బీజేపీలోకి ఏడు జిల్లాల టీటీడీపీ నేతలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బీజేపీలోకి ఏడు జిల్లాల టీటీడీపీ నేతలు

హైద్రాబాద్, ఆగస్టు 12, (way2newstv.com)
ఆపరేషన్ కమలం పేరిట ఇతర పార్టీల నాయకులని చేర్చుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న బీజేపీ మరో భారీ స్కెచ్ వేసింది. ఇప్పటికే ఏపీలో పలువురు టీడీపీ నేతలనీ పార్టీలో చేర్చుకున్న బీజేపీ, తెలంగాణలో కూడా కొందరు టీఆర్ఎస్, టీడీపీ,కాంగ్రెస్ నేతలని లాగేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే తెలంగాణలో అలా అలా ఉన్న టీడీపీని విలీనం చేసుకునే దిశగా అడుగులేస్తోందని తెలుస్తోంది. ఇప్పటివరకు చట్టసభల్లో మాత్రమే ఉన్న విలీన ప్రక్రియని రాజకీయాల్లో కూడా తీసుకోచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఇటీవల టీడీపీకి చెందిన రాజ్యసభపక్షాన్ని విలీనం చేసుకున్న బీజేపీ, తాజాగా గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకుంది.
 బీజేపీలోకి ఏడు జిల్లాల టీటీడీపీ నేతలు

తెలంగాణలో కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ శాసనసభ సభ్యులని విలీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ తరహాలోనే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని తమ పార్టీలో విలీనం చేసేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేసింది. అందులో భాగంగా పలు జిల్లాల నాయకులని, పార్టీ కార్యవర్గ నేతలని పార్టీలో చేర్చుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన చాలామంది నేతలు టీఆర్ఎస్ లో చేరిపోగా, కొందరు కాంగ్రెస్ లో చేరారు. ఇక ఏది ఏమైనా టీడీపీలో ఉంటామని చెప్పిన నేతలతో సహ మిగిలిన నేతలని తీసేసుకోవాలని అనుకుంటోంది. మొన్న బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుల్లో తెలంగాణ నేత, టీడీపీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు లేరు.అప్పట్లో ఆరోగ్యం బాగోలేక ఆయ‌న పార్టీ కండువా క‌ప్పుకోలేద‌న్న ప్రచారం జ‌రిగింది. అయితే తన వర్గంతో కలసి.. బీజేపీలో కండువా కప్పుకుంటానని అప్పట్లో గరికపాటి అమిత్ షాకు చెప్పినట్లు సమాచారం. దీంతో ఈనెల 18న అమిత్ షా సమక్షమంలో గరికపాటి బీజేపీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.గరికిపాటి తనతో పాటు ఓ 20 మంది నేతలని బీజేపీలో చేరుస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే గరికిపాటి టీటీడీపీ జిల్లాలకు చెందిన తెలుగుదేశం కార్యవర్గాలను బీజేపీలో విలీనం చేస్తానని బీజేపీ అగ్రనేతలకు చెప్పినట్లు సమాచారం. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం, మెదక్ , రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల కార్యవర్గాలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఇంతలా నాయకులు పార్టీ మారతారని తెలుస్తున్న తెలంగాణ టీడీపీ అధిష్టానం ఏ మాత్రం స్పందించడంలేదు. ఎల్ రమణ దీనిపై నోరు మెదపడం లేదు. ఎప్పటికప్పుడు అధినేతని కలుస్తున్న రమణ పార్టీని బలోపేతం చేస్తామనే చెబుతున్నారు తప్ప. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడటం లేదు. మొత్తానికి అధిష్టానం పట్టించుకోపోవడం, బీజేపీ ఆకర్షించడంతో తమ భవిష్యత్ కోసం చాలామంది నేతలు టీడీపీని వీడటం ఖాయమే అని తెలుస్తోంది. టోట‌ల్‌గా తెలంగాణ‌లో టీడీపీ అనే ప‌దం కూడా వినిపించ‌కుండా చేయ‌డ‌మే బీజేపీ స్కెచ్‌గా తెలుస్తోంది.