అనంతపురం, జూలై 31, (way2newstv.com)
సాకే శైలజానాథ్. కాంగ్రెస్ సీనియర్ నేత. అనంతపురం జిల్లా సింగనమల అసెంబ్లీ స్థానం నుంచి 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. వైఎస్‌కు అత్యంత ఇష్టమైన నాయకుల్లో సాకే శైలజానాధ్ ఒకరు. ఎస్సీ వర్గానికి చెందిన సాకే శైలజానాధ్ సబ్జెక్టు ఉన్న నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఏ విషయంపై నైనా ఆయన పూర్తి అవగాహనతో మాట్లాడేవారు. విమర్శలను కూడా చాలా మృదువుగా, వివాదాస్పదం కాకుండా చూసుకునే వారు. ప్రత్యేక రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ బృందంలో సాకే శైలజానాధ్ ముఖ్యులు. అదేసమయంలో సీమ హక్కుల కోసం పోరాడిన నాయకుల్లో కూడా ముందున్నారు. కాంగ్రెస్ అంటే మమకారం చూపించే ఈ నాయకుడు రాష్ట్ర విభజన తర్వాత ఎంతో మంది కీలక నాయకులు పార్టీకి దూరమైనా..సాకే శైలజానాధ్ మాత్రం పార్టీలోనే కొనసాగారు.కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడం కోసం సాకే శైలజానాధ్ చాలా కృషి కూడా చేశారు.
సాకే కు బీజేపీ గాలం
అయితే, విభజన నేపథ్యంలో ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతను తగ్గించడంలో మాత్రం ఆయన విఫలమయ్యారు. దీంతో సాకే శైలజానాధ్ వ్యూహాలు కొరగాకుండా పోయాయి. ఈ క్రమంలోనే ఆయనకు అప్పటి అధికార పార్టీ టీడీపీ నుంచి ప్రతిపక్షం వైసీపీ నుంచి కూడా ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే, ఆయన ఎటు వెళ్లాలో అర్ధం కాక ఏమీ తేల్చుకోలేక పోయారు. ఇంతలోనే ఎన్నికలు వచ్చాయి. దీంతో సంప్రదాయంగా ఆయన పోటీ చేస్తూ వచ్చిన కాంగ్రెస్ నుంచే తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ పోటీ చేశారు. అయితే, జగన్ సునామీ ముందు సాకే శైలజానాధ్ కూడా కుప్పకూలారు. దీంతో ఇప్పుడు ఆయన మీడియా ముందుకు కూడా రాలేక పోతున్నారు. నిర్మాణాత్మకమైన విమర్శలు చేయడంలో పెట్టింది పేరైన సాకే శైలజానాధ్ ఇప్పుడు జగన్ ప్రభుత్వంపైనా విమర్శలు చేయడం లేదు.పైగా కేడర్ కూడా ఇప్పుడు సాకే శైలజానాథ్ కు దూరమైంది. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ భవితవ్యం ఏంటనే సందేహాలు తెరమీదికి వచ్చాయి. వాస్తవానికి సాకే శైలజానాధ్ టీడీపీలోకి వస్తే.. సింగనమల టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. అయితే, సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్‌తో ఉన్న బంధాన్ని తెంచుకోలేక పోయారు. ఇక, ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తుకే పెను ప్రమాదం ఏర్పడడంతో ఇప్పుడు ఏదో ఒక పార్టీలోకి జంప్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అయితే, ఎన్నికలకు ముందు రెండు ఆప్షన్లు ఆయన ముందు ఉండగా.. ఇప్పుడు ఏకంగా మూడు వచ్చాయి. గతంలో టీడీపీ, వైసీపీలు ఆయనను చేరాలని కోరగా.. ఇప్పడు వీటికి బీజేపీ కూడా తోడైంది. పార్టీలోకి వస్తే.. రాయలసీమ వ్యవహారాల బీజేపీ కమిటీకి అధ్యక్షుడిగా నియమిస్తామని సాకే శైలజానాధ్ కి వర్తమానాలు అందుతున్నాయి.ఈయన కనుక బీజేపీలోకి వస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఓటు బ్యాంకును తమవైపు మలుచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇక, టీడీపీ పరిస్థితి భిన్నంగా ఉంది. సింగనమలలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. దీనిని సరిదిద్దేందుకు సాకే శైలజానాధ్ వంటి కీలక నేత అవసరం. అయితే, సాకే శైలజానాధ్ కు టీడీపీతో పెద్దగా అవసరం లేదు. ఇక, వైసీపీలో ఇప్పుడు ఖాళీలేదు. ఆయన రావాలన్నా కూడా ఆహ్వానించే వారు కూడాలేరు . ఈ నేపథ్యంలో సాకే శైలజానాధ్ త్వరలోనే బీజేపీ బాటలో నడుస్తారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Tags:
Andrapradeshnews