ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం : కేటీఆర్
పేదల పెన్నిధి కేసీఆర్ హరీష్ రావు
హైద్రాబాద్, జూలై 20, (way2newstv.com)
రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ లబ్ధిదారులకు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలో జరుగుతోంది. పెంచిన ఆసరా పెన్షన్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సిరిసిల్ల తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే పింఛన్లు 5 రెట్లకు పెంచుకున్నామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీడీ కార్మికులకు కూడా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను రెట్టింపు చేశామని వివరించారు. సిరిసిల్లలో పింఛన్ లబ్ధిదారులకు కేటీఆర్ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. పెంచిన ఆసరా పెన్షన్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కేటీఆర్ ప్రసంగించారు.17శాతం వృద్ధిరేటుతో అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ ముందుంది. పింఛను అర్హత వయసు తగ్గింపు కూడా జూన్ నెల నుంచే వర్తిస్తుంది.
తెలంగాణ వ్యాప్తంగా ఫించన్ల పంపిణీ షురూ...
బీడీ కార్మికులకు పీఎఫ్ కటాఫ్ తేదీని తగ్గించడంతో కొత్తగా 2 లక్షల మందికి పింఛను అందుతుంది. నిర్మాణం పూర్తయిన రెండు పడక గదుల ఇళ్లను త్వరలోనే లబ్ధిదారులకు అందిస్తాం. సుమారు రూ.20లక్షల విలువ చేసే డబుల్ బెడ్ రూం ఇళ్లను ఉచితంగానే ఇస్తున్నాం. ప్రభుత్వ ఇళ్ల కోసం ఎవరూ.. ఒక్క రూపాయి కూడా ఎవరికీ ఇవ్వొద్దు. ఆశావహులు ఎక్కువున్న చోట లాటరీ తీసి ఇళ్లను కేటాయిస్తాం. ఇందిరమ్మ ఇళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.70వేలు మాత్రమే ఖర్చు చేసింది. దశాబ్దాలుగా ఉన్న ఇళ్ల పట్టాల సమస్యలు పరిష్కరించాం. సిరిసిల్లలో 1500 ఇండ్ల నిర్మాణం పూర్తికావొచ్చింది. ఇంటి స్థలం ఉన్న పేదలు ఇల్లు కట్టుకోవడానికి రూ.5లక్షలు. బతుకమ్మ చీరల బకాయిలు త్వరలోనే విడుదల చేయిస్తాం. వడ్డీలేని రుణాల నిధులు కూడా విడుదల కాబోతున్నాయి. ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలనేదే సీఎం కేసీఆర్ ధ్యేయం.' అని కేటీఆర్ పేర్కొన్నారు.
సిద్ధిపేటలో...
సిద్ధిపేటలో ఆసరా పింఛన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. లబ్ధిదారులకు హరీశ్‌రావు మంజూరు పత్రాలు అందజేశారు. హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి పింఛన్లు పెంపు జరిగింది. ఎన్నికల కోడ్ వల్ల పింఛన్ల పెంపు 6 నెలల ఆలస్యం అయింది. రూ.2016, రూ.3016 పింఛను ఇస్తూ సీఎం కేసీఆర్ పేదలకు ఆసరాగా నిలుస్తున్నారు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్. త్వరలోనే నిజమైన పేదలందరికీ రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ చేస్తాం. చెట్లు తగ్గడం వల్లే కాలుష్యం పెరిగి అనారోగ్యం బారిన పడుతున్నామని హరీశ్ రావు పేర్కొన్నారు.
వనపర్తిలో...
టీఆర్ఎస్ ప్రభుత్వానికి అందరి ఆశీస్సులు కావాలని రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి పట్టణంలో పెరిగిన పించన్ల ఫ్రొసీడింగ్స్ ను మఃంత్రి నిరంజన్ రెడ్డి లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్వేతా మహంతి, జెడ్పీ చైర్మెన్ లోకనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో పేదరికం ఉన్నంతకాలం ప్రభుత్వం పెన్షన్లు అందజేస్తుందన్నారు. తెలంగాణలో ఉన్న అన్నిరకాల వనరులను సద్వినియోగం చేసుకుంటే పదేళ్లలో దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందన్నారు. ఆ దిశగానే ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ది పనులతో పాటు, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. పెరిగిన ఫించన్లు నేరుగా లబ్దిదారుల అకౌంట్లలో జమ అవుతాయన్నారు. తొమ్మిది ఎకరాలలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. డబల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారుల విషయంలో రాజకీయ జోక్యం ఉండదన్నారు. ప్రభుత్వ అధికారులే సర్వే నిర్వహించి ఇండ్లు లేనివారిని గుర్తిస్తారన్నారు. బహిరంగంగా లాటరీ పద్దతిన లబ్దిదారులను ఎంపిక చేస్తారన్నారు. ఇండ్లు లేని ప్రతి పేదవారికి న్యాయం జరిగేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సొంత జాగా ఉన్నవారికి అక్కడే ఇండ్లు కట్టుకునేందుకు త్వరలోనే ఉత్తర్వుల విడుదల చేస్తామన్నారు. సమాజంలో ఆకలిగొన్న వర్గాలున్నయి ఆలోచించండి. బంతిల ఉన్నరు మీ వంతు వస్తుంది. అభివృద్ది పనులు జరుగుతున్నయి ఓపికపట్టండని మంత్రి పేర్కొన్నారు.
నిర్మల్ లో...
ద్ధులకు ఆసరా కల్పించి.. వితంతువులకు భరోసానిచ్చి..వికలాంగులకు చేయూతనందించి పేదల ఇంట్లో సీఎం కేసీఆర్ పెద్దకొడుకయ్యాడని రాష్ర్ట అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ పట్టణంలోని పలు వార్డుల్లో పెంచిన పింఛన్లను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. పింఛన్ల అమలును హర్షిస్తూ మంత్రి అల్లోల ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపు నేటి నుంచి అమలులోకి వచ్చిందన్నారు. పెరిగిన పింఛన్ ప్రకారం వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, బోధకాలు బాధితులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు రూ.2,016 చొప్పున, వికలాంగులకు రూ.3,016 చొప్పున అందజేస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,47, 400 మంది లబ్ధిదారులు ఉండగా, గతంలో ఫించన్ల కోసం ప్రభుత్వం రూ.15 కోట్ల 36 లక్షలు ఖర్చు చేస్తే ఇప్పుడు పెంచిన ఫించన్ల కోసం దాని కంటే రెట్టింపుగా రూ.31 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెలంగాణలో దేశం గర్వించదగ్గ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి ఇతర పథకాలు ప్రతి కుటుంబానికి చేరుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కే. విజయలక్ష్మి, కలెక్టర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
హైద్రాబాద్ లో...
దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్ రాష్ట్రమని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. పేదల గురించి ఆలోచించే నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. ఆసరా లబ్ధిదారులు ఇబ్బంది పడొద్దనే పింఛన్లు నేరుగా బ్యాంకు ఖాతాలో వేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చే పింఛన్లతో ఇంట్లో వృద్ధుల గౌరవం పెరిగిందని చెప్పారు. రవీంద్రభారతిలో ఆసరా పింఛన్లు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని హోంశాఖ మంత్రి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, ముఠా గోపాల్, స్టిఫెన్‌సన్ కూడా పాల్గొని అర్హులకు పింఛన్ ఉత్తర్వులను పంపిణీ చేశారు. తలసాని మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో పెన్షన్లు సరైన సమయానికి అందేవి కావు. రూ.200 పెన్షన్ కోసం కాళ్లు అరిగేలా తిరగాల్సి వచ్చేది. లబ్దిదారుల బ్యాంకు అకౌంట్లలో నేరుగా జమచేసే పద్ధతికి శ్రీకారం చుట్టాం. వృద్ధులను సీఎం కేసీఆర్ పెద్దకొడుకులా ఆదుకుంటున్నడు. అర్హులైన అందరికీ పింఛన్లు అందాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం చాలా నగరాల్లో నీటి కొరత ఏర్పడింది. హైదరాబాద్‌లో చెన్నై తరహా పరిస్థితులు రావొద్దని సీఎం సంకల్పించారు. రైతులను కూడా పూర్తిస్థాయిలో ఆదుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతులకు పెట్టుబడితో పాటు బీమా కూడా కల్పిస్తున్నాం. సికింద్రాబాద్ బోనాలకు 400ఏళ్ల చరిత్ర ఉంది. బోనాలు, బతుకమ్మను విదేశాల్లో కూడా ఘనంగా, గర్వంగా జరుపుతున్నారు. గోల్కొండ బోనాల వేడుకకు ఐదు లక్షల మంది భక్తులు హాజరయ్యారని వివరించారు.
Tags:
telangananews