అయితే వీటిని కొందరు వ్యాపారులు చౌకగా కొనుగోలు చేసి పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రకు తరలిస్తూ అక్రమ దందాను గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు. మరికొందరు వ్యాపారులు ఈ బియ్యాన్ని తమ స్థానిక దుకాణాల్లోనూ బహిరంగంగానే విక్రయిస్తున్నారు.కొందరు వ్యాపారులు రేషన్‌కార్డు లబ్ధిదారుల వద్ద కిలో బియ్యం రూ.10 నుంచి రూ.13 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఒక కుటుంబంలోని ప్రతి సభ్యుడికి ప్రభుత్వం ఆరు కిలోల చొప్పున రేషన్‌కార్డు యజమానికి బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. అయితే వీటిని కొందరు బయట వ్యాపారులకు విక్రయించేస్తున్నారు. 
పేదల బియ్యం పక్కదారి..(ఆదిలాబాద్)

ఇలా కొనుగోలు చేసిన బియ్యాన్ని ఆ వ్యాపారులు కొంత లాభం చూసుకుని పెద్ద వ్యాపారులకు విక్రయిస్తుంటారు. ఈ బియ్యాన్ని వ్యాపారులు ప్లాస్టిక్‌ సంచుల్లో నింపి కిరాణ దుకాణాల్లో రూ.15, రూ.16 చొప్పున విక్రయిస్తున్నారు. కొందరు వ్యాపారులైతే ఈ బియ్యాన్ని రైస్‌ మిల్లుల్లో మర ఆడించి మేలు (సన్న) రకం బియ్యంగా మార్చి ఒక కిలో రూ.20కి పైగా విక్రయిస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని కొందరు వ్యాపారులు గుట్టుగా లారీల్లో మహారాష్ట్రకు తరలిస్తున్నారు. అక్కడ క్వింటాలు బియ్యం రూ.1,600 నుంచి రూ.1,800 వరకు విక్రయిస్తున్నారు. ఈ జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని ఇతర జిల్లాలతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మీదుగా మహారాష్ట్రకు ఈ బియ్యం సరఫరా అవుతున్నట్లు ఇటీవల ఆదిలాబాద్‌లో పట్టుబడ్డ బియ్యం లారీని బట్టి తెలుస్తోంది.వ్యాపారులు సేకరించిన బియ్యాన్ని ఆదిలాబాద్‌, నిర్మల్‌ కుమురం భీం జిల్లాల్లోని పలు మార్గాల్లో పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని బోథ్‌ మండలం ఘన్‌పూర్‌ మీదుగా, తలమడుగు మండలం గుండా, భోరజ్‌ చెక్‌పోస్టు నుంచి వీటిని జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. నిర్మల్‌ జిల్లాలో సారంగాపూర్‌ మీదుగా మహారాష్ట్రలోని ఈస్లాపూర్‌ మీదుగా, భైంసా, తానూర్‌ల మీదుగా వీటిని గుట్టుగా తరలిస్తున్నారు. కుమురం భీం జిల్లాలో రైలు మార్గం ద్వారా వీరూరు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.