గిట్టుబాటి కాని హరితహారం (ఆదిలాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గిట్టుబాటి కాని హరితహారం (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, ఆగస్టు 21 (way2newstv.com): 
తెలంగాణకు హరితహారంలో భాగంగా ప్రస్తుతం గ్రామాల్లో ముమ్మరంగా మొక్కలు నాటుతున్నారు. ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాల ఆవరణలు, రహదారుల పక్కన, చెరువు గట్టు, పొలాల్లో మొక్కలు నాటేందుకు ప్రభుత్వం కూలీలను వినియోగిస్తోంది. ఈ ఏడాది మొదట్లో తగినంత వర్షాలు కురవకపోవడంతో కార్యక్రమం ఆలస్యమైంది. ఇటీవల జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో ముమ్మరంగా మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతోంది. గుంతలు తవ్వేందుకు కూలీలకు సంబంధించిన కూలి గిట్టుబాటు కాకపోవడం సమస్యగా మారింది. గతం కంటే కూలి ధర తగ్గించడంతో పనుల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. 
గిట్టుబాటి కాని హరితహారం (ఆదిలాబాద్)

హరితహారం లక్ష్యం ఎక్కువ ఉండగా గుంతలు తవ్వేందుకు కూలీలు రాకపోవడం కార్యక్రమం అమలుపై ప్రభావం చూపుతుందనే ఆందోళన కలిగిస్తోంది. ఏపుగా పెరిగిన ఈ చెట్టు గతేడాది తాంసి రహదారి పక్కన నాటినది. మొక్క నాటేందుకు వీలుగా గుంత తీయడానికి ఉపాధిహామీ కూలీలకు రూ.17.90, మొక్కను గుంతలో నాటడానికి రూ.3.75, ఊతకర్రకు రూ.1.46 ఇచ్చారు. కానీ ఈ ఏడాది కూలీ ధరలు పూర్తిగా తగ్గించారు.ఫ గుంత తీయడానికి రూ.4.84, నాటేందుకు రూ.1.22, ఊతకర్రకు రూ.1.22 నిర్ణయించడంతో మొక్కలు నాటేందుకు కూలీలు ఆసక్తి చూపడం లేదు.
ఈ ఏడాది నిర్దేశించుకున్న 1.36 కోట్ల లక్ష్యం మేరకు అటవీ, గ్రామీణ అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో సరిపడా మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. అటవీ శాఖ అధికారులు 61 నర్సరీలను నిర్వహించగా వాటిలో 63 లక్షలు, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 330 నర్సరీలలో 99 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో 10 శాతం మొక్కలు నాటేందుకు పనికిరాకుండా పోయినా.. లక్ష్యానికి సరిపడా మొక్కలు అందుబాటులో ఉంటాయని వారు చెబుతున్నారు. జులైలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినా, వరుణుడు కరుణించకపోవడంతో ప్రారంభించలేదు. ప్రస్తుతం సరిపడా వర్షాలు కురుస్తుండటంతో మొక్కలు నాటేందుకు అనువైన వాతావరణం ఏర్పడింది. ఇళ్లతో పాటు గ్రామాల్లోని రహదారుల వెంట, ఖాళీ స్థలాల్లో కూలీల సాయంతో మొక్కలు నాటుతున్నారు. ఈ గుంతలకు సంబంధించి కొంతవరకు మెరుగైన వేతనం అందిస్తున్నా పొలాల్లో గట్టుపైన, ఖాళీ స్థలాల్లో నాటే టేకు, పండ్లు, ఇతర మొక్కలకు.. శ్మశానం, చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేసే మొక్కల కోసం తీసే గుంతల తవ్వకానికి మాత్రం చాలా తక్కువగా వేతనం ఇస్తుండటంతో గుంతలు తీసేందుకు కూలీలు ఆసక్తి కనబర్చడం లేదు. గతేడాది 23,450 మంది కూలీలు పాల్గొంటే, ఈ ఏడాది ఇప్పటి వరకు 2 వేల మంది వరకే కూలీలు హరితహారం పనులకు హాజరయ్యారు.ఏటా హరితహారంలో మొక్కలు నాటేందుకు లక్ష్యానికి అనుగుణంగా గుంతలను తీయించాల్సి ఉంటుంది. గుంతల తవ్వకంలో రేట్లు తగ్గాయని కూలీలు ఆసక్తి చూపడం లేదు. గతేడాది అడుగున్నర లోతు, వెడల్పుతో గుంత తీసినందుకు రూ.17.90 ఇచ్చారు. ప్రస్తుతం ఒక్క అడుగు మాత్రమే గుంత తీస్తే సరిపోతుందనే కారణంతో ఒక్కో గుంతకు రూ.4.84 ఖరారు చేశారు. నిబంధనల ప్రకారం ఉపాధి కూలీ రోజుకు రూ.211గా నిర్ణయించారు. గతేడాది ఇదే కూలీకి 12 గుంతలు తీస్తే సరిపోగా, ప్రస్తుతం నిబంధనల ప్రకారం అంత కూలీ రావాలంటే గుంతల పరిమాణం తగ్గించినా రోజుకు ఒక్కొక్కరు 40 వరకు తీయాల్సి ఉంటుంది. మొక్క నాటినందుకు గతేడాది రూ.3.75 ఇవ్వగా, ఇప్పుడు దానిని రూ.1.22కు తగ్గించారు. మొక్కకు ఊతకర్ర ఏర్పాటు చేసేందుకు గతేడాది రూ.1.46 ఇవ్వగా, ఇప్పుడు రూ.1.22 ఖరారు చేశారు. ఈ పరిస్థితి వల్ల రోజంతా శ్రమించినా వేతనం గిట్టుబాటు కాదని కూలీలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.