పోరాటాలకు సిద్ధమౌతున్న జనసేనాని - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పోరాటాలకు సిద్ధమౌతున్న జనసేనాని

విజయవాడ, ఆగస్టు 3, (way2newstv.com)
సొంత తప్పును ఒప్పుకోవడం అంత సులభంగా సాధ్యం కాదు. అందుకు సర్వసంగ పరిత్యాగి అయినా ఉండాలి. ముక్కుసూటి తనంతో ఎదురయ్యే పరిణామాలకు వెరవక ఎదుర్కొనే సాహసి అయినా కావచ్చు. ఆత్మావలోకనం కచ్చితంగా మంచిదే. తప్పులను దిద్దుకుని ధైర్యంగా సక్రమ పంథాను అనుసరించడానికి అవకాశం ఉంటుంది. జనసేన సమీక్షల్లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చకు తావిస్తున్నాయి. తన ఆలోచనలను క్యాడర్, దిగువ శ్రేణి నాయకత్వం పట్టుకోలేదనే భావనను పవన్ వ్యక్తం చేశారు. బలంగా పాతుకుని ఉన్న రెండు ప్రధాన పార్టీలకు పోటీగా నిలవడమంటే మాటలు కాదు. పరిస్థితులు సానుకూలంగా ఉండాలి. శ్రేణులు కలిసి కట్టుగా కదలాలి. 
పోరాటాలకు సిద్ధమౌతున్న జనసేనాని

ప్రజలను పోలింగు బూతుల వైపు కదలించగలగాలి. అన్నిటికీ మించి పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కలిగించాలి. అత్యంత ఆకర్షణ కలిగిన జన సమ్మోహక నాయకుడు నేతృత్వం వహిస్తున్నప్పటికీ రాజకీయ పార్టీగా జనసేన విఫలమైంది. ఈవీఎంలు, ధన ప్రభావం వంటి అనేక సాకులు చెప్పుకోవచ్చు. కానీ వాటన్నిటికీ మించి జనసమూహాలకు దిశానిర్దేశం చేయడంలో వైఫల్యం వెంటాడింది. పవన్ కల్యాణ్ ఆ గుట్టునే విప్పి చెప్పారు. ఒక కొత్త పార్టీ అధికార ప్రస్థానానికి చేరుకోవాలంటే అనుసరించకూడని తప్పులను బయటపెట్టారు.నాయకుడి ఆకర్షణను ప్రజాదరణగా మలచుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది జనసేన. అదే విషయాన్ని పవన్ కల్యాణ్ ఎత్తిచూపుతున్నారు. తన చుట్టూ చేరి తన కోసం పాకులాడితే సరిపోదు. ప్రజల్లోకి వెళ్లాలి. నాయకులు, పార్టీ కార్యకర్తలు అది చేయలేదు. పైపెచ్చు ఎంతోకొంత ఆదరణ ఉన్నచోట్ల గ్రూపులు కట్టి విజయాన్ని చేజేతులారా నాశనం చేసుకున్నారు. సైకోఫాన్సీగా తనను ఆరాధిస్తూ వాస్తవ ప్రపంచంలో లేకపోవడం పాలిటిక్స్ లో జనసేనను దెబ్బతీసిందన్న విషయాన్ని పవన్ కల్యాణ్ గ్రహించారు. అందుకే క్యాడర్ కు హెచ్చరిక కావచ్చు. సూచన కావచ్చు. ఘాటుగానే చెప్పేశారు. అపజయం అనంతరం ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న పవన్ కల్యాణ్ తన అభిమాన గణాన్ని ముందుగా దారిలో పెట్టుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు. జనసేనకు బలమూ, బలహీనత రెండూ కూడా అభిమానులే. వెల్లువెత్తే వరద లాంటి అభిమానాన్ని ఒడిసిపట్టి ఓట్లుగా మలచకపోతే వృథాగా సముద్రం పాలవుతుంది. ప్రాంతీయ పార్టీలు నాయకుడి కేంద్రంగానే రూపుదిద్దుకుంటుంటాయి. కానీ దానిని అంతటితో పరిమితం చేయకుండా క్షేత్రస్థాయి ప్రజా సమస్యలతో ముడిపెట్టి పార్టీని రూపుదిద్దాలి. నాయకుడి ఆకర్షణను ప్రజాదరణగా మలిచేందుకు ద్వితీయ శ్రేణి నాయకత్వం సిద్ధంగా ఉండాలి.మంచి ఆశయాలతో జీరో బేస్ డ్ పాలిటిక్స్ నడపాలని పవన్ కల్యాణ్ యోచించడం గొప్ప నిర్ణయం. కానీ గ్రౌండ్ లెవెల్ వాస్తవాలు వేరుగా ఉన్నాయి. ఆర్థికంగా, అంగబలం రీత్యా వైఎస్సార్ కాంగ్రెసుపార్టీ, టీడీపీ నువ్వా ? నేనా? అన్నట్లుగా తలపడ్డాయి. జనసేన మాత్రం మద్యం పంచకూడదు. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనకూడదనే నియమాన్ని పెట్టుకుంది. వచ్చే ప్రతి ఓటూ స్వచ్ఛందంగా ప్రజలు మనస్ఫూర్తిగా ఇష్టపడే వేయాలనే నిబంధన తనకు తాను విధించుకుంది . వేల రూపాయలు కుటుంబాల వారీ గంపగుత్తగా పంచి మరీ ఓట్లు వేయించుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఈ రకమైన నైతిక సిద్దాంతం తక్షణ ఫలితాలను ఇవ్వడం కష్టమే. కానీ ఒక సత్సంప్రదాయాన్ని ప్రజాజీవితంలోకి తీసుకురావాలనే పవన్ కల్యాణ్ ప్రయత్నం. ఫలితం నెగటివ్ అయినప్పటికీ నైతికంగా జనసేన ఒక స్వచ్ఛమైన పార్టీగా క్లెయిం చేసుకోవడానికి వీలు చిక్కింది. తమ హీరోపై ఉండే అభిమానం ఓట్ల రూపంలో వస్తుందనుకున్న ఫ్యాన్స్ అంచనాలు ఫెయిల్ అయ్యాయి. పార్టీని నియోజకవర్గాల వారీ నిర్మించుకోకుండా గాలికి వదిలివేశారు. తమ పార్టీపై వచ్చే విమర్శలకు సోషల్ మీడియాలో ఘాటైన ప్రతి విమర్శలతో తిప్పికొట్టడంతో సరిపోతుందనుకున్నారు. కర్ణుడి చావుకు ఆరు కారణాలన్నట్లుగా జనసేన జెండా ఎగరకపోవడానికి అభిమానుల అత్యుత్సాహమూ ఒక కారణంగా నిలిచింది.ఒక కవాతు నిర్వహిస్తే పది లక్షల మంది అభిమానులు వెల్లువలా తరలివచ్చారు. అంతటి ఆదరణ ఉన్న పార్టీ ఎందుకిలా చతికిలపడిందన్న పవన్ కల్యాణ్ ఆవేదనలో అర్థముంది. పార్టీని ప్రతిగ్రామానికి, ప్రతి ఇంటికీ, కుటుంబానికి విస్తరించాల్సిన బాధ్యత పార్టీ క్యాడర్ దే. ఒక సినిమా సక్సెస్ కావాలంటే అభిమానులు పదిసార్లు చూస్తే సరిపోతుంది. అదే సినిమా అందరినీ అలరించేలా తీస్తే సూపర్ సక్సెస్ సాధిస్తుంది. జనసేన అభిమానులకే పరిమితమైపోవడంతో పవన్ ఆశయాలు, సిద్దాంతాలు వట్టిపోయాయి. మీరంతా నాచుట్టూ తిరిగితే ఏం లాభమంటూ చివరికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్వయంగా చికాకు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధినేతలో వచ్చిన రియలైజేషన్ అభిమానుల్లో ఏర్పడినప్పుడే పార్టీకి మంచి రోజులు వస్తాయి. గడచిన నాలుగు దశాబ్దాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయిదు ప్రాంతీయ పార్టీలు బలంగా దూసుకు వచ్చాయి. తెలుగుదేశం ఏర్పడినప్పుడు రాజకీయంగా ఉన్న శూన్యత కలిసొచ్చింది. ఎన్టీరామారావుకు సైతం అభిమానులే అండ. కానీ అప్పుడు ఉన్న రాజకీయవాతావరణం కొత్త పార్టీకి సానుకూలంగా ఉంది. అలాగే టీఆర్ఎస్ ఏర్పడినప్పుడు తెలంగాణ సెంటిమెంటు ఆపార్టీకి కలిసొచ్చింది. పార్టీ నిర్మాణం కంటే ప్రజల్లో ఉన్న భావోద్వేగమే పెద్ద నిర్మాణంగా పనికొచ్చింది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని కాంగ్రెసు పార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రజలు సొంతం చేసుకోవడంతో రాజశేఖరరెడ్డి సెంటిమెంటు కలిసొచ్చింది. ఎట్ ద కాస్ట్ ఆఫ్ కాంగ్రెసు వైసీపీ రూపుదిద్దుకుంది. ప్రజారాజ్యానికి, జనసేనకు ఆ రకమైన రాజకీయ పరిస్థితులు లేకపోవడంతో తొలి ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోయాయి. పార్టీ నిర్మాణమంటే ఇంటింటికీ సిద్దాంతం చేరుకునేలా క్షేత్రస్థాయి ఆచరణ. ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి తామే ప్రత్యామ్నాయమని నిరూపించుకునేలా ప్రజాసమస్యలపై ఆందోళన. ప్రజల్లో అన్ని వర్గాలకు అండగా ఉంటామనే భరోసా తో కూడిన కార్యాచరణ. ఇందుకు పూనిక వహించినప్పుడే పవన్ సిద్దాంతాలకు ప్యాన్స్ చిత్తశుద్ది వెల్లడవుతుంది. జనసేన సుదీర్ఘ రాజకీయపోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు తేటతెల్లమవుతుంది.