వారసుడిగా... ఒప్పులకోలేకపోతున్నారు... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వారసుడిగా... ఒప్పులకోలేకపోతున్నారు...

విజయవాడ, ఆగస్టు 12, (way2newstv.com)
తెలుగుదేశం పార్టీ వయసు 37 సంవత్సరాలు. అరవయ్యేళ్ళపుడు అన్నగారు పార్టీని పెట్టి పద్నాలుగేళ్ళ పాటు అధ్యక్షుడిగా, సీఎం గా పనిచేశారు. ఆయన నుంచి అధికారం, పార్టీని తీసేసుకున్న చంద్రబాబు ఇప్పటికి 23 ఏళ్ళుగా నాటౌట్ అన్నట్లుగా ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. పదమూడేళ్ళ‌ పాటు ముఖ్యమంత్రిగా పదేళ్ళ పాటు ప్రతిపక్ష నేతగా ఉన్న బాబు తిరిగి మళ్ళీ విపక్ష పాత్రలోకే వచ్చేశారు. ఇపుడు చంద్రబాబు వయసు డెబ్బయ్యేళ్ళు. టీడీపీలో నంబర్ టు గా ఉన్న లోకేష్ టీడీపీ పుట్టడానికి కొన్ని నెలల ముందు పుట్టాడు. అన్న గారి వారసుడుగా ఆయన చెప్పకుండానే పదవిని, పార్టీని లాగేసుకున్న చంద్రబాబుకు లోకేష్ మాత్రం అచ్చమైన వారసుడు కాడంటున్నారు తమ్ముళ్ళు.బాబు అన్నీ చెప్పి పార్టీ నీదే అంటున్నా లోకేష్ మాత్రం ఎదగలేకపోతున్నాడట. 
వారసుడిగా... ఒప్పులకోలేకపోతున్నారు...

అయిదు ముఖ్యమైన శాఖలు ఇచ్చి రెండేళ్ల పాటు మంత్రి కుర్చీలో కూర్చోబెట్టినా లోకేష్ పొలిటికల్ మైలేజ్ మాత్రం ఇంచ్ కూడా పెరగలేదని తమ్ముళ్ళే అంటున్నారు. అటువంటి లోకెష్ భావి వారసుడు అంటే తమ్ముళ్ళే జడుసుకుంటున్నారుట. చినబాబుని నెత్తిన రుద్దవద్దని గట్టిగానే బాబుకు కోరుతున్నారట. ఇదిలా ఉండగా టీడీపీ ఎందుకు ఓడిపోయింది అని బాబు ఒకటే మధన పడుతున్నారు, ఆ కారణం ఆయనకు పుత్ర వాత్సల్యంలో తెలియ‌కపోవచ్చు కానీ తమ్ముళ్ళు మాత్రం కనిపెట్టేశారు. ఈసారి ఏపీలో టీడీపీ జెండా ఎగరకపోవడానికి లోకేష్ కారణమని బాబు ముఖం మీదే తమ్ముళ్ళు చెబుతున్నారుట. పాటీలోనూ, ప్రభుత్వంలోనూ బాబు తరువాత నంబర్ టూ గా ఉన్న లోకేష్ బాబే భావి సీఎం అని భావించిన తెలుగు జనాలు తెలివిగా టీడీపీకి ఓటేయలేదని తమ్ముళ్లు పార్టీ సమీక్షల్లో చెప్పారట. చంద్రబాబు అంటే పరిపాలనా, అనుభవం అన్నీ ఉన్నాయని జనం 2014లో పట్టం కట్టారని, ఇక 2019లో చంద్రబాబుకి ఓటేస్తే ఎక్కడ తన పుత్ర రత్నాన్ని తెచ్చిపెడతారోనన్న అనుమానంతోనే జనం జగన్ కి జై కొట్టారని అంటున్నారు. అంటే ఓ విధంగా 2019 ఎన్నికలు జగన్, వర్సెస్ లోకేష్ గా జరిగాయని కూడా విశ్లేషిస్తున్నారు.ఇదే విషయాన్ని టీడీపీ తెలుగు యువత ప్రెసిడెంట్ దేవినేని అవినాష్ చంద్రబాబు ఎదుటే చెప్పారట. తొందరలోనే వైసీపీలోకి మారిపోతాడనుకుంటున్న అవినాష్ తాను చంద్రబాబు నాయకత్వంలో పనిచేయగలనని స్పష్టంగా చెప్పేశారట. లోకేష్ కి పగ్గాలు అప్పగిస్తే ఉండలేనని కూడా క్లారిటీగా వివరించేశారట. లోకేష్ తనని చిన్న చూపు చూస్తున్న సంగతిని కూడా ఆయన బాబుకు ఫిర్యాదు చేశారట. ఇక లోకేష్ విషయంపైనే టీడీపీలో ముసలం పుడుతోందని పార్టీలో అత్యధికులు అంటున్నారు. విజయవాడ ఎంపీ కేసినేని నాని లోకేష్ తీరుకు వ్యతిరేకంగానే బాబుకు దూరం జరిగారని అంటున్నారు. అదే విధంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సైతం టీడీపీలో ఉండలేకపోవడానికి లోకేష్ పెత్తనమేనని అంటున్నారు. మొత్తం మీద తాను ఎందుకు ఓడిపోయానో బాబుకు తెలియకపోవచ్చు కానీ పార్టీలోని మిగిలిన వారేందరికీ తెలిసిపోయింది. దాన్ని వారంతా బాబుకు ధైర్యంగా చెప్పేస్తున్నారు. కానీ బాబు మాత్రం లోకేష్ నే కావాలంటున్నారు. మరి టీడీపీ సంగతి ఏంటో చూడాలి.