వరంగల్, ఆగస్టు 9, (way2newstv.com)
తెలంగాణ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న హరిత హౌటళ్లు నష్టాలను చవిచూస్తున్నాయనే సాకుతో ప్రయివేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై బాగా నడిచే హౌటళ్లను కమీషన్లకోసం కక్కుర్తిపడి కావాలనే నష్టాలబాట పట్టిస్తూ, దశల వారీగా ప్రయివేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పరిధిలో రాష్ట్రం మొత్తంలో 55 హరిత హౌటళ్లకు గాను ఇప్పటివరకు 21 హౌటళ్లను ప్రయివేటుకు కట్టబెట్టారు. మరిన్ని హౌటళ్లను ప్రయివేటు పరం చేసేందుకు కార్పోరషన్ అధికారులు పావులు కదుపుతున్నారు. ములుగు జిల్లా జంగాలపల్లిలో ఉన్న హరిత హౌటల్‌ను గత సంవత్సరం కార్పొరేషన్ నడిపింది. రోజుకు రూ.2వేల నుంచి రూ.3వేలు కూడా కలెక్షన్ రాలేదు. వివిధ రకాల ఒత్తిడి నేపధ్యంలో కార్పొరేషన్ అధికారులు లక్ష రూపాయల లీజు ప్రాతిపదికన అధికార పార్టీ సూచించిన ఓ కాంట్రాక్టర్‌కు ఇచ్చింది.
నష్టాల్లో హరిత హోటల్స్
ప్రస్తుతం ఈ హౌటల్ రోజు రూ. 50వేల నుంచి రూ. లక్షవరకు వసూలు చేస్తున్నది. టూరిజం కార్పొరేషన్ నడిపినప్పుడు నడవని హౌెటళ్లు ప్రయివేటు వ్యక్తులకు ఎలా కాసులు కురిపిస్తున్నాయని ప్రశ్నిస్తే మైనమే సమాధానం.ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రం వేరుపడ్డాక 2014 జూన్ 24న టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్‌ను నెలకొల్పింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి సంక్రమించిన ఆస్తులు మినహా ఐదేండ్లుగా కార్పొరేషన్‌లో అభివృద్ధి జరిగింది లేదు. పర్యాటక ప్రాంతాలలో టూరిస్టుల బస కోసం ఏర్పాటు చేసిన హరితహౌటళ్లు తెలంగాణ ఏర్పడ్డ తరువాత దివాలా తీస్తున్నాయనే నెపంతో ప్రయివేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో కార్పోరేషన్ అధికారులు ఆడిందే ఆటగా సాగుతున్నది. ఐదేండ్లుగా దశల వారీగా హౌటళ్లను ప్రయివేటుకు కట్టబెడుతున్నారు. 55 హరిత హౌటళ్లు ఉండగా 21 హౌటళ్లు ఐదేండ్ల నుంచి పదేండ్ల లీజుకు ఇచ్చేశారు. సికింద్రాబాద్‌లోని యాత్రినివాస్, గండిపేటలోని హరితారిసార్ట్ లాంటి ఫైవ్‌స్టార్ హౌటళ్లు నిర్మాణం, నిర్వహణ, బదలాయింపు (బీవోటీ) ప్రాతిపదికన 33 సంవత్సరాల దీర్ఘకాల లీజులో నడుస్తున్నాయి. యాత్రికులు అత్యధికంగా వచ్చే హైదరాబాద్ జిల్లాలో 7, రంగారెడ్డి 2, సిద్దిపేట 2, సంగారెడ్డి 2, ములుగు జిల్లాలో ఒక హౌటల్‌ను ప్రయివేటు వ్యక్తులకు లీజు ప్రాతిపాదికన అప్పగించారు. ఆయా జిల్లాలలో ప్రయివేటు ప్రయివేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న హౌటళ్లు భారీ లాభాల్లో ఉండగా, సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హౌటళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. వీటి లాభ నష్టాల వివరాలు తెలిపేందుకు అధికారులు నిరాకరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఐదేండ్ల వరకు హైదరాబాద్ నడి బొడ్డున బేగంపేటలో ఉన్న ప్లాజా హౌటల్‌ను కత్రియా గ్రూప్ నిర్వహించింది. మూడేండ్లపాటు అద్దె చెల్లించలేదు, ఖాళీచేయలేదు. 2015లో ప్లాజా హౌటల్‌ను కత్రియా గ్రూప్ ఖాళీ చేసే నాటికి రూ. 5కోట్లకు పైగా బకాయి ఉంది. ఇంత పెద్దమొత్తం బకాయి అయ్యేవరకు అధికారులు ఎందుకు మౌనం వహించారనే ప్రశ్నకు సమాధానం లేదు. అద్దె బకాయిలకోసం కోర్టులు, లాయర్ల ఫీజులు అంటూ కార్పొరేషన్ లక్షలు వెచ్చిస్తూనే ఉంది. అయినా ఇప్పటి వరకు బకాయి వసూలు కాలేదు. ఇలాంటి అనేక సంఘటనలు అక్రమాలు హరిత హౌటళ్ల లీజులో చోటుచేసుకున్నందునే అధికారులు సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని తెలుస్తున్నది.కార్పొరేషన్ నిర్వహణ లోపంతోనే హరిత హౌటళ్లు నష్టాలను చవిచూస్తున్నాయి. హౌటల్ నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. హోటల్ మేనేజ్‌మెంట్ చేసిన వ్యక్తులను కాకుండా కార్పొరేషన్ అధికారులు ఇష్టారీతిన సిబ్బందిని నియమించడం జరిగింది. ఎలాంటి అనుభవం అర్హత లేక పోవడంతో వారు హౌటళ్ల నిర్వహణ చేయలేక పోతున్నారు వీటికి తోడు సరైన సౌకర్యాలు కల్పించక పోవడం, టూరిస్టుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో క్రమంగా హరిత హౌటళ్లు ఆదరణ కోల్పోయి దివాలా తీస్తున్నాయి. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కావాలని నష్టాల అంచులకు తీసుకెళ్లి తరువాత వాటిని ప్రయివేటు వ్యక్తులకు కట్ట బెట్టేందుకే అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 21 హౌటళ్లు నష్టాలను మూటగట్టుకొని ప్రయివేటు పరం కాగా, మరో 10కి పైగా హౌటళ్లు నష్టాల అంచున ఉన్నాయి. రేపో మాపో వీటిని ప్రయివేటు పరం చేసేందుకు కార్పొరషన్ అధికారుల వ్యూహంగా ఉన్నట్టు సమాచారం
Tags:
telangananews