డ్వాక్వా ఉత్పత్తులకు లైన్ మార్కెటింగ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

డ్వాక్వా ఉత్పత్తులకు లైన్ మార్కెటింగ్

విజయవాడ, జూలై 28, (way2newstv.com)
ఈ కామర్స్ వెబ్‌సైట్లతో ఆన్‌లైన్ వ్యాపారం విస్తరించాక, ప్రపంచంలోని ఏ మూలన ఉండే ఉత్పత్తులైనా.. ఇంట్లో కూర్చునే తెప్పించుకోవడం సులువైపోయింది. ఏపీకే పరిమితమైన డ్వాక్రా సంఘాల ఉత్పత్తులు ఇకపై రాష్ట్రాలు, దేశాల సరిహద్దులు దాటి వెళ్లబోతున్నాయి. డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెట్ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యత్నాలు ఓ కొలిక్కి వస్తున్నాయి.సరిగ్గా ఇదే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళల అభివృద్ధికి వినియోగించుకోవాలని భావించింది. రాష్టవ్య్రాప్తంగా ఉన్న 80 లక్షల మంది డ్వాక్రా సంఘాల మహిళలు ప్రయోజనం పొందేలా వారి ఉత్పత్తులకు ఆన్‌లైన్ మార్కెటింగ్ కల్పించాలని నిర్ణయించింది. 
డ్వాక్వా ఉత్పత్తులకు లైన్ మార్కెటింగ్ 

రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న కొన్ని ప్రముఖ ఉత్పత్తులను ప్రాథమికంగా ఎంపిక చేసి వాటిని ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎంపిక చేసిన డ్వాక్రా సంఘాల మహిళలతో జిల్లా సమాఖ్యలుగా రిజిస్టర్ చేయించి వారికి మూడు నెలల శిక్షణ ఇప్పిస్తోంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేస్తోంది. దాదాపు 1200 ఉత్పత్తులను ఫొటోషూట్ కూడా పూర్తయింది. వీటికి బ్రాండ్ నేమ్‌లు తగిలించి విక్రయానికి సిద్ధం చేస్తోంది. ఉత్పత్తుల డిజైన్, మార్కెటింగ్ అంశాలపై అధికార యంత్రాంగం విస్తృత సమాలోచనలు జరుపుతోంది. దీంతోపాటు ఈ ఉత్పత్తుల విక్రయానికి స్నాప్ డీల్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. వన్‌గ్రామ్ గోల్డ్ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన మచిలీపట్నం నుంచి ఆభరణాలు, కొండపల్లి బొమ్మలు, కలంకారీ ఉత్పత్తులు, పశ్చిమ గోదావరిలో డిజైన్లకు పేరున్న లేస్ ఉత్పత్తులను విజయవాడ స్టాక్ పాయింట్ ద్వారా విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా మండపేట చేనేత వస్త్రాలు, విజయనగరం జిల్లా బొబ్బిలి వీణ, విశాఖపట్నం ఏటికొప్పాక బొమ్మలు, అరకు వెదురు ఉత్పత్తులు, శ్రీకాకుళం జూట్ ప్రాడక్ట్‌లను విశాఖ స్టాక్ పాయింట్ ద్వారా అమ్మకానికి పెడతారు. ఉత్పత్తులను కూడా ఈ స్టాక్ పాయింట్లకు తరలించి, ఆన్‌లైన్ మార్కెటింగ్‌తో లాభాలు వచ్చేలా ప్రభుత్వం పథకాలు రూపొందిస్తోంది. ఇందుకోసం అవసరమైన డిజైన్, మార్కెటింగ్ నైపుణ్యాల కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, నిఫ్ట్, టూరిజం, పలు మేనేజ్‌మెంట్ సంస్థలతో పాటు గూగుల్, టాటా సంస్థలతో కూడా సంప్రదింపులు జరుపుతోంది. దేశవ్యాప్తంగా ప్రారంభంలో కోటి రూపాయల ఖరీదైన 1200 ఉత్పత్తులను అమ్మకానికి పెట్టాలని భావిస్తున్న ప్రభుత్వం వచ్చే మూడేళ్లకాలంలో ఉత్పత్తుల సంఖ్యను 15వేలకు పెంచి ఆదాయాన్ని కూడా భారీగా పొందాలని చూస్తోంది.