దుర్గగుడిలో ఇంటి దొంగలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దుర్గగుడిలో ఇంటి దొంగలు

విజయవాడ, ఆగస్టు 10, (way2newstv.com)
ఇంద్రకీలాద్రి పై నకిలీ సర్టిఫికేట్లు రాజ్యమేలుతున్నాయి. దుర్గమ్మ చెంతన ఉద్యోగాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఉద్యోగంలో చేరేందుకు కొందరు, ప్రమోషన్ ల కోసం మరి కొందరు నకిలీ పత్రాలు వాడేస్తున్నారు. అర్హులను పక్కన పెట్టి అనర్హులను అందలం ఎక్కిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.  ఉన్నతాధికారుల ఉదాశీనతతో దేవస్థాన సిబ్బంది బరి తెగించేస్తున్నారు. ఉద్యోగుల నకిలీలల పై సాక్షాత్తూ ఆలయ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా అవన్నీ బుట్టదాఖలవుతున్నాయి. అధికారుల అండ దండలతో కొండపై అక్రమార్కుల మాయాజాలానికి అంతు లేకుండా పోతోంది.రాష్ట్రంలో రెండొ అతి పెద్ద ఆలయం గా ఉన్న విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. దుర్గమ్మ చెంత ఉద్యోగాల కోసం అడ్డ దారులు తొక్కేస్తున్నారు. 
దుర్గగుడిలో ఇంటి దొంగలు

ప్రమోషన్ ల కోసం నకిలీ విద్యార్హత సర్టిఫికేట్లు సమర్పించడం పరిపాటిగా మారింది. తాజాగా ఇద్దరు ఉద్యోగులకు సంబందించిన అర్హతా పత్రాలు నకిలీవనే వార్తలు కలకలం రేపుతున్నాయి. సాక్షాత్తూ అదే శాఖకు సంబందించిన సిబ్బందే నకిలీల పై ఆలయ ఈవో కు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తుల రాక ఎలా ఉంటుందో అక్కడ ఉద్యోగంలో చేరి అమ్మవారికి సేవలు చేయాలని కొందరు తహతహలాడుతారు. మరి కొందరైతే ఏదో ఒక అడ్డదారి వెతుక్కుని కొండ పైన పాగా వేసి ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతుంటారు. దుర్గమ్మ చెంత పని చేసే కొందరు సిబ్బంది మాత్రం స్వీపర్ స్థాయిలో ఉద్యొగంలోకి వచ్చి ఏకంగా ఉన్నతాధికారులుగా మారిపోయారు. ఆలయానికి సంబందించిన ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని తమ పబ్బం గడుపుకోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య.. అదే క్రమంలో దుర్గగుడికి సంబందించిన ఇద్దరు ఉద్యోగుల పై ఆరోపణలు గుప్పుమన్నాయి. దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమృతరావు అనే వ్యక్తి 1986 లో స్వీపర్ గా విధుల్లో చేరాడు. ఆపై వాచ్ మెన్, రికార్డు అసిస్టెంట్ , జూనియర్ అసిస్టెంట్ , సీనియర్ అసిస్టెంట్ అనే హోదాలు పెంచుకుని ప్రస్తుతం ఆలయ అన్నదాన విభాగంలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు.సూపరింటెండెంట్ నుంచి అసిస్టెంట్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రమోషన్ కావాలంటే డిగ్రీ తప్పనిసరి కావడంతో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీలో చేరాడు.ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రమోషన్ కోసం డిగ్రీ సర్టిఫికేట్ అవసరమైంది. డిగ్రీ ఉంటే ప్రమోషన్ ఇచ్చేస్తామని ఆలయ ఉన్నతాధికారి హామీ ఇవ్వడంతో జెట్ స్పీడ్ లో డిగ్రీ ప్రొవిజనల్ సమర్పించేశాడు. అడిగిన వెంటనే సర్టిఫికేట్ ఎలా వచ్చిందా అనే అనుమానాలు తలెత్తడంతో సహోద్యోగులకు దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి. ప్రొవిజనల్ తో పాటు మార్కుల లిస్టు అడగడంతో బండారం కాస్తా బయట పడింది. ఈ ఏడాది ఫిబ్రవరి ఆరవ తేదీన డిగ్రీఫలితాలు వస్తే 13 వతేదీన అమృతరావు ప్రొవిజనల్ సర్టిఫికేట్ తీసుకువచ్చి అధికారులకు ఇచ్చాడు. ఆసర్టిఫికేట్ లో రిజష్టర్ నంబరు ఆధారంగా ఆన్ లైన్ లో రిజల్ట్స్ ను చూడగా సోషియాలజీ సబ్జక్ట్ లో ఆనంబరు కనిపించక పోవడంతో  ఫెయిల్ అయినట్లు నిర్ధారణ అయింది. ఒక సబ్జెక్టు లో ఫెయిల్ అయితే కనీసం రీవాల్యూషన్ లో అయినా పాస్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి రిజల్ట్ లో నంబరు లేకుండా డిగ్రీ ప్రొవిజనల్ ఎలా వచ్చిందనే సందేహాలు ప్రతి ఒక్కరికీ కల్గుతున్నాయి. దానికి సంబందించిన మార్కుల లిస్టు మాత్రం జూన్ 19 వతేదీ న ఇష్యూ చేసినట్లు తీసుకొచ్చాడు.లక్ష్మణ్ అనే చిరుద్యోగిగా చేరి 1994 లో ఇంటర్ పూర్తి చేసినట్లు  సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. విజయవాడకు చేందిన లక్ష్మణ్ ఇంటర్ ఎక్కడ చదివాడో తెలిస్తే బిత్తర పోవాల్సిందే. ఏకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అఖిల్ భారతీయ శిక్షా పరిషత్ లో అతనికి ఇంటర్ పూర్తి అయినట్లు సర్టిఫికేట్ ఉంది. అయితే ఆ సంస్థకు సంబందించి వేలాది నకిలీ సర్టిఫికేట్లు, ఖాళీ పత్రాలు చెలామణిలో ఉన్నాయని ఇక నేషనల్ మీడియాలో కధనాలు రావఃడంతో పోలీసులు ఆసంస్థతో పాటు కొన్ని విద్యాలయాలు, విశ్వ విద్యాలయాలకు సంబందించి సర్టిఫికేట్లు దుర్వినియోగం అయ్యాయని దానికి కారకులైన వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. ఒక్కో సర్టిఫికేట్ 10 వేల నుంచి 50 వేల రూపాయలకు అమ్ముకున్నట్లు పోలీసులు విచరాణలో తేల్చారు.  ప్రస్తుతం అదే సంస్థ ఇంటర్ పాస్ సర్టిఫికేట్ తో దేవస్థానంలో కీలక విభాగమైన స్టోర్సులో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న లక్ష్మణ్ పైనా నీలి నీడలు కమ్ముకున్నాయి.  ఇదే విషయాన్ని కొందరు ఉద్యోగులు ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.  నకిలీ అర్హతా పత్రాలతో ఉద్యోగాలు చేస్తోన్న సిబ్బందికి ఉన్నతాధికారుల అండదండలు ఫుష్కలంగా ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. సర్టిఫికేట్ల పై ఉన్న అనుమానాలపై విచారణ జరపాలంటూ ఆలయ ఈవోకు , దేవాదాయ కమిషనర్ కు ముగ్గురు ఉద్యోగులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎందుకంటే చాలా కీలక మైన విభాగాలలో పనిచేసే సిబ్బంది కి విద్యార్హతలు కూడా ఎంతో ముఖ్యం కాబట్టి వాటి పట్ల అధికారులు కూడా ఉక్కుపాదం మోపాల్సి ఉంటుంది. అన్నిఅర్హతలున్న వారిని పక్కన పెట్టి అనర్హులను అందలం ఎక్కించే ప్రయత్నం జరుగుతోందని సిబ్బంది వాపోతున్నారు. అలయ  ఈవో తీరు సైతం పలు అనుమానాలకు తావిస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. మొత్తానికి నకిలీ పత్రాల విషయంలో ఉద్యోగులు ఫిర్యాదుతో నైనా  ఆలయ అధికారులు కళ్లు తెరవడం  లేదనే విమర్శలు గుప్పు మంటున్నాయి. మొత్తానికి ఇంద్ర కీలాద్రి పై నకిలీ సర్టిఫికేట్ ల భాగోతాలకు తెరపడాలని భక్తులు కోరుకుంటున్నారు.