వరంగల్, ఆగస్టు 12, (way2newstv.com)
ముహూర్తపు బలంలో పిల్లలు పుడితే ప్రయోజకులు అవుతారనే అప నమ్మకం ప్రజలను మరీ బలహీనులనుగా మారుస్తోంది. ఈ బలహీనత కారణంగా ఆపరేషన్లు చేయించి మంచి రోజుల్లో ప్రసవాలు జరిగేలా చూస్తున్నారు. పూర్వ కాలంలో ఒక్కో ఇంట్లో డజను మంది సంతానం ఉండేవారు. ఆ నాడు ఏ ఆసుపత్రి లేదు… అంతా ఇళ్ల వద్దే సాధారణ ప్రసవాలు జరిగేవి. ఇప్పుడు కేవలం ఒక్క పురుడుకే కోత ప్రసవం తప్పడం లేదు. అందునా ఎక్కువ శాతం మంది శుభ ఘడియల్లో ఆపరేషన్లు చేయించి బిడ్డలను తల్లి కడుపులో నుంచి బయటకు తీస్తున్నట్లు తెలియవస్తోంది. గర్భం దాల్చిన తొలినాళ్ల నుంచి వైద్యులను సంప్రదించడం పరిపాటిగా మారింది. గర్భిణీలను పరీక్షించిన వైద్యులు ఎల్‌ఎంపి తేదిని తెలుసుకుని ప్రసవించే రోజులను లెక్కలు కట్టి చెబుతుంటారు.
శుభఘడియల్లో సిజేరియన్లు
చెప్పిన ప్రసవపు లెక్కలు ప్రకారం రెండు రోజులు అటూఇటూ పురుడు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా పురిటి నొప్పులు ప్రారంభమైన తర్వాతా 24 గంటల లోపు ప్రసవం జరిగిపోతుంది. కానీ ప్రస్తుతం అధికంగా నొప్పులు వచ్చేందుకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్ ఇస్తున్నారు. దీని ద్వారా తక్కువ సమయంలో నొప్పులు అధికమై ప్రసవం జరిగిపోతుంది. ఇంత వరకు బాగానే ఉన్నా మహిళ ప్రసవించే రోజు మంచిదైతే పర్వాలేదు. ఆ రోజు మూఢం. దుర్మూహుర్తం, అమావాస్య వంటి చెడు ఘడియలు ఉంటే ఆ సమయాల్లో పిల్లలు పుట్టకుండా జాగ్రత్తలు పడతారు. వీలైతే వైద్యులు ఇచ్చిన తేదికి ముందుగానే శుభ ఘడియల్లో ఆపరేషన్లు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ ప్రసవాలను సైతం కోత ప్రసవాలుగా ఆస్పత్రులు కాసుల కోసం మారుస్తున్నట్లు తెలుస్తోంది. గర్భిణీలు, వారి బంధువుల భయాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వైద్యులు ప్రసవపు తేదీ కంటే ముందే ఆస్పత్రుల్లో చేరమని, తమ పర్యవేక్షణలో ఉండాలని చెబుతున్నారు. తీరా ప్రసవించే తేదీ దగ్గరకు రాగానే సాధారణ ప్రసవం అయ్యేలా లేదు, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిందే అని నమ్మబలుకుతున్నట్లు పలువురు అంటున్నారు. ఇలా చేయకుంటే తల్లీ, బిడ్డలకు ప్రమాదమని భయపెట్టిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రాణాల మీదికి తెచ్చుకోవడం దేనికని వైద్యుల సలహా పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ చేయడం ద్వారా సుమారు పది రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంటుంది. డిశ్చార్జీ అయ్యే సమయానికి సుమారు రూ.20 నుంచి రూ.25 వేల వరకు బిల్లు చేతిలో పెడుతున్నట్లు తెలుస్తోంది. కాసుల కక్కుర్తి కోసం సాధారణ ప్రసవాలను సైతం ఆపరేషన్లుగా మారుస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.కార్పోరేట్ స్థాయి ఆస్పత్రులంటూ నెలకొల్పి ప్రజలను జలగల్లా పీడిస్తున్నప్పటికీ పర్యవేక్షణ కొరవడింది. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఓ మహిళ డజన్ మంది పిల్లలను సైతం సాధారణ ప్రసవం ద్వారానే కనేది. ఇప్పుడు ఒక్క ప్రసవానికే కత్తి గాటు తప్పడం లేదని తాతమ్మలు చెప్పుకుంటునన్నారు ఇప్పటికైనా ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే తతంగాలపై కన్నేయాలని కోరుతున్నారు. ఆపరేషన్ల ద్వారా పిల్లలను కన్నవారిని దీర్ఘకాలిక వ్యాధులు వెంటాడుతున్నాయి. ఆపరేషన్ సమయంలో వెన్నుకు తిమ్మిరి ఇంజక్షన్ ఇవ్వడం, వేసిన కుట్లు మానేందుకు యాంటీబయాటిక్ మందులు వాడుతుండటంతో మహిళలను పలు ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 30 ఏళ్లకే మహిళల్లో నడుము నొప్పి ప్రారంభమై పెద్ద ఎత్తున బాధిస్తోంది. మరో పక్క నిత్యం ఓవర్ హీట్, ఆ తర్వాత ఊబకాయం వంటివి వెంటాడుతున్నాయి. అంతేకాకుండా పాల ఉత్పత్రి కూడా తగ్గిపోతోంది.దీంతో పిల్లలకు పోత పాలే గతవుతున్నాయి. తద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందకుండా పోతోంది. తొలి కాన్పు ఆపరేషన్ ద్వారా జరిగితే, రెండో కాన్పుకు అదే పరిస్థితి. ఆపరేషన్ చేయించుకున్న వారు మూడేళ్ల వరకు గర్భందాల్చ రాదు. కానీ ఏడాదికే మరో బిడ్డకు జన్మనిస్తున్నారు. దీంతో రెండేళ్లలోపే మరోసారి కోతకు గురి కావాల్సి వస్తోంది. ఇలా ప్రతీసారి గర్భసంచిని చీల్చడంతో మహిళలకు రుతుక్రమంలో కూడా భారీతేడాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొంత కాలానికి గర్భసంచినే తొలగించే పరిస్థితి తలెత్తుతోంది. అరోగ్య సమస్య తల్లులనే కాదు పిల్లలను సైతం వెంటాడుతోంది. ఆపరేషన్ల ద్వారా బయటకు తీసిన పిల్లలకు కామెర్ల వంటివి సోకుతున్నాయి. దీంతో పిల్లలను ఇంకిబ్యూటర్‌లోని లైట్ల వెలుతురులో పెట్టాల్సి వస్తోంది. తద్వారా ప్రసవం అనంతరం అందే ముర్రు పాలు కూడా పిల్లలకు అందని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు కూడా అనారోగ్యాల బారిన పడుతున్నారు.
Tags:
telangananews