కేశినేని పార్టీకి దూరమైనట్టేనా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కేశినేని పార్టీకి దూరమైనట్టేనా

విజయవాడ, ఆగస్టు 16, (way2newstv.com)
ఇటీవ‌ల కాలంలో టీడీపీలో రాజ‌కీయ ర‌గ‌డ‌కు కేంద్ర బిందువుగా ఉన్న విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఉర‌ఫ్ నానిని పార్టీ అదినేత చంద్రబాబునాయుడు ఎట్టకేల‌కు ప‌క్కన పెట్టేశారా? పైకి ఎలాంటి ప్రక‌ట‌నా జారీ చేయ‌క‌పోయినా.. ఇక‌, ఈ త‌ల‌నొప్పి ఎందుకులే అనుకున్నారా? ఈ క్రమంలోనే కీల‌క నిర్ణయాలు తీసుకుని వ‌డివ‌డిగా అడుగులు వేసేశారా? అంటే.. తాజాగా జ‌రిగిన ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. ఈ ఏడాది ఏప్రిల్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. జ‌గ‌న్ సునామీ ముందు అతిర‌థ‌మ‌హార‌థులే చతికిల‌ప‌డ్డారు. అయితే, విజ‌య‌వాడ నుంచి ఎంపీగా రెండో సారి పోటీ చేసిన కేశినేని నాని.. అతి క‌ష్టంమీద విజ‌యం సాధించారు. 
కేశినేని పార్టీకి దూరమైనట్టేనా

అయితే, ఈ విజ‌యం త‌ర్వాత కేశినేని నాని వైఖ‌రిలో పూర్తి మార్పు వ‌చ్చింద‌ని టీడీపీనేతలు అంటున్నారు. కానీ, పార్టీ వైఖ‌రే త‌న‌కు న‌చ్చడం లేద‌ని త‌న ఫేస్‌బుక్ పోస్టుల ద్వారా చెప్పక‌నే చెబుతున్నారు కేశినేని నాని. పార్టీలో గెలిచిన నాయ‌కుల కంటే కూడా ఓడిన నేత‌ల‌కే చంద్రబాబు ప్రాధాన్యం, ప‌ద‌వులు కూడా క‌ట్టబెడుతున్నారంటూ.. ఎన్నిక‌లు పూర్తయి, రిజ‌ల్ట్ వ‌చ్చిన అతి త‌క్కువ స‌మ‌యంలోనే కేశినేని నాని వ్యాఖ్యానించారు. మీడియా ముఖంగా కాకుండా సోష‌ల్ మీడియాలో రెచ్చిపోయారు. అదే స‌మ‌యంలో పార్టీలో కీల‌క నేత‌లుగా ముఖ్యంగా కృష్ణాజిల్లా, విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో ప్రముఖంగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్నల‌పై కూడా కేశినేని నాని కామెంట్లతో విరుచుకుప‌డ్డారు. సైకిల్ బెల్లుల దొంగ‌లు అంటూ.. తీవ్ర ప‌ద‌జాలం వినియోగించారు.అప్పటికీ చంద్రబాబు చూసీ చూడ‌న‌ట్టు ఉన్నారు. అయితే, ఆయ‌న బీజేపీకి ద‌గ్గర‌వుతున్నార‌నే వ్యాఖ్యలు రోజు రోజుకు బ‌ల‌ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇంకా ఉపేక్షించ‌డం మంచిది కాదంటూ.. నేరుగా దేవినేని ఉమ‌, బుద్దాలే చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చిన‌ట్టు స‌మాచారం. ఈ క్రమంలోనే చంద్ర‌బాబు తాజాగా సంచ‌ల‌న నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వ‌ర‌కు గ‌డిచిన ఏడెనిమిదేళ్లుగా విజ‌య‌వాడలోని కేశినేని నాని భ‌వ‌న్లో కొన‌సాగిన అర్బన్ టీడీపీ ఆఫీసును న‌గ‌ర శివారు ప్రాంతం ఆటోన‌గ‌ర్‌లో ఉన్న జిల్లా టీడీపీ కార్యాల‌యానికి మార్చేశారు. ఫ‌ర్నిచ‌ర్‌ను కూడా తీసుకు వెళ్లారు. దీంతో ఒక్కసారిగా పార్టీలో చ‌ర్చనీయాంశ‌మైంది. న‌గ‌ర ప‌రిధిలో మ‌రో కార్యాల‌యం చూసుకునే వ‌ర‌కు ఆటోన‌గ‌ర్‌లోనే అర్బన్ పార్టీ కార్యక్రమాలు కూడా కొన‌సాగుతాయ‌ని బాబు మౌఖిక ఆదేశాలు చేశార‌ని స‌మాచారం.దీంతో ఇక‌, కేశినేని నాని ని బాబు వ‌దిలించుకునేందుకు రెడీ అయ్యార‌నే వార్తలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. మ‌రోప‌క్క, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా భావించిన మంగ‌ళ‌వారం నాటి పార్టీ స‌మావేశానికి కేశినేని నాని డుమ్మా కొట్టారు. త‌న కుమార్తె విదేశాల‌కు వెళ్తున్నందునే తాను కార్యక్రమానికి హాజ‌రుకాలేద‌ని ఆయ‌న చెప్పినా.. లోలోన మాత్రం బాబు నిర్ణయం, పార్టీలో త‌న‌కు హ‌వా త‌గ్గిపోతోంద‌నే ఆవేద‌న రెండు ఉన్నాయ‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఇక‌పై కేశినేని నాని పార్టీకి దూరం కాక త‌ప్పద‌ని అంటున్నారు. కేశినేని నాని టీడీపీ హౌస్ లో కొనసాగాలంటే ఆయన డిమాండ్లు నెరవేర్చక తప్పదు చంద్రబాబుకు. మరి ఏం జరుగుతుందో చూడాలి.