మూడు వేల సీట్లలో 500 సీట్లు మిగిలిపోయాయ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మూడు వేల సీట్లలో 500 సీట్లు మిగిలిపోయాయ్

ఒంగోలు, ఆగస్టు 3, (way2newstv.com)
2019-20 విద్యా సంవత్సరం ప్రారంభమై 50 రోజులు కావస్తున్నా కార్పొరేట్‌ కళాశాల స్కీమ్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఈ పథకం కింద కేటాయించిన సీట్లు నేటికీ భర్తీ కాలేదు. దాదాపు 473 సీట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆయా జిల్లాల సంక్షేమ శాఖల డిడిలు వీటికి ధృవీకరించి, ఆమోదం తెలపాల్సి ఉన్నా ఈ నాటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. వీటిల్లో సాంఘిక సంక్షేమ శాఖ కింద 235 సీట్లు, బిసి సంక్షేమ శాఖ కింద 78, గిరిజన సంక్షేమ శాఖ కింద 123, మైనారిటీల సంక్షేమ శాఖ కింద 14, ఇబిసిలకు సంబంధించిన 23 సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. ఈ పథకం కింద ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు మానసిక ఆందోళనలకు గురవుతున్నారు. తమకు సీటు వస్తుందో లేదో అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. అధికారుల జాప్యం వల్ల వేరే కళాశాలలో ప్రవేశాలు పొందే అవకాశం కోల్పేయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 మూడు వేల సీట్లలో 500 సీట్లు మిగిలిపోయాయ్

త్వరగా సీట్ల భర్తీ పూర్తి చేస్తే సీట్లు రాని వారు వేరే కళాశాలల్లో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. కార్పొరేట్‌ కాలేజ్‌ ఎడ్యుకేషన్‌ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, ఇబిసిలకు ప్రముఖ కార్పొరేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ రెండేళ్ల పాటు ఉచితంగా చదువుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. అందుకు కావలసిన ఫీజును ప్రభుత్వమే భరిస్తుంది. గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ విద్యా సంవత్సరం కూడా అన్ని సంక్షేమ శాఖల ద్వారా మొత్తం 3238 సీట్లు భర్తీ కోసం కేటాయించాల్సి ఉంది. వీటిల్లో సాంఘిక సంక్షేమ శాఖ కింద 1542, గిరిజన సంక్షేమ శాఖ కింద 604, బిసి సంక్షేమ శాఖ కింద 738, మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా 183, ఇబిసిలకు 171 సీట్లు ఉన్నాయి. కానీ వీటిల్లో ఎస్సీలకు 1493 సీట్లు, బిసిలకు 687, ఎస్టీలకు 561, మైనారిటీలకు 167, ఇబిసిలకు 137 సీట్లు అంటే కేవలం 3045 సీట్లు మాత్రమే భర్తీ చేయాలని నిర్ణయించారు. వీటిల్లో ఇప్పటి వరకు 2572 సీట్లకు మాత్రమే జిల్లా అధికారులు ధృవీకరిస్తూ ప్రవేశాలు కల్పించారు. కార్పొరేట్‌ కళాశాల విద్య అనేది పూర్తిగా రెసిడెన్షియల్‌ విధానంలోనే అమలు చేస్తున్నారు. ఒక్కో విద్యార్థికి ఆర్టీఎఫ్‌ కింద రూ. 35 వేలతో పాటు ఎంటిఎఫ్‌ కింద ఏడాదికి రూ. 3వేలు చెల్లిస్తున్నారు. అయితే ప్రభుత్వం చెల్లించే దాని కంటే టూషన్‌ ఫీజు కింద అదనంగా ఒక్కో విద్యార్థి నుంచి రూ. 15 వేల వరకు వసూలు చేస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు.