కలెక్టర్లు స్థానంలో జిల్లా పరిపాలనా అధికారులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కలెక్టర్లు స్థానంలో జిల్లా పరిపాలనా అధికారులు

మార్పు దిశగా కేసీఆర్ ఆలోచన 
హైద్రాబాద్,  ఆగస్టు 21(way2newstv.com
జిల్లా ప్రధాన అధికారి అయిన కలెక్టర్ పదవికి సంబంధించి సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్రిటిష్ పాలనలో పన్నుల వసూళ్ల కోసం పెట్టిన కలెక్టర్ పేరు మార్చి, కొత్త పేరును సూచిస్తామని నిర్వహించిన సమావేశంలో సీఎం ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రసుత్తం కలెక్టర్లు పన్నులు వసూళ్లు చేయడం లేదు కాబట్టి ఇంకా అదే పేరు కొనసాగించడం సరికాదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరుసగా రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్‌లో తొలిసారి జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. సీఎంతోపాటు, ప్రభుత్వ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ జోషీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
లెక్టర్లు స్థానంలో జిల్లా పరిపాలనా అధికారులు

ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సుదీర్ఘంగా కొనసాగిన సమావేశంలో కీలక అంశాలపై కలెక్టర్లకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రస్తావించిన గ్రామ పంచాయతీల 60 రోజుల కార్యాచరణ ప్రణాళికపై సీఎం కేసీఆర్ సమావేశంలో ప్రారంభ ఉపన్యాసం చేసినట్లు సమాచారం. తొలి విడత సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి సంబంధించి కీలక అంశాలపై కలెక్టర్లతో చర్చించి, పంచాయతీ రాజ్ చట్టం, నూతన మున్సిపల్ చట్టాల లక్ష్యాల గురించి కలెక్టర్లకు వివరించినట్లు తెలుస్తోంది. హరితహారం, స్వచ్ఛత మిషన్ ద్వారా పట్టణాలు, గ్రామాలను ఎలా సుందరీకరణ చేయవచ్చో అధికారుల నుంచి కేసీఆర్ అభిప్రాయాలు తీసుకున్నారని తెలుస్తోంది. పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటించాలని, దీనికోసం కలెక్టర్‌‌‌‌ అధ్యక్షతన జిల్లా స్థాయిలో గ్రీన్‌‌‌‌ కమిటీలను నియమిస్తామని కేసీఆర్ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీఎం కేసీఆర్ కలెక్టర్‌లతో కీలకంగా చర్చించినట్లు తెలియ వచ్చింది. లంచాలు లేనిదే రెవెన్యూ కార్యాలయాల్లో పనులు కావడం లేదని తన దృష్టికి వచ్చిందని ముఖ్యమంత్రి కలెక్టర్లతో చెప్పినట్లు తెలుస్తోంది. కింది స్థాయి అధికారులు, ఉద్యోగులు ప్రజల్ని లంచాల కోసం పీడిస్తున్నారనీ, రెవెన్యూలో అవినీతిని రూపుమాపడానికి పూర్తి ప్రక్షాళన చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. లంచాల వ్యవస్థకు చరమగీతం పాడేందుకు కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందిస్తామని కలెక్టర్లతో పేర్కొన్నట్లు తెలుస్తోంది. గాంధీ జయంతి నుంచి రెవెన్యూ చట్టాన్ని అమలు చేస్తామని కేసీఆర్ కలెక్టర్లకు తెలిపినట్లు సమాచారం. అయితే, కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం బుధవారం కూడా కొనసాగనుంది.