అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు

హైద్రాబాద్, జూలై 25, (way2newstv.com)
ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 'త్వరలోనే పూర్తి స్థాయి బడ్జెట్‌తో ముందుకొస్తాం.. అప్పుడు అన్ని అంశాలపై సమగ్ర సమాచారాన్ని అందిస్తాం...' అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఈనెలాఖరులోనో లేక వచ్చే నెల మొదటి వారంలోనో పూర్తిస్థాయి పద్దును ప్రతిపాదిస్తారని అందరూ భావించారు. కానీ సచివాలయంలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనబడుతున్నది. ఉన్నతాధికారుల దగ్గర్నుంచి సెక్షన్‌ ఆఫీసర్ల వరకూ అందరూ శాఖల తరలింపుపైన్నే ప్రధానంగా దృష్టి సారించారు. ఫైళ్లు, బీరువాలు, ఇతర సామాగ్రిని తరలించే పనిలో వారు నిమగమయ్యారు. కీలకమైన ఆర్థికశాఖ సచివాలయానికి దగ్గర్లోని బూర్గుల రామకృష్ణారావు (బీఆర్‌కే) భవన్‌కు తరలిపోనుంది.  
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు

ఈ క్రమంలో ఆ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటి వరకూ బడ్జెట్‌పై దృష్టి సారించలేదని సమాచారం మరోవైపు ప్రతియేటా బడ్జెట్‌కు రూపకల్పన చేసేముందు వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు స్వీకరించటం పరిపాటి. కానీ ప్రస్తుతం అలాంటి ఊసే లేకపోవటం గమనార్హం. ఇందుకు సంబంధించి జూన్‌లో కొంత హడావుడి కనిపించినప్పటికీ ఇప్పుడు అధికారులు ఆ ప్రస్తావనే తీసుకు రావటం లేదు. ప్రభుత్వ పెద్దల దృష్టంతా ఆగస్టులో నిర్వహించబోయే మున్సిపల్‌ ఎన్నికలపైన్నే ఉందని ఓ అధికారి ఈ సందర్భంగా వ్యాఖ్యానించటం గమనార్హం. ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాతగానీ శాఖల నుంచి ప్రతిపాదనలు స్వీకరించబోరని సమాచారం. ఇదే జరిగితే పూర్తి స్థాయి బడ్జెట్‌ కోసం సెప్టెంబరు వరకూ వేచి చూడక తప్పదు. మరోవైపు పురపాలక సంఘాల ఎన్నికలపై హైకోర్టులో కేసు కొనసాగుతున్నది. ఇది తేలడానికి మరింత సమయం పట్టే అవకాశముంది. పూర్తి స్థాయి బడ్జెట్‌పై ఇది కూడా ప్రభావం చూపనున్నది. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఓటాన్‌ అకౌంట్‌నే ప్రవేశపెడుతున్నదనీ, అందువల్ల రాష్ట్రం కూడా అనివార్యంగా తాత్కాలిక పద్దుకే మొగ్గు చూపాల్సి వస్తున్నదనీ ఆయన అప్పట్లో చెప్పారు. కేంద్రం పూర్తి స్థాయిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత.. అక్కడి నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు, గ్రాంట్లు, ఇతర సహాయాల ఆధారంగా ఇక్కడ కూడా పూర్తిస్థాయి పద్దును ప్రతిపాదిస్తామని ఆయన ప్రకటించిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఈనెల్లో కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఇది జరిగి దాదాపు 15 రోజులు గడిచింది. అయినా టీఆర్‌ఎస్‌ సర్కారు.. పూర్తి స్థాయి బడ్జెట్‌పై దృష్టి సారించకుండా శాఖల తరలింపు, మున్సిపల్‌ ఎన్నికలపైన్నే దృష్టి సారించటం గమనార్హం. మరోవైపు ఆర్థికశాఖకు మంత్రి కూడా లేకపోవటం పలు విమర్శలకు తావిస్తున్నది. దసరా తర్వాత పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే వార్తల నేపథ్యంలో.. అప్పుడే పూర్తిస్థాయి బడ్జెట్‌కు ముహూర్తం ఖరారవుతుందనే వాదనలూ వినబడుతున్నాయి.