ఇక ప్రభుత్వ మద్యం అమ్మకాలే... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇక ప్రభుత్వ మద్యం అమ్మకాలే...

విజయవాడ, జూలై 25, (way2newstv.com
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ద్వారా మద్యం అమ్మకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఎపి బేవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా నియమించే కార్పొరేషన్‌ అమ్మకం చేపట్టనుంది. ఇప్పటి వరకూ ఉన్న చట్టం ప్రకారం రాష్ట్రంలో మద్యం అమ్మకం అబ్కారీ దుకాణాల ద్వారా జరుగుతోంది. దీని ప్రకారం దుకాణాలను వేలంపాటలో ప్రైవేటు వ్యక్తులకు కేటాయించేవారు. లైసెన్సు పొందిన వ్యాపారులు వారికిష్టం వచ్చిన ధరలకు మద్యాన్ని విక్రయించడంతోపాటు పలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. 
ఇక ప్రభుత్వ మద్యం అమ్మకాలే...

అక్రమాలకు పాల్పడుతున్న వారికి భారీగా జరిమానాలు విధించినా, కేసులు బనాయించినా వారికి ఎటువంటి భయమూ ఉండటం లేదని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో స్పష్టంగా పేర్కొంది. నిరంతర ఉల్లంఘనలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని, మహిళా సంఘాలు రోజురోజుకూ పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతున్నాయని బిల్లులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ చిల్లర అమ్మకం ద్వారా ఖచ్చితమైన నిబంధనలు అమలు చేసి దుకాణాల ద్వారా చిల్లర అమ్మకంలో అక్రమాలను నిర్మూలించేందుకు ప్రభుత్వమే అమ్మకాలు చేపట్టాలని నిర్ణయించింది. దీని ప్రకారం చట్టంలో మార్పులు చేసి  అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఎపి బేవరేజస్‌ కార్పొరేషన్‌ లేదా ప్రభుత్వం ద్వారా అధికారం ఇచ్చిన సంస్థతో అమ్మకాలు నిర్వహించాలని నిర్ణయించింది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ చట్టం 1993కి సవరణలు చేసింది. దీని ప్రకారం ఇక ముందు ప్రైవేటు వ్యక్తులు ఎవరూ మద్యం అమ్మకాలు జరపడానికి వీల్లేదు. అయితే బార్లు, ఇతర నిర్దేశించిన ప్రాంతాల్లో ప్రభుత్వం అనుమతితో అమ్మకాలను క్రమబద్దీకరించ నున్నట్లు బిల్లులో పేర్కొన్నారు.