747 శాతం వృద్ధి రేటుతో వైజాగ్ కార్గో - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

747 శాతం వృద్ధి రేటుతో వైజాగ్ కార్గో

విశాఖపట్టణం, ఆగస్టు 6 (way2newstv.com)
ఒకప్పుడు ప్రయాణీకుల రాకపోకలకే ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్న విశాఖ విమానాశ్రయం ఇప్పుడు సరకు రవాణాలో సైతం అగ్రగామిగా నిలుస్తోంది. ప్రయాణికులను చేరవేసేందుకు పూర్వం కేవలం రోజుకు రెండు, మూడు విమానాలు మాత్రమే నడిచేవి. ఇప్పుడు దేశంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి విశాఖకు రోజుకు 72 సర్వీసులకు పైగా విమానాలు నడుస్తున్నాయి. తాజాగా గగనతల సరకు రవాణాలో విశాఖ విమానాశ్రయం గణనీయమైన వృద్ధి సాధిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. అంతర్జాతీయ సరకు రవాణాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 747 శాతం వృద్ధి రేటు నమోదు చేసుకుంది. విశాఖ విమానాశ్రయం నుంచి సరకు రవాణా ప్రారంభించిన తొలి ఏడాదిలోనే అరుదైన ప్రగతి సాధించడం హర్షణీయం. తొలి త్రైమాసికంలో 133 టన్నుల సరకు రవాణాతో ఈ వృద్ధి నమోదైంది. 
747 శాతం వృద్ధి రేటుతో వైజాగ్ కార్గో

విదేశాల నుంచి 49.29 టన్నుల సరకు దిగుమతి చేసుకోగా, విశాఖ నుంచి 83.74 టన్నుల సరకు ఎగుమతి చేశారు. అంతకు ముందు ఏడాది 296.86 టన్నుల సరకు రవాణా చేయగా, 142.21 టన్నుల దిగుమతి, 144.65 టన్నుల దిగుమతిగా నమోదైంది. ఇక దేశీయంగా చూస్తే ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 1481 టన్నుల సరకు రవాణా సాధించి 15.43 శాతం వృద్ధి రేటు నమోదు చేసుకుంది. దీనిలో 557 టన్నులు దిగుమతి, 924 టన్నుల ఎగుమతిగా నమోదైంది. అతకు ముందు ఏడాది తొలి త్రైమాసికంలో 1283 టన్నులు కాగా, 516 టన్నుల దిగుమతి, 767 టన్నుల ఎగుమతిగా ఉంది. విశాఖ విమానాశ్రయం నుంచి సరకు రవాణా వృద్ధి సాధనలో పలు అంశాలు కీలకంగా పేర్కొనవచ్చు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయర్ కార్గో టెర్నినల్ ఏర్పాటు, దేశీయ కార్గో టెర్మినల్ విస్తరణ, తాజా సరుకుల నిల్వకు అవసరమైన స్టోరేజ్ ఏర్పాటు, కస్టమ్స్ పరిశీలన సరళతరం వంటి అంశాలు సరకు రవాణా వృద్ధికి దోహదం చేశాయి. అలాగే విశాఖ నుంచి ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులకు సంబందించి విమానాశ్రయంలోనే డ్రగ్ కంట్రోల్ అధికారి నియామకం, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు పరిశీలనకు యానిమల్ క్వారంటైన్ అధికారి నియామకం వంటి కీలక నిర్ణయాలు సానుకూలపరిచాయి.విశాఖ కేంద్రంగా బ్రాండెక్స్ పరిశ్రమకు అవసరమైన ముడి సరుకు దిగుమతి, ఇక్కడ రూపుదిద్దుకున్న దుస్తుల ఎగుమతి కూడా విశాఖ ఎగుమతుల్లో కీలకంగానే చెప్పాలి. రాష్ట్ర వృద్ధి రేటులో కీలకపాత్ర పోషిస్తున్న సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి సేవల్లో కూడా గణనీయమైన ప్రగతి చోటుచేసుకుంది. భవిష్యత్‌లో విశాఖ కేంద్రంగా సరకు రవాణాలో మరింత వృద్ధి రేటు నమోదు చేసేందుకు సేవల విస్తరణ అవసరమని ఎగుమతి దారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఉష్ణోగ్రతలను నియంత్రణలో ఉంచే సాధనాలు అందుబాటులో ఉంచడంతో పాటు నాణ్యతతో కూడిన ప్యాకేజీ, అత్యాధునిక గూడ్స్ స్కానింగ్ ఎక్స్‌రే పరికరాలు అవసరమని అభిప్రాయపడ్డారు