ఒక మంచి మిత్రుడిని కోల్పోయా: ప్రధాని మోదీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఒక మంచి మిత్రుడిని కోల్పోయా: ప్రధాని మోదీ

దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం
న్యూ డిల్లీ ఆగష్టు 24 (way2newstv.com)
కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక మంచి మిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా జైట్లీతో తనకు పరిచయం ఉండటాన్ని గౌరవంగా భావిస్తానని చెప్పారు. సమస్యలపై ఆయనకు ఉన్న దూరదృష్టి, వివిధ అంశాలపై ఆయనకు ఉన్న పట్టు అమోఘమని కొనియాడారు. విలువలతో కూడిన జీవితాన్ని గడిపారని, ఎన్నో మధుర స్మృతులను మిగిల్చి, వెళ్లిపోయారని అన్నారు. 'వీ మిస్ హిమ్' అని ట్వీట్ చేశారు.బీజేపీ-అరుణ్ జైట్లీలది విడదీయలేని అనుబంధమని మోదీ చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం విద్యార్థి నాయకుడిగా జైట్లీ పోరాడారని అన్నారు. 
ఒక మంచి మిత్రుడిని కోల్పోయా: ప్రధాని మోదీ

బీజేపీలో అందరి అభిమానాన్ని చూరగొన్న గొప్ప నేత అని కితాబిచ్చారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో శాఖలకు మంత్రిగా పని చేశారని... దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు తన వంతు కృషి చేశారని చెప్పారు. విదేశాలతో వాణిజ్య సంబంధాలను మెరుగు పరచడం, రక్షణరంగాన్ని బలోపేతం చేయడం, ప్రజానుకూలమైన చట్టాలను తయారు చేయడంలో జైట్లీ సేవలందించారని తెలిపారు.ఎంతో హాస్య చతురత, ఛరిష్మా కలిగిన వ్యక్తి జైట్లీ అని మోదీ అన్నారు. భారత రాజ్యాంగం, చరిత్ర, పబ్లిక్ పాలసీ, పాలనలో అమోఘమైన జ్ఞానం ఆయన సొంతమని చెప్పారు. భారత్ కు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. జైట్లీ మన మధ్య లేని లోటు పూడ్చలేనిదని చెప్పారు. జైట్లీ భార్య సంగీత, కుమారుడు రోహన్ తో మాట్లాడానని... సానుభూతిని తెలియజేశానని అన్నారు. జైట్లీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.