ఎట్టకేలకు గిరిజన వైద్య కళాశాల - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎట్టకేలకు గిరిజన వైద్య కళాశాల

విశాఖపట్టణం, ఆగస్టు 17, (way2newstv.com)
విశాఖ ఏజెన్సీలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ గిరిజన వైద్య కళాశాల ఎట్టకేలకు మంజూరైంది. ఎన్నికల హామీ మేరకు పాడేరులో వైద్యకళాశాలను మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి 89 జిఒను విడుదల చేశారు. ఏజెన్సీలో వైద్యసేవలు మెరుగుపర్చేందుకు మెడికల్‌ కాలేజీ, వ్యాధులను గుర్తించి చికిత్స అందించేందుకు రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలన్న గిరిజన, ప్రజాసంఘాల దీర్ఘకాలిక డిమాండ్‌ చాలాకాలానికి నెరవేరింది. 2019-20 బడ్జెట్‌లో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు రూ.66 కోట్లను ప్రభుత్వం కేటా యించింది. పాడేరులో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు సరిపడు స్థలం పాలిటెక్నిక్‌ కాలేజీకి ఆనుకునిఉన్న 25 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం బోధనాస్పత్రిని నెలకొల్పాలంటే 650 పడకల సామర్థ్యం కల్గిన ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి. 
ఎట్టకేలకు గిరిజన వైద్య కళాశాల 

బోధనాసుపత్రి, మెడికల్‌ కాలేజీ, నివాస గృహాలు, రూరల్‌హెల్త్‌ సెంటర్‌, సెంట్రల్‌ వర్క్‌షాప్‌, పార్కింగ్‌ షెడ్స్‌, పేషెంట్‌ అటెండెన్స్‌ షెడ్స్‌, స్పోర్ట్సు కాంప్లెక్స్‌ వంటి నిర్మాణాలు పూర్తి చేసేందుకు రూ.440 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎపిఎంఎస్‌ఐడిసి) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆసుపత్రి ఏర్పాటుకు రూ.66 కోట్లు బడ్జెట్లో కేటాయించినప్పటికీ, నిర్మాణ పనులు ప్రారంభించేందుకు పరిపాలనామోదం ప్రభుత్వం ఇవ్వలేదు. 2019-20లో ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభించి, 2021-22 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నిర్మాణ పనులన్నీ పూర్తిచేసి 2021-22లో 150 మెడికల్‌ సీట్ల ప్రవేశాలకు కేంద్రం నుంచి అనుమతి పొందా లని యోచిస్తోంది. పూర్తిస్థాయిలో ఆసుపత్రిని ప్రారంభించేందుకు అయ్యే రూ.440 కోట్ల వ్యయంలో నిర్మాణ పనులకు రూ.380 కోట్లు, వైద్యపరికరాల ఏర్పాటుకు రూ.60 కోట్లు అవసర ముంటుందని ఎపిఎంఎస్‌ఐడిసి అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 2019-20 బడ్జెట్లో కేటాయించిన రూ.66 కోట్లతో భవన నిర్మాణాలు పూర్తి చేసిన తరువాత కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు చేయాల్సి ఉంది. బోధనా సుపత్రి స్థాయికి తగినట్లు భవనాలు, పరిసరాలున్నాయని సంతృప్తి చెందాక కేంద్రం అనుమతులు మంజూరు చేయనుంది. ఈ అనుమతులకు ఇబ్బందుల్లేకుండా పనులు చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2020-21లో రూ.250 కోట్లు, 2021-22లో రూ.124 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రతిపాదిత అంచనా ప్రకారం ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించి విడుదల చేస్తే నిర్ధేశించిన 2021-22 నాటికి బోధనాస్పత్రి పూర్తి స్థాయిలో పనిచేయనుందని వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. 650 పడకల సామర్థ్యం కల్గిన వైఎస్‌ఆర్‌ గిరిజన వైద్య కళాశాలకు ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు కలిపి 200 మందిని ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంది. బోధనాస్పత్రిలో వైద్య నిపుణులు, వైద్యులు అందుబాటులో ఉండడంతో గిరిజనులకు నిరంతరం వైద్యసేవలు లభించనున్నాయి. వివిధ వ్యాధుల, నివారణకు తీసుకోవాల్సిన చికిత్సపై పరిశోధన కూడా జరగనుంది. 2021-22 నుంచి ప్రతీయేటా 150 మెడికల్‌ సీట్లకు ప్రవేశాలు జరగనున్నాయి. ఏజెన్సీలో మాతా శిశుమరణాలు తగ్గించేందుకు ఇప్పటికే పాడేరులో ఉన్న ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా 200 పడకలకు అప్‌గ్రేడ్‌ చేసి అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఆసుపత్రిలో కొంతకాలం సేవలందించి, బోధనాస్పత్రి పూర్తయిన తరువాత అక్కడ వైద్య సేవలందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వం మెడికల్‌ కాలేజీ మంజూ రుతో పాటు నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేసేందుకు సరిపడు నిధులు విడుదల చేసి మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తీసుకురావాలని గిరిజనులు కోరుతున్నారు.