దోమలు బాబోయ్.. (నిజామాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దోమలు బాబోయ్.. (నిజామాబాద్)

నిజామాబాద్, ఆగస్టు 21 (way2newstv.com): 
దోమల విజృంభణతో జిల్లాను జ్వరాలు వణికిస్తున్నాయి. ఏ ఆసుపత్రిలో చూసినా చిన్నా పెద్దా తేడా లేకుండా రోగులు కిక్కిరిసి కనిపిస్తున్నారు. మొదట జలుబుతో ప్రారంభమై తర్వాత తీవ్రమైన ఒళ్లు నొప్పులతో అతలాకుతలం చేస్తున్నాయి. ఇంట్లో ఒకరికి వస్తే చాలు ఇంటిల్లి పాదికి సోకుతున్నాయి. వారం రోజుల్లో విషజ్వరాల తీవ్రత పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. డెంగీ, మలేరియా కేసుల సంఖ్య భారీగానే పెరుగుతోంది. జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో వారం రోజుల నుంచి జ్వరాలతో బాధ పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. పురుషులు, మహిళలు, పిల్లలు కలిపి 737 మంది ఆసుపత్రిలో చేరారు. 7,075 ఓపీ నమోదైంది. వీరిలో ఎక్కువ సంఖ్యలో జ్వరంతో బాధపడేవారే ఉన్నారు. 
దోమలు బాబోయ్.. (నిజామాబాద్)

ఈ సంఖ్య కేవలం జిల్లా దవాఖానా లెక్కల ప్రకారమే.. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య వేలల్లో ఉంటోంది.జిల్లాలో ఈ సంవత్సరంలో 47 డెంగీ కేసులు నమోదయ్యాయి. వీటిలో జులైలో 15, ఈ నెలలో 13 రోజుల్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారిన పడుతున్న వారిలో 8 నుంచి 18 ఏళ్ల లోపు ఉన్నవారే ఎక్కువ. ఈ మధ్యకాలంలో విషజ్వరాల సంఖ్య పెరగడంతో డెంగీ అనుమానంతో ఇప్పటికే 250-300 మంది రక్తపరీక్షలను జిల్లా ఆసుపత్రికి పంపించారు. కొద్దిపాటి జ్వరం వచ్చినా ప్లేట్‌లెట్లు వేగంగా పడిపోతుండటంతో డెంగీ వ్యాధిగా అనుమానించి పరీక్షలకు పంపిస్తున్నారు. జిల్లా కేంద్రంలో అనుకున్న స్థాయిలో ప్లేట్‌లెట్లు దొరకకపోవడంతో ప్రాణభయంతో హైదరాబాద్‌కు పరుగులు తీస్తున్నారు. జిల్లాలో 10 మలేరియా కేసులు సైతం నమోదయ్యాయి.  జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో ఎక్కడికక్కడ నీరు నిలిచి దోమలు విపరీతంగా పెరిగాయి. దోమల నివారణపై అధికారులు కనీస చర్యలు తీసుకోక పోవడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. గుంతలు, ఖాళీస్థలాల్లో వర్షం నీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఆయిల్‌ బాల్స్‌ వేయాల్సి ఉన్నా నగర పాలక సంస్థ, మున్సిపాలిటీలు, గ్రామస్థాయిలో సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. ఆగస్టు, సెప్టెంబరులో డెంగీ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదయ్యే అవకాశం ఉందని వైద్యఆరోగ్యశాఖ అధికారులే చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దోమల నివారణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.