యదేఛ్చగా పందులు, స్వైర విహారం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

యదేఛ్చగా పందులు, స్వైర విహారం

విజయనగరం, ఆగస్టు 28, (way2newstv.com)
విజయనగరంలో ప్రస్తుతం 40 వార్డులు ఉన్నాయి. 1888లో ఏర్పడిన ఈ మున్సిపాల్టీ ప్రస్తుతం సెలక్షన్‌ గ్రేడ్‌లో ఉంది. సుమారు 70వేల కుటుంబాలు, 3లక్షల జనాభా ఉంది. సరైన రహదారులు, రోడ్లు వంటి కనీస, మౌలిక సదుపాయాలు లేక ప్రజలు అవస్థలు ఉపడుతున్నారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ కూడా బాగోలేకపోవడంతో చిన్నపాటి వర్షం కురిసినా పలు ప్రాంతాలు జలమయమౌతున్నాయి. పట్టణంలో ట్రాఫిక్‌ కూడా పద్మవ్యూహంగా మారింది. అనేక కాలనీలు కనీస సదుపాయాలకు కూడా నోచుకోలేదు. వీటిపై పాలకుల పనితీరును కాస్త పక్కనబెడితే అధికారులు కూడా పెద్దగా స్పందించలేదు. ముఖ్యంగా గతంలో పనిచేసిన కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ విజయనగరం పట్టణంపై కనీసం శ్రద్ధచూపలేదు. 
యదేఛ్చగా పందులు, స్వైర విహారం

సమస్యలు ఆయన దృష్టికి వెళ్లిన అనేక సందర్భాల్లో లోకల్‌ బాడీలో అంతగా తలదూర్చాల్సిన అవసరం లేదంటూ తప్పించుకునేవారు. ఇటువంటి పరిస్థితుల్లో పట్టణాభివృద్ధి పనులపై ప్రస్తుత కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ప్రధాన రహదారుల వెడల్పు, పార్కులు, కాలువల నిర్మాణంతోపాటు చరిత్రకు సాక్షాలుగా నిలిచే కోట, సాహిత్యం కేంద్రంగా విరజిల్లుతున్న గురజాడ స్వగృహం ఆధునీకరించేందుకు పూనుకోవడం పట్ల హర్షం వ్యక్తమౌతోంది. సుమారు నాలుగేళ్లగా నిర్మాణానికి నోచుకోని శిల్పారామం వచ్చే ఏడాది జనవరి 26లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం పట్ల కళాకారులు, కళాప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా కలెక్టర్‌ పట్టణంలో వార్డు పర్యటనలు చేస్తున్నారు. దీంతో, ఇటు మున్సిపల్‌ అధికార యంత్రాంగమూ అప్రమత్తమౌతోంది. చిట్టడవిని తలపించే పెద్దచెరువు గట్టు నందనవనంలా మారింది. పలు పార్కులు, క్రీడామైదానాల్లో చేపట్టిన పనులు కూడా వేగవంతమౌతున్నాయి. అయితే ఇదంతా పట్టణాభివృద్ధిలో ఒక భాగమే. పట్టణంలో సుమారు 88 మురికివాడలు ఉన్నాయి. పట్టణ జనాభాలో సుమారు 40శాతం అంటే దాదాపు 1.20లక్షల జనాభా మురికివాడల్లోనే ఉన్నారు. వీరంతా కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు. వీటిలో అత్యధికంగా పూరిగుడెసెలు, రేకిళ్లు, రోడ్లు లేవు, రహదారులు కానరావు. రామకృష్ణానగర్‌, ఎల్‌బిజి నగర్‌ తదితర కాలనీలు సుమారు 10నుంచి 15ఏళ్ల క్రితం ఏర్పడ్డాయి. వీరికి పట్టాలు మంజూరు చేయలేదు. విద్యుత్‌ సదుపాయం లేక నేటికీ కిరోసిన్‌ దీపాలతోనే కాలం గడపాల్సిన దుస్థితి దాపురిస్తోంది. విద్యుత్‌ సదుపాయం విషయమై గతంలో కలెక్టర్లుగా పనిచేసిన ఎంఎం నాయక్‌, వివేక్‌యాదవ్‌లను రామకృష్ణానగర్‌ వాసులు ఎన్నోసార్లు కలిసనప్పటికీ పట్టించుకోలేదు.   ఓవైపు రెండు లైన్ల భారీ రహదారులు, స్టార్‌ హోటళ్లు. పెద్దపెద్ద భవంతులు, పేలస్‌లు, భారీ ఫంక్షన్‌ హాళ్లు...  మరోవైపు ఇరుకు సందులు, పూరిగుడిసెలు, వర్షపునీటితో దోమలకు ఆవాస కేంద్రాలుగా మారిన గతుకులు. గతుకులమయమైన రోడ్లు, నిత్యం కాలుష్యంతో నిండే వ్యర్థాలు. పందుల స్వైర విహారం. ఆరు బయట మలవిసర్జన వెరసి... విజయనగరం పట్టణం రెండు పార్శ్యాలుగా కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో పట్టణాభివృద్ధికి కలెక్టర్‌ హరిజవహర్‌ చూపుతున్న శ్రద్ధ గర్హనీయం. ఈ కార్యక్రమంలో మురికివాడలను విస్మరిస్తే కలెక్టర్‌ ఆశిస్తున్న లక్ష్యం ప్రశ్నార్థకంగా మారుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇళ్లు, వీధులే ఇంత ఇరుకుగా ఉంటే ఇక వ్యక్తిగత మరుదొడ్ల ఏర్పాటు సంగతి వేరేగా చెప్పనక్కర్లేదు. దీంతో, వారంతా అనివార్యంగా బహిరంగ మలవిసర్జన చేయాల్సివస్తోంది. సామాజిక భవనాలు కూడా తగినన్ని లేకపోవడంతో సామాన్యులు శుభకార్యాలు కూడా ఆరుబయట ఇరుకు సందుల్లో పెట్టుకోవాల్సిన దుస్థితి దాపురిస్తోంది. రూ.100కోట్లతో పట్టణంలో అనేక సదుపాయాలు మొరుగుపర్చుతున్న నేపథ్యంలో మురికివాడలపై దృష్టిసారించకపోతే చెత్తచెదారం, కాలుష్యం, బహిరంగ మలవిసర్జన యథాతధంగా కొనసాగక తప్పదని, కలెక్టర్‌ ఆశిస్తున్న లక్ష్యం కూడా నెరవేరే పరిస్థితి లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.