నో యూనిఫాం.. (విజయనగరం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నో యూనిఫాం.. (విజయనగరం)

విజయనగరం, జూలై 19 (way2newstv.com) : 
గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో ఈ ఏడాది కొత్త తిప్పలు ఎదురవుతున్నాయి. ఏటా పాఠశాలల పునఃప్రారంభం నాటికే విద్యార్థులకు దుస్తులు అందించే ఆనవాయితీ ఉండేది. అందుకు భిన్నంగా ఈ ఏడాది బడులు ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా పిల్లలకు దుస్తులు అందలేదు. దీంతో దాదాపు పదిహేను వేలమంది పాత దుస్తులతోనే పాఠశాలకు వెళ్తున్నారు. వసతిగృహాల సౌకర్యాలకు సంబంధించిన సామాగ్రి పూర్తి స్థాయిలో అందుతుండటంతో దుస్తులు ఎప్పుడు వస్తాయోనని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు నాలుగు జతల దుస్తులు పంపిణీ చేయాలి. కానీ ఇప్పటి వరకు దుస్తులకు సంబంధించిన వస్త్రం కూడా సరఫరా కాలేదు. 
నో యూనిఫాం..  (విజయనగరం)

దీంతో పిల్లలు గత ఏడాది బట్టల్నే ఉపయోగిస్తున్నారు. కొత్తగా చేరిన పిల్లలు మాత్రం అవస్థలు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ఉపయోగించేందుకు ట్రాక్‌సూట్లు, తువ్వాళ్లు పంపిణీ చేసిన ప్రభుత్వం ఏకరూప దుస్తుల్ని మాత్రం అందించడం లేదు. ఒక విద్యాసంవత్సరంలో విద్యార్థికి సగటున 15 నోటు పుస్తకాలు అందించాలి. ఈ లెక్కన పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని 55 పాఠశాలల్లో 5,23,698 పుస్తకాలు అవసరమని ఉన్నతాధికారులకు తెలిపారు. కానీ ఇప్పటి వరకు 3,27,447 పుస్తకాలు మాత్రమే వచ్చాయి. వీటినీ కొన్ని పాఠశాలల్లో పంపిణీ చేయలేదు. ఇలాగైతే చదువులు సాగేదెలా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం 28వేల జతల బూట్లను కొనుగోలు చేసింది. వాటితో పాటుగా సాక్సుల్నీ కొన్నారు. కానీ పంపిణీ సమయంలో బూట్లు మాత్రమే అందించారు. సాక్సుల్ని ఇప్పటివరకు ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు వాటిని ఉపయోగించలేక పోతున్నారు. వీటితో పాటు ఇరవై ఆరు రకాల క్రీడలు ఆడేందుకు పరికరాలను ఈ ఏడాది సమకూర్చారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం వేళల్లో అల్పాహారం అందిస్తున్నారు. ఏ రోజుకు ఆరోజు వీటిని తయారు చేసుకొనేందుకు సమయం చాలడంలేదు. అందువల్ల ముందు రోజు సమాయత్తం చేసుకొని వాటిని భద్రపరిచేందుకు శీతలీకరణ యంత్రాలు తీసుకువచ్చారు. మూడు వందల లోపు విద్యార్థులున్న పాఠశాలలకు ఒకటి, అంతకు మించితే రెండు యంత్రాలను అందించారు. ఐటీడీఏ పరిధిలో సౌరవిద్యుత్తు దీపాలు పదివేలు పంపిణీచేశారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం ఏకరూప దుస్తుల్ని ఎందుకు అందించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.