కర్నూలు, ఆగస్టు 3, (way2newstv.com)
కర్నూలు జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వర్షాకాలంలోనూ గుక్కెడు నీటి కోసం ప్రజలు విలవిలలాడుతున్నారు. వర్షాకాలం మొదలై రెండు నెలలు దాటినా వర్షాభావ పరిస్థితులతో నీటి వనరులన్నీ వట్టిపోయి భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోజూ వదలాల్సిన తాగునీరు రోజు విడిచి రోజుకు పరిమితమైంది. కొన్ని ప్రాంతాలలో వారం, పది రోజులకోసారి వదులుతున్న పరిస్థితి ఉంది. తీవ్ర తాగునీటి సమస్యకు తక్షణం ఊరట కలిగేలా శ్రీశైలంలోకి భారీగా వెళ్తున్న వరద నీటిని తీసుకోకపోవడం ఆందోళన కలిగించే అంశం. శ్రీశైలంలో 810 అడుగుల పైబడి నీళ్లు వస్తే ముచ్చుమర్రి నుంచి జిల్లా అవసరాల కోసం నీటిని తీసుకోవచ్చు.
కర్నూలులో నీటి ఎద్దడి
ముచ్చుమర్రి వద్ద ఉండే ఎత్తిపోతల పథకాల ద్వారా హంద్రీ నీవాలోకి, కెసి కెనాల్‌లోకి నీటిని వదిలితే జిల్లాలో తాగునీటి సమస్యకు తక్షణ పరిష్కారం దొరుకుతుంది. శ్రీశైలంలోకి గురువారం ఉదయానికే 810 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. 810 అడుగులకు చేరుకోగానే పొరుగునున్న తెలంగాణా ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 1600 క్యూసెక్కులను తీసుకుంది. సాయంత్రానికి పూర్తిస్థాయిలో 2,400 క్యూసెక్కులు తీసుకుని వారి అవసరాల కోసం మళ్లించుకుంది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం నుంచి ఒక్క చుక్క నీటిని తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. హంద్రీ నీవాలోకి నీటిని వదిలితే నందికొట్కూరు, కల్లూరు, క్రిష్ణగిరి, వెల్దుర్తి, పత్తికొండ మండలాలలో తక్షణం తాగునీటి సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది. అలాగే హంద్రినీవా నుంచి గాజులదిన్నె ప్రాజెక్టులోకి వదలడం ద్వారా కర్నూలు నగర తాగునీటి సమస్యతో పాటు డోన్, గూడూరు మున్సిపాలిటీలలోనూ తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం శ్రీశైలంలో నీటి మట్టం 825 అడుగులకు చేరుకుని, 43 టిఎంసిల నీరు అందుబాటులో ఉంది. జిల్లా అధికారులు ముచ్చుమర్రి ద్వారా నీటిని తీసుకోకపోవడం ద్వారా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుండి కెసి కెనాల్‌లోకి, హంద్రినీవాలోకి నీటిని మళ్లించి జిల్లా తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Tags:
Andrapradeshnews