నల్గొండ, ఆగస్టు 17, (way2newstv.com)
కోమటిరెడ్డి బ్రదర్స్...తెలంగాణ కాంగ్రెస్‌లో డైనమిక్ లీడర్లుగా పేరొందిన నాయకులు. సందర్భం ఏదైనా తమ గళాన్ని, అభిప్రాయాన్ని బలంగా వినిపించడంలో దిట్ట. ఈ సోదరుల్లో చిన్నవాడైన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొద్దికాలంగా అన్న వెంకటరెడ్డి కంటే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. రాజగోపాల్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరతారని వార్తలు రావడం, దీనికి ఆయన చేసిన కామెంట్లే కారణం కావడం కూడా విదితమే. అయితే, ఈ కామెంట్లను ఓ సందర్భంలో ఖండించారు. ఓసారి తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని.. మరోసారి బీజేపీ అనుకూలంగా కోమటిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఆయన నియోజకవర్గ కాంగ్రెస్ క్యాడర్‌ను ఆయోమయంలోకి నెడుతుండగా...తాజాగా ఆయన మళ్లీ బీజేపీకి మద్దతుగా మాట్లాడారు! ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై ప్రశంసల వర్షం కురిపించారు.
డోలాయమానంలో కోమటిరెడ్డి
కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి ఉపసంహరణ విషయంలో....ప్రశంసలు కురిపించారు. ఆర్టికల్ 370, 35ఏ తొలగింపు అంశంపై మోడీ తీసుకున్న నిర్ణయాన్ని దేశ ప్రజలందరూ హర్షిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. అమెరికా, చైనా తర్వాత భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి మోడీయే కారణమని ఆయన ప్రశంసించారు. మోడీ, షా నేతృత్వంలో భారత్ అభివృద్ధిపథంలో దూసుకెళ్తోందని, దేశ ప్రజలంతా మోడీ వైపే చూస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ప్రశంసించారు.బీజేపీలో చేరతారన్న వార్తలపై స్పందన కోరగా రాజగోపాల్ రెడ్డి మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. పార్టీ మార్పు పై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర్ రెడ్డి పేరు నిలబడేలా జగన్ పాలన ఉండాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆకాంక్షించారు. ఇంతకీ కోమటిరెడ్డి పార్టీ మారనున్నారా? మారడం లేదా అనే విషయంలో...కార్యకర్తలకే కాకుండా కోమటిరెడ్డికి సైతం పెద్ద గందరగోళం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.
Tags:
telangananews