విశాఖ నగరంలో చైన్ స్నాచర్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విశాఖ నగరంలో చైన్ స్నాచర్స్

విశాఖపట్టణం, ఆగస్టు 28, (way2newstv.com)
విశాఖ నగరంలో గొలుసుకట్టు ముఠాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అమాయకులే కాదు, అన్ని విషయాలపై పరిజ్ఞానం ఉన్నవారిని సైతం మోసం చేస్తున్నాయి. పోలీస్‌ స్టేషన్లలో నమోదవుతున్న కేసుల్లో అత్యధిక కేసులు, అందులోనూ అతి కీలకమైనవి డబ్బుతో ముడిపడివున్నవే. రూపాలు ఏవైనా ధనార్జనే ధ్యేయంగా ముఠాలు తెగబడుతున్నాయి. గడిచినవారం రోజుల్లో నగర పోలీసులు చేధించిన మూడు కేసులు ఇందుకు మచ్చుతునకగా చెప్పుకోవచ్చు. సులువుగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో ముఠాలు రెచ్చిపోతున్నాయి. తీగలాగితే డొంక కదిలినట్టుగా బాధితుల ఫిర్యాదుతో గుట్టురట్టవుతోంది. నమ్మకంగా ఉంటూ కామ పిచాచీగా మారి 14ఏళ్ల అమాయక బాలికపై అత్యాచారానికి పాల్పడిన సంఘటనలో నిందితుడి భార్య, అత్త, సోదరిడితో పాటు మరికొంత మంది కుటుంబ సభ్యులు సహకరించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. 
విశాఖ నగరంలో చైన్ స్నాచర్స్

చేసిన తప్పుపై నిలదీయాల్సిన భార్య, దండించాల్సిన అత్త కూడా అత్యాచారానికి సహకరించే పరిస్థితి వచ్చిందంటే ఈ సమాజం ఎటువైపు నడుస్తుందో అర్థం కాని దుస్థితి. చివరకు ఈ ఊబినుంచి బయటపడేందుకు తమ కుటుంబ సభ్యులను కూడా నిందితులుగా మార్చేశారు. గోపాలపట్నం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఈ గొలుసుకట్టు కేసు నమోదైన ఒక్కరోజు వ్యవధిలోనే దొంగనోట్ల ముఠాల గుట్టురట్టైంది. పాత కరెన్సీకి బదులు 15శాతం కొత్త కరెన్సీ ఇస్తామన్న ముఠా ఒకటైతే, పాత కరెన్సీ తీసుకున్నాక బ్యాక్‌మెయిల్‌ చేస్తున్న ముఠా మరొకటి. 14మంది, 13మంది చొప్పున రెండు ముఠాలను నగరపోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇందులో సులువుగా డబ్బ సంపాదించడమే లక్ష్యంగా వీరంతా ఒకరినొకరు మోసం చేసేందుకు తెగించారు. ఈ వ్యవహారంలో సుమారు రూ.2కోట్ల విలువగల నఖిలీ కరెన్సీ చేతులు మారింది. ఈ డబ్బు మార్కెట్‌లోకి వెళ్తే మోసపోయేది సామాన్యులే. ఎందుకంటే వారు బ్యాంకులకు వెళ్లి మార్చుకోలేరు. లేదంటే నఖిలీ కరెన్సీ ఉన్నందుకు తిరిగి పోలీసుల వేధింపులు ఎదుర్కోవాల్సివస్తుంది. అంతే కాదు, డమ్మీ పిస్టల్స్‌, బుల్లెట్లు కూడా ఆయా ముఠాల వద్ద లభ్యం కావడం చూస్తుంటే బ్యాక్‌మెయిలింగ్‌ ఎలా పెరిగిపోతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ కేసుపై నగరంలో ముమ్మర చర్చ సాగుతుండగానే డబ్బులకోసం పిల్లల్ని కిడ్నాప్‌ చేసిన వ్యభిచార చేయించే ముఠా కేసు రచ్చకెక్కింది. వ్యభిచారంలో సంపాదించింది చాలదన్నట్టు ఏకంగా పసిపిల్లల్ని టార్కెట్‌చేసుకుని ఎక్కడికక్కడ కిడ్నాప్‌లకు తెగబడ్డారు. రూ.లక్ష, రూ.50వేలు చొప్పున సంతలో గొర్రె పిల్లల్ని అమ్మేసినట్టు విక్రయించేస్తున్నారు. ఆరిలోవకు చెందిన నాగమణి, ఆమెతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న సంపత్‌కుమార్‌, జెన్నం ఆనంద్‌ అలియాస్‌ చందు, అలియాస్‌ శేఖర్‌ పాల్పడిన అకృత్యాలే ఇందుకు నిదర్శనం. వీరంతా కలిసి ఏలూరు, నక్కపల్లిలో చిన్నపిల్లల్ని అమ్మేశారు. ఇవి కేవలం పోలీసులు బయటపెట్టిన కేసులు మాత్రమే. డబ్బుకోసం కుటుంబీలకులపై దాడులు చేయడం, లేదా మానసికంగా హింసించడం వంటి పరిణామాలెన్నో ఉంటున్నాయి. ఇలా మోసపోతున్నవారిలో కొంతమంది మాత్రమే పోలీస్‌స్టేషన్ల వరకు వెళ్తున్నారు. పరువు పోతుందనే భయంతో స్టేషన్‌కి వెళ్లనివారు, మెట్లవరకు వెళ్లి వెనుదిరిగినవారు కొకొల్లాలుగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మహానగరంలో మాయగాళ్లు రోజురోజుకీ పెరుగుపోతున్నారనే చెప్పుకోవచ్చు. మానవ విలువలు రోజురోజుకీ దిగజారిపోతున్న నేపథ్యంలో పిల్లలపట్ల తల్లిదండ్రులు అత్యంత ఏకాగ్రతతో మెలగాల్సిన అవసరం ఉంది. అటు ఎదుటిమనిషిని మోసం చేయాలనుకునేవాళ్లూ నేటి ఆధునిక యుగంలో ఎప్పుడోఒకప్పుడు పాపం పండుతుందని గుర్తెరగాలి.