చినుకు పడితే ముప్పే.. (పశ్చిమగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చినుకు పడితే ముప్పే.. (పశ్చిమగోదావరి)

 ఏలూరు, జూలై 6  (way2newstv.com):
 జిల్లాలోని మున్సిపాలిటీల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. జిల్లాలో ఏలూరు నగరంతోపాటు భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీగా ఉంది. ఈ పట్టణాల్లో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉంటోంది. ఏటా వీటి నిర్వహణ, నిర్మాణాలకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా వర్షాకాలం వచ్చేసరికి పురప్రజలకు వణుకు పుట్టిస్తున్నాయి. ఇటీవల కురిసిన ఓ మోస్తరు వర్షానికి జిల్లా కేంద్రం ఏలూరు చిగురుటాకులా వణికిపోయింది. వర్షాకాలానికి తగ్గట్టుగా పురపాలక అధికారుల దగ్గర ముందస్తు ప్రణాళిక లేకపోవడం ప్రజలకు శాపంగా మారుతోంది. 
చినుకు పడితే ముప్పే.. (పశ్చిమగోదావరి)


ఏటా ఎదురవుతున్న కష్టనష్టాలను చూసైనా పాఠం నేర్చుకోకపోతే ప్రజలకు ఎప్పటిలాగే ఇబ్బందులు తప్పవు.జిల్లా కేంద్రం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ అయినప్పటికీ చిన్నపాటి సమస్యలనూ సమర్థంగా ఎదుర్కోలేకపోతోంది. రెండు రోజుల కిందట కురిసిన ఓ మోస్తరు వర్షానికి నగరంలోని రహదారులన్నీ నీట మునిగాయి. చిన్నపాటి వర్షానికే ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో నగరవాసులు ముక్కున వేలేసుకున్నారు. భారీ వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో మొదటి నుంచీ ఇదే పరిస్థితి. చిన్నపాటి వర్షం కురిసినా రహదారులు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. తమ్మిలేరులో నీటిప్రవాహం ప్రారంభమైతే నగర ప్రజలకు గుండెదడే. తమ్మిలేరులో ఎటువంటి ప్రవాహం లేకుండానే బుధవారం కురిసిన వర్షానికి జిల్లా కేంద్రం ముంపునకు గురైంది. నగరంలోని రామచంద్రరావుపేట, పవర్‌పేట, కొత్తపేట, వైఎస్సార్‌ కాలనీ, ఎమ్మార్సీ కాలనీ, ఆముదాల అప్పలస్వామి కాలనీ ముంపునకు గురయ్యాయి. నగరపాలక సంస్థ ఆవరణలోనే మోకాల్లోతు నీరు చేరింది. జిల్లా కలెక్టరు కార్యాలయం ఆవరణ సైతం తటాకాన్ని తలపించింది. ఆఖరికి ట్యాంకర్లు రప్పించి మోటార్లతో తోడితే కానీ నీరు తగ్గిపోలేదు. పలు ప్రభుత్వం కార్యాలయాల ఆవరణలు, బస్టాండు ప్రాంతం, ప్రభుత్వాసుపత్రి ప్రాంగణం ఇలా అన్ని ప్రాంతాలూ కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నట్లయ్యింది.ఏలూరు నగరంలో గత ఐదేళ్లలో డ్రెయినేజీ నిర్మాణాలకు రూ. 14 కోట్లు ఖర్చు చేశారు. 34 కిలోమీటర్ల మేర వీటిని నిర్మించారు. ఇంత ఖర్చు చేసినా ఉపయోగం లేకుండా పోతోందని చెప్పక తప్పదు. ఏటా ఎంతో కొంత అభివృద్ధి చెందుతూ మార్పు కనిపించాలని అందరూ కోరుకుంటారు. ఏలూరు నగరానికి వచ్చేటప్పటికి ఆ మార్పు కానీ, పురోగతి కానీ కనిపించడం లేదంటూ జిల్లాకేంద్ర వాసులు గగ్గోలు పెడుతున్నారు. సాధారణంగా ఏలూరు ఒక గిన్నె మాదిరిగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా డ్రెయిన్ల నిర్మాణం లేదు. మురుగునీరు సక్రమంగా పారేలా వ్యవస్థ లేదు. ఈ మురుగునీరంతా తమ్మిలేరులోకి వెళ్లాలి. అందుకు తగిన విధంగా వాలు లేకపోవడంతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోతోంది. దాంతో పాటు నగరంలో డ్రెయిన్లు చాలావరకు ఆక్రమణలకు గురయ్యాయి. ఎక్కడికక్కడ పూడుకుపోవడం ఒక కారణం. చాలాచోట్ల డ్రెయిన్లపైనే చిరువ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఈ వ్యర్థాలు కాలువల్లోకి వేసేస్తున్నారు. చాలా చోట్ల నివాసాల్లోకి వెళ్లే ర్యాంపులు డ్రెయిన్లపైనే నిర్మించేశారు. వీటివల్ల పూడిక తీయడానికి అవకాశం లేకుండా పోతోంది. జాలిపూడి డ్రెయిను పూడిక తీసి, ఆక్రమణలు తొలగించగలిగితే ప్రధాన సమస్యకు పరిష్కారం దొరికినట్లే. అయితే ఆ దిశగా అడుగులు పడటం లేదు.