ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించనున్న అమరావతి – అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి ప్రణాళికలు శరవేగంగా సిద్ధమవుతున్నాయి. ఇటీవల సీఎం వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పనుల కోసం రూ.100 కోట్లను బడ్జెట్‌లో కేటాయించడంతో ఒక్కసారిగా పనుల్లో కదలిక వచ్చింది. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు దశల వారీగా సమీక్ష సమావేశాలు, హైవే నిర్మాణంలో అనుమానాలపై నివృత్తి చేస్తూ జంక్షన్ బాక్స్‌ల వివరాలు తెలియజేశారు. దీంతో ఇకపై నిర్మాణం శరవేగంగా జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. నిర్మాణం పూర్తయితే రవాణా సౌకర్యాల్లో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయంగా కనిపిస్తోంది. . ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రెండో సంతకమే అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడంతో విషయం తెరమీదికి వచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా హైవే నిర్మాణంపై చర్చ జరుగుతోంది.
అనంతపురం, అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే.. పరుగులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అనంతపురం నుంచి తాడిపత్రి మీదుగా నంద్యాల, గిద్దలూరును కలుపుకుంటూ గుంటూరు వరకు రహదారిని రూ.25వేల కోట్లతో 557కిలో మీటర్ల మేర అధునాతన సాంకేతికతో ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం పేరిట గతంలో ఒప్పందాలు జరిగాయి. 2015 నుంచి నిర్మాణానికి అంచనాలు రూపొందించారు. అయితే, ఎన్‌హెచ్‌ఏఐకి రోడ్డు నిర్మాణ పనులు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కేంద్రం ఆధ్వర్యంలోని సంస్థలు పనులు చేపట్టేందుకు మార్గం సుగమం అయింది. నిర్మాణాన్ని కేంద్రం చేపట్టినట్లయితే వివాదాలు లేకుండా రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని పలువురు భావిస్తున్నారు. అయితే, కొంతకాలంగా స్తబ్ధతగా ఉన్న ఈ హైవే ప్రస్తావన తెరపైకి రావడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సుదీర్ఘమైన అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంలో మూడు చోట్ల జంక్షన్ బాక్స్‌లు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే, గతంలో జంక్షన్ బాక్స్‌లకు 250 ఎకరాలకు పైగా భూములు సేకరించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రభుత్వం ప్రస్తుతం ఎనిమిది లైన్ల రహదారిని నాలుగు లైన్లకు కుదించింది. దీంతో పాటు నూజెండ్ల జంక్షన్ బాక్స్‌కు 158.67 ఎకరాలు, కావూరు 130 ఎకరాలు, మేడికొండూరు 128 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వంలో వందలాది ఎకరాల సేకరణకు స్వస్తి పలుకుతూ 150 ఎకరాల లోపే జంక్షన్ బాక్స్‌లు కుదించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tags:
Andrapradeshnews