చింతమనేని హవాకు బ్రేకేనా... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చింతమనేని హవాకు బ్రేకేనా...

ఏలూరు, ఆగస్టు 19, (way2newstv.com)
నిన్న మొన్నటి వ‌ర‌కు అక్కడ చింత‌మ‌నేని ప్రభాక‌ర్ మాట‌కు తిరుగులేదు. ఆయ‌న చెప్పిందే వేదం, ఆయన ఆదేశ‌మే శాస‌నం. అయితే, ఒక్క ఓట‌మితో అంతా తారుమారైంది. ఆయ‌నను ప‌ట్టించుకునే నాధుడే క‌నిపించ‌డం లేదు. అంతేకాదు, ఆయ‌న అసలు ఇంటి నుంచి కాలు తీసి బ‌య‌టకు కూడా పెట్టలేని ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రి ఇంత‌లోనే అంత మార్పెందుకు వ‌చ్చింది ? ఇక‌, చింత‌మ‌నేని హ‌వాకు బ్రేక్ ప‌డిన‌ట్టేనా? ఇప్పుడు ఈ చ‌ర్చ జోరుగా సాగుతోంది. విష‌యంలోకి వెళ్తే.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజక‌వ‌ర్గంలో వ‌రుస విజ‌యాలు సాధించి.. త‌న‌కంటూ ప్రత్యేక కోట‌ను నిర్మించుకున్నారు చింత‌మ‌నేని ప్రభాకర్.ఆయ‌న టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కుడిగా ఉన్నా.. పార్టీ క‌న్నా కూడా త‌న హ‌వానే ఎక్కువ‌గా పెంచుకున్నా రు. 
చింతమనేని హవాకు బ్రేకేనా...

ఒక్క మాట‌తోనే ఆయ‌న త‌న ప‌నులు పూర్తి చేసుకున్నారు. త‌న అనుకున్న వారికి అన్ని ప‌నులు చేసి పెట్టారు కూడా. ఈ క్రమంలోనే ఆయ‌న అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. కొన్ని సంద‌ర్భాల్లో పార్టీ అధినేత ఆదేశాల‌ను కూడా ప‌క్కన పెట్టి తాను అనుకున్నది చేసుకున్నారు. తన మాటే నెగ్గాల‌న్న ఆక్రోశ‌మే చింత‌మ‌నేనిలో ఎక్కువుగా క‌నిపిస్తుంటుంది.ఈ క్రమంలోనే ఆయ‌న అనేక వివాదాల‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓ కాంట్రవ‌ర్సీ పొలిటిషీయ‌న్‌గా మారిపోయాడు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌ను అభిమానించేవారి క‌న్నా.. కూడా ఆయ‌న‌కు శ‌త్రువులే ఎక్కువ‌య్యారు. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున ఇక్కడ నుంచి పోటీ చేసిన విద్యావంతుడు, యువ‌కుడు, ప్రభాక‌ర్‌ సామాజిక వ‌ర్గానికి చెందిన కొఠారు అబ్బయ్య చౌద‌రిని ప్రజ‌లు గెలిపించారు. దీంతో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంపై అత్యంత స్వల్ప కాలంలోనే గ్రిప్ పెంచుకున్నారు. ప్రతి స‌మ‌స్యను త‌నదిగా భావించి వాటికి ప‌రిష్కారాలు చూపుతున్నారు.అంత‌టితో ఆగిపోకుండా ఆయ‌న చింత‌మ‌నేని కంచుకోట‌లు క‌రిగిస్తూ వైసీపీని బ‌లోపేతం చేసేందుకు వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నాడు. ఆయ‌న గ్రూపు రాజ‌కీయాల‌కు దూరంగా అంద‌రితోనూ స‌ఖ్యత‌తో ఉండ‌డంతో… ఇప్పుడు దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రింత‌గా చింత‌మ‌నేని హ‌వా త‌గ్గిపోతోంద‌ని అంటున్నారు. టీడీపీలో అసంతృప్తులను సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమాన్ని అబ్బయ్య చౌద‌రి చేప‌ట్టారు. ఈ క్రమంలో చింత‌మ‌నేనిని వ్యతిరేకించే వ‌ర్గాన్ని కూడా ఆయ‌న పిలుస్తున్నారు. దీనికి ప‌లు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. వారు కూడా పార్టీ మారేందుకు చింత‌మ‌నేని వ్యవ‌హార శైలిపై వ్యతిరేకంగా ఉండ‌డ‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది.చింతమనేని ప్రభాకర్ దూకుడును ఇష్టప‌డ‌నివారు… ఆయ‌న చేత రాజ‌కీయంగా అణ‌గ‌దొక్కబ‌డిన వారు ఇప్పుడు అబ్బయ్య చౌద‌రికి జై కొడుతున్నారు. అదే స‌మ‌యంలో ఆయ‌నలో అంద‌రినీ క‌లుపుకొని పోయే మ‌న‌స్తత్వం కూడా వారిని పార్టీ మారేలా చేస్తోంది. వ‌చ్చే ఐదేళ్లపాటు ప్రతిప‌క్షంలో ఉండి చేసేది ఏముందని భావించే వారు కూడా ఉండ‌డంతో టీడీపీ హ‌వా ఇక్కడ త‌గ్గిపోతోంది. అదే స‌మ‌యంలో చింత‌మ‌నేని వ‌ర్గంలోనూ చీలిక వ‌స్తోంది. మొత్తానికి రాబోయే రోజుల్లో దెందులూరులో చింత‌మ‌నేని కోట క్రమ‌క్రమంగా క‌రగ‌డం ఖాయ‌మ‌న్న టాక్ ఇప్పుడు ప‌శ్చిమ‌లో హాట్ టాపిక్‌.