ముందుకు ‘సాగ‘ని పరిస్థితులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ముందుకు ‘సాగ‘ని పరిస్థితులు

విజయవాడ, ఆగస్టు 07, (way2newstv.com)
వర్షాభావ పరిస్థితులు, సాగునీటి ఎద్దడితో జిల్లాలో ‘ఖరీఫ్’ సాగు మందగించింది. కాలువల్లో నీటి మట్టాలు పూర్తిగా పడిపోవటంతో సాగు ప్రశ్నార్ధకంగా మారింది. మరీ ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో రైతాంగ పరిస్థితి కడు దుర్భరంగా మారింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం గత జూన్ నెలలోనే ముందస్తుగా పట్టిసీమ నుండి గోదావరి జలాలను విడుదల చేసింది. అదే సమయంలో వర్షాలు కూడా ఆశాజనకంగా ఉండటంతో రైతులంతా ముందస్తు సాగుకు ఉపక్రమించారు. జిల్లాలో 3.33 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేపట్టారు. ఇందులో ప్రధానంగా 2.32లక్షల హెక్టార్లలో వరి పంటను సాగు చేశారు. 
ముందుకు ‘సాగ‘ని పరిస్థితులు

అయితే గత రెండు మూడు వారాల నుండి వర్షాలతో పాటు కాలువల్లో నీటి మట్టాలు తగ్గిపోవటంతో రైతు దిక్కులేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ప్రభుత్వం, అధికారుల మాటలు విని ముందస్తుగా సాగు చేపట్టి నేడు పడరాని పాట్లు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. జిల్లాలో దాదాపు 50శాతం మేర వరి నాట్లు పూర్తయ్యాయి. 30 శాతం మేర వెద పద్ధతిన పంట సాగు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. నారుమడులు నెర్రలిచ్చి రైతు కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతాలైన కృత్తివెన్ను, బంటుమిల్లి, మచిలీపట్నం, నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, చల్లపల్లి ప్రాంతాల్లో సాగునీటి సమస్య మరింత జఠిలంగా మారింది. ఈ ప్రాంత రైతులు దాదాపు సాగుపై ఆశలు వదులుకున్నారు. సాగునీటి ఇబ్బందులను పసిగట్టిన ఎగువ ప్రాంత రైతాంగం కాలువ గట్లపై అనధికారికంగా ఇంజన్లు ఏర్పాటు చేసి ఉన్న కొద్దిపాటి నీటిని తమ పంట పొలాలకు మళ్లించేస్తున్నారు. లంక గ్రామాల్లో చేపల చెరువులకు సైతం సాగునీటిని మళ్లిస్తున్నారు. దీంతో దిగువ ప్రాంత రైతులకు ఎటూ పాలు పోని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే బంటుమిల్లి, కృత్తివెన్ను ప్రాంతాల్లో రైతాంగం సాగునీటి కోసం రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేశారు