హైద్రాబాద్ నగరంలో ఆటంకాలు లేని సాఫీ ప్రయాణానికి బాటలు వేసిన మెట్రో రైల్ విశేష ఆదరణ పొందుతోంది. ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రజలు మెట్రో ప్రయాణం వైపు మొగ్గు చూపుతున్నారు. సవాళ్లను అధిగమించి అందుబాటులోకి వచ్చిన మెట్రో రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్యను పెంచుకుంటోంది. మెట్రో వచ్చిన తర్వాత సిటీ లో ట్రాఫిక్ సమస్య కొంత మేర తగ్గింది. మెట్రో ఒక్కో మైలురాయి దాటుకుంటూ ముందుకు సాగుతున్న మెట్రో రైల్ త్వరలోనే మరో ఘనత సాధించనుంది. నగరంలో ఐదు లక్షల ప్రయాణికుల మార్క్ ను దాటనుంది.మెట్రో కారిడార్ –1లోని మియాపూర్ -ఎల్బీనగర్, కారిడార్-–3లోని నాగోల్ హైటెక్ సిటీ రూట్లలో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
రోజు రోజుకు పెరుగుతున్న మెట్రో ప్రయాణికులు
ఆపై కారిడార్–2 పనులను వేగవంతం చేశారు. ఇప్పటికే 56 కి.మీ మేర సేవలందిస్తున్న మెట్రో.. మరో 10 కిలో మీటర్ల మేర విస్తరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కారిడార్–1లోని మియాపూర్ నుంచి ఎల్బీనగర్ కు 29 కిలో మీటర్లు, కారిడార్-–3లోని నాగోల్ నుంచి హైటెక్ సిటీకి 27 కిలో మీటర్ల పొడవునా సేవలు అందిస్తోంది. నవంబర్ నాటికి జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ రూట్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రెండు కారిడార్లలో రోజుకు 2.85 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. జేబీఎస్- ఎంజీబీఎస్ రూట్ అందుబాటులోకి వస్తే ఆ రూట్లోనూ ఏడాది చివరి నాటికి ప్రయాణికుల సంఖ్య లక్ష వరకూ ఉంటుందని అంచనా.టికెట్ ప్రయాణికుల కంటే స్మార్ట్ కార్డ్ వినియోగిస్తూ ప్రయాణించే వారి సంఖ్య అధికంగా ఉంటోంది. ప్రయాణికుల సంఖ్య ఇలాగే పెరిగితే త్వరలోనే మెట్రో ప్రయాణికుల సంఖ్య ఐదు లక్షలకు చేరుతుందని మెట్రో వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జేబీఎస్ ఎంజీబీఎస్ రూట్ అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సంఖ్య 5 లక్షల మార్కు దాటే అవకాశం ఉంది.జేబీఎస్ ఎంజీబీఎస్ రూట్ లో సర్వీసులు ప్రారంభమైతే కీలక ప్రాంతాల మధ్య కనెక్టివిటీ ఏర్పడుతుందని మెట్రో ఎండీ తెలిపారు. క్రమంగా సర్వీసుల పెంపు కూడా సాధ్యమవుతుందని వివరించారు.