కవితకు కేబినెట్ ర్యాంక్

హైద్రాబాద్, ఆగస్టు 29, (way2newstv.com)
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై రాజకీయవర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ను మళ్లీ కేబినెట్‌లోకి తీసుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. పలువురు నేతల మాటలను బట్టి చూస్తే కేబినెట్‌లోకి కేటీఆర్ ఎంట్రీ దాదాపు ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే కేటీఆర్ తెలంగాణ మంత్రివర్గంలోకి వస్తే... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఎవరికి దక్కుతుందనే అంశంపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. 
కవితకు కేబినెట్ ర్యాంక్

అయితే కేటీఆర్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం వల్ల ఖాళీ అయ్యే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎవరికి ఇవ్వాలనే అంశంపై కేసీఆర్ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారని... తన కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎంపీ కవితను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించే యోచనలో కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది. రెండోసారి నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన ఓటమిపాలైన కవిత... కొంతకాలంగా రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె పొలిటికల్ రీ-ఎంట్రీ ఎప్పుడు ఇవ్వనుంది ? రీ-ఎంట్రీ తరువాత టీఆర్ఎస్‌లో ఆమె పాత్ర ఏ రకంగా ఉండబోతోందనే అంశంపై చాలాకాలంగా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీలో కవితకు కీలకమైన పదవి ఇస్తేనే ఆమె స్థాయికి తగ్గట్టుగా ఉంటుందని భావిస్తున్న కేసీఆర్... కేటీఆర్ స్థానంలో ఆమెను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎఫెక్ట్ కవితపై ఉండొచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. 
Previous Post Next Post