విశాఖలో తమ్ముళ్ల ఇంటిపోరు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విశాఖలో తమ్ముళ్ల ఇంటిపోరు

విశాఖపట్టణం, ఆగస్టు 27, (way2newstv.com)
శాఖ జిల్లాలో టీడీపీ పరిస్థితి ఎలా ఉంది అంటే కుదేలైపోయి బేజారెత్తిన చందంగా ఉందని చెప్పాలి. విశాఖ అర్బన్ జిల్లాలో పేరుకు నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు కానీ నలుగురి గ్రూప్ ఫోటో ఎపుడూ కనిపించదు. అసలు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీలో ఉన్నారా లేరా అంటే టీడీపీ పెద్దలెవరూ సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. మరో వైపు విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తీరు చూస్తే వేరుగా ఉంటుంది. ఆయనవన్నీ సొంత పోరాటాలే. సొంత అజెండా ఆయనది. అర్బన్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిని ఆయన అసలు గౌరవించరు, మాజీ ఎమ్మెల్యే ఎస్ఎ రహమాన్ ప్రెసిడెంట్ గా ఉన్న టీడీపీ ఆఫీస్ కి తాను రానంటే రానని తెగేసి చెప్పిన తెలుగు తమ్ముడు ఆయన. 
విశాఖలో తమ్ముళ్ల ఇంటిపోరు

అటువంటి టీడీపీ నేతలు వైసీపీ మీద గట్టి పోరాటం చేస్తానంటూ బీరాలు పలుకుతున్నారు.విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ మీటింగ్ పెడితే కనీసం ఉన్న ఎమ్మెల్యేలు నలుగురు హాజరు కాని పరిస్థితి ఉంది. గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ కుమార్ షరా మామూలుగానే డుమ్మా కొట్టారు. మిగిలిన వారిలో కూడా సీనియర్ నాయకులు ఎవరూ హాజరుకాలేదు. ఈ నేపధ్యంలో వైసీపీ ఆగడాలు పెరిగిపోతున్నాయని చెబుతున్న తమ్ముళ్ళు అడ్డుకుంటామని పోరాడుతామని ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారు. విశాఖలో టీడీపీ నేతలే టార్గెట్ గా వైసీపీ అక్రమ భవనాల పేరిట కూలగొడుతోందని కూడా విమర్శిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పీలా సత్యనారాయణ బిల్డింగ్ కూలగొట్టిన జీవీఎంసీ అధికారులు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భవనాన్ని కూల్చేందుకు రెడీ అయ్యారని, ఇలా వూరుకుంటే మొత్తం టీడీపీ నేతల‌ భవనాలను కూల్చేస్తారని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇక టీడీపీ ఆఫీస్ మీద కూడా వైసీపీ సర్కార్ కన్ను పడిందని, దాన్ని కూడా కూలగొట్టకుండా ఇప్పటి నుంచే పోరాటం చేయాలని నిర్ణయించారు.విశాఖ జిల్లాలో టీడీపీ నాయకుల పోకడలు చూసిన తమ్ముళ్ళు పూర్తిగా నిరాశకు గురి అవుతున్నారు. అండగా ఉండాల్సిన నాయకులు, పదవులు అనుభవించిన వారు సైతం ఇపుడు ఇల్లు దాటి బయటకు రావడం లేదని అంటున్నారు. మరో వైపు వైసీపీ నేతల దూకుడు ఎక్కువగా ఉండడంతో తృతీయ శ్రేణి, ద్వితీయ శ్రేణి నేతలు పార్టీని వీడిపోతున్నారు. ఎన్నికల ముందు టీడీపీలో చేరిన విశాఖ ఉత్తర నియోజకవర్గం నేతలు ఇపుడు వైసీపీలోకి వచ్చేశారు. వారితో పాటు ఏళ్లకు ఏళ్ళు టీడీపీలో పనిచేస్తున్న వారు సైతం వైసీపీలో చేరిపోతున్నా అపలేని దుస్థితిలో పసుపు శిబిరం ఉంది. రూరల్ జిల్లాలోనూ పెద్ద ఎత్తున టీడీపీ నేతలు వైసీపీలో చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో పార్టీని రక్షించుకుందామని తూతూ మంత్రంగా ఒక సమావేశం నిర్వహించి టీడీపీ పెద్ద తలకాయలు తప్పుకుంటే స్థానిక ఎన్నికల నాటికి పార్టీ ఉనికే ప్రశ్నార్ధకం అవుతుందని అంటున్నారు. ముందు నాయకులంతా మేము ఒకటి అన్నట్లుగా గ్రూప్ ఫొటో ఇవ్వడమే కాకుండా జనంలోకి రావాలని, అపుడే క్యాడర్ కి దైర్యం వస్తుందని అంటున్నారు. అంతే తప్ప మీడియా బేబీల్లా మారితే మాత్రం ఉపయోగం లేదని గట్టిగా చెప్పేస్తున్నారు