లక్షా 26 వేల ఉద్యోగాలు... 10 లక్షల 73 వేల దరఖాస్తులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

లక్షా 26 వేల ఉద్యోగాలు... 10 లక్షల 73 వేల దరఖాస్తులు

విజయవాడ, ఆగస్టు 6, (way2newstv.com)
ఏపీ ప్రభుత్వం భర్తీ చేయనున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయి.  అప్లికేషన్ల సంఖ్య 10 లక్షలు దాటింది. ఇప్పటి వరకు 10లక్షల 73వేల 532 మంది దరఖాస్తు చేసుకున్నారు. సాధారణ పనిదినాల్లో రోజుకు అందే దరఖాస్తుల సంఖ్య లక్ష దాటుతోందని.. ఈ పరిస్థితి బట్టి చూస్తే గడువు ముగిసే సమయానికి దరఖాస్తుల సంఖ్య 20 లక్షలు దాటిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.రికార్డు స్థాయిలో 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి చేయనున్నారు. రాతపరీక్ష ద్వారా వీటిని ఫిలప్ చేస్తారు. ఈ ఉద్యోగాలకు జూలై 27 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆగస్టు 10 అర్ధరాత్రి వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. కర్నూలు, అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల నుంచి లక్షకు పైగా దరఖాస్తులు అందాయని.. నెల్లూరు, విజయనగరం జిల్లాల నుంచి తక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు.  
లక్షా 26 వేల ఉద్యోగాలు... 10 లక్షల 73 వేల దరఖాస్తులు

అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునేందుకు పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. దరఖాస్తు, రాతపరీక్షపై అభ్యర్థులకు వచ్చే సందేహాలు నివృత్తి కోసం పంచాయతీరాజ్‌ శాఖ 5 మొబైల్‌ నెంబర్లతో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకు 20 మందిని కేటాయించింది. పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ విజయకుమార్‌లు సైతం వ్యక్తిగతంగా సోషల్ మీడియా ద్వారా ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు. పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఆఫీసుల్లో సందేహాల నివృత్తికి అదనంగా ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేశారు.  సచివాలయం ఉద్యోగాలకు ఏపీ నుంచే కాదు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడం విశేషం. జిల్లాల వారీగా భర్తీచేసే మొత్తం ఉద్యోగాల్లో 80 శాతం స్థానికులకు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. మిగిలిన 20 శాతం ఉద్యోగాలకు ఆ జిల్లాలోని స్థానికులతో పాటు ఇతర జిల్లాల వారూ, ఇతర రాష్ట్రాల వారు కూడా ఓపెన్‌ కేటగిరిలో పోటీపడే అవకాశం ఉంది. ఆదివారం నాటికి 2వేల 332 మంది ఇతర రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకున్నట్లు గోపాలకృష్ణ ద్వివేది ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రాతపరీక్ష తేదీల్లో మార్పులు, చేర్పులపై ఆగస్టు 6న ఓ ప్రకటన చేయనున్నట్లు ద్వివేది తెలిపారు. మొత్తం 19 రకాల ఉద్యోగాలను 4 రకాలుగా వర్గీకరించి.. వాటికి సెప్టెంబర్ 1, 8 తేదీలలో ఉదయం, సాయంత్రం వేర్వేరుగా రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఉద్యోగాల వర్గీకరణలో కేటగిరి-2లో పేర్కొన్న గ్రూపు-ఏ, గ్రూపు-బీలో 4 రకాల ఉద్యోగాలకు సెప్టెంబర్ 1 సాయంత్రం రాతపరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షకు సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు అర్హత ఉండడంతో ఆయా పరీక్షలను ఒకే సమయంలో కాకుండా వేర్వేరుగా నిర్వహించాలని వారి నుంచి పెద్ద సంఖ్యలో వినతులు వచ్చాయి. దీంతో పూర్తిస్థాయి రాతపరీక్ష షెడ్యూల్‌పై 6న స్పష్టత ఇవ్వనున్నారు.వార్డు సచివాలయాల్లో దాదాపు అన్ని పోస్టులకు డిగ్రీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్‌ డిప్లొమాను విద్యార్హతగా నిర్ణయించారు. వార్డు పరిపాలన కార్యదర్శి (డిగ్రీ), మౌలిక వసతుల కార్యదర్శి (పాటిటెక్నిక్, సివిల్‌ ఇంజినీరింగ్‌), పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శి (డిగ్రీతో సైన్స్‌/ఇంజినీరింగ్‌), విద్యా కార్యదర్శి (డిగ్రీ), ప్రణాళిక కార్యదర్శి (డిప్లొమో అర్బన్‌ ప్లానింగ్‌/ సివిల్‌ ఇంజినీరింగ్‌), సంక్షేమ కార్యదర్శి (డిగ్రీతో సామాజిక సేవ/సోషియాలజీ/ఆంత్రోపాలజీ), ఇంధన కార్యదర్శి (ఎలక్ట్రికల్స్‌లో డిప్లొమో), ఆరోగ్య కార్యదర్శి (నర్సింగ్‌/ఫార్మా-డీ), రెవెన్యూ కార్యదర్శి (డిగ్రీ), మహిళా కార్యదర్శి (డిగ్రీ) పోస్టులను మంజూరు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలంటే జిల్లా స్థాయిలో పోలీస్‌.. టీచర్‌ తప్ప మరే మాట వినిపించని పరిస్థితి. అది కూడా ఏ మూడేళ్లకో.. అయిదేళ్లకో నోటిఫికేషన్లు ఇచ్చేవ పరిస్థితి. కానీ ఏపీలో కొత్తగా ఏర్పడ్డ జగన్ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగుల కోసం వార్డు సచివాలయాలను తీసుకొచ్చింది